ఇదీ హైవే | high way | Sakshi
Sakshi News home page

ఇదీ హైవే

Published Sun, Jul 31 2016 9:31 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

ఇదీ హైవే

ఇదీ హైవే

  • గోతులతో అధ్వానంగా జాతీయ రహదారి 216
  • కనీస మరమ్మతులు లేవు
 
పెద్దపెద్ద గోతులు.. ప్రమాద భరితంగా ఉన్న మార్జిన్లు.. రాళ్లు తేలి అధ్వానంగా కనిపిస్తున్న ఈ రహదారి ఏదో మారుమూల గ్రామంలోదో కాదు. ఇది జాతీయ రహదారి 216. మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా గుర్తించిన పోర్టుల కనెక్టవిటీ కీలక రహదారుల్లో ఇది ఒకటి. అంతటి ప్రాధాన్యమున్న ఈ రహదారి కొన్నేళ్లుగాకనీస మరమ్మతులకు సైతం నోచుకోలేదు. దాంతో అమలాపురం – కాకినాడ– కత్తిపూడి ప్రయాణం నరకప్రాయంగా మారింది.
 
అమలాపురం :
జిల్లాలోని కత్తిపూడి నుంచి కృష్ణా జిల్లాలోని పామర్రు వరకు 216 జాతీయ రహదారి 240 కి.మీ. మేర ఉంది. ఈ రహదారిని  త్వరలో నాలుగు లైన్లుగా విస్తరించే తొలి దశ పనులు మొదలు కానున్నాయి. ఆ పనులు జరుగుతాయని చెప్పి ధ్వంసమైన ఈ రహదారికి కనీస మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. దాంతో ముమ్మిడివరం మండలం అనాతవరం, గాడిలంక, అన్నంపల్లి, పిఠాపురం నియోజకవర్గ పరిధిలో పిఠాపురం బైపాస్‌ రోడ్డు, కత్తిపూడి సమీపంలో గోతులమయంగా మారింది. రెండు,మూడు అడుగుల వైశాల్యంలో ఏర్పడిన గోతులతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళల్లో ద్విచక్రవాహనాలు గోతుల్లో పడడంతో ప్రమాదాల పాలవుతున్నారు. కత్తిపూడి నుంచి కాకినాడ వరకు రహదారి అధ్వానంగా మారింది. అసలే ఇరుకుగా ఉండే ఈ రోడ్డు ధ్వంసం కావడంతో ప్రయాణం సాఫీగా సాగడం లేదు. కాకినాడ నుంచి కత్తిపూడి చేరడానికి సాధారణంగా గంట సమయం ఎక్కువ. కానీ ఇప్పుడు రెండు గంటలకు పైగా  పడుతోంది. గత ఏడాది అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఈ రహదారికి ఆధునికీకరణ పనులు చేపట్టారు. అనాతవరం నుంచి మురమళ్ల వరకు పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. 
కీలక రహదారిపై ఇంత అశ్రద్ధా?
త్వరలో రహదారిని విస్తరిస్తారనే సాకుతో ఇప్పుడు కనీసం మరమ్మతులు సైతం చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోడసకుర్రు వంతెన ఆరంభమైన తరువాత పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా రాజోలు పరిసర ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి ఈ రహదారి మీదుగా రవాణా పెరిగింది. గతంలో భీమవరం, నర్సాపురం నుంచి సిద్ధాంతం, రావులపాలెం, రాజమహేంద్రవం, కత్తిపూడి మీదుగా ఎన్‌హెచ్‌–16 మీద లారీలు, ఇతర వాహనాల రాకపోకలు ఎక్కువగా సాగేవి. ఒడిశా, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌కు ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చేపలలోడు లారీలు రాకపోకలు సాగిస్తాయి. ఇప్పుడు ఈ కొత్తమార్గంలో దూరం తగ్గడంతో వాహనాల రాకపోకలు దీనిపై ఎక్కువగా ఉన్నాయి. అయితే గోతులమయమైన ఈ దారిలో ప్రయాణకాలం ఎక్కువ అవుతుండడంతో తిరిగి పాతరహదారినే వినియోగిస్తున్నారు.  ఈ జాతీయ రహదారిపైS అమలాపురం నుంచి విశాఖ, కాకినాడ వెళ్లే ప్రయాణికులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. గమ్యం చేరడం ఆలస్యం కావడంతోపాటు కుదుపులకు ఒళ్లు హూనమైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌హెచ్‌ అధికారులు ఈ జాతీయ రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement