ప్రమాద హేతువులు
ఇక వీటికి చెల్లు జిల్లాలో హైవేల పక్కన 39 మద్యం దుకాణాలు ఈ ఏడాది 266 ప్రమాదాలు, 82 మంది మృత్యువాత రహదారుల ప్రమాదాలపై స్పందించిన సుప్రీం కోర్టు వైన్స్‌లు తొలగించాలని ఆదేశాలు
నిజామాబాద్ ౖక్రెం : రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో సగానికి పైగా మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్నవే ! ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న మద్యం దుకాణాలను వచ్చే సంవత్సరం మార్చి 31 తర్వాత అక్కడి నుంచి తొలగించాలంటూ ప్రభుత్వాలకు గట్టి ఆదేశాలు ఇచ్చింది. హైవేలకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశించింది. రోడ్ల పక్కన నుంచి తొలగించని దుకాణాల లైసెన్స్‌లు రెన్యూవల్ చేయారాదని సూచించింది. జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులపై మొత్తం 39 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు జాతీయ, రాష్ట్ర రహదారులపై మొత్తం 266 ప్రమాద ఘటనలు చోటుచేసుకోగా, 82 మంది మృత్యువాత పడ్డారు. 263 మంది క్షతగాత్రులయ్యారు. ఇంటి పెద్ద మరణించడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తీవ్రంగా గాయాలపాలై మరి కొందరు అవిటివారయ్యారు. వీటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టక పోవటంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది.
182 కిలో మీటర్లు 39 దుకాణాలు ...
జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులు మొత్తం 182 కిలోమీటర్లు కలిగి ఉన్నాయి. ఈ రహదారులపై మొత్తం 39 మద్యం దుకాణాలు ఉండగా.. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక మద్యం దుకాణాం ఉన్నట్లు లెక్క. నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారి నం 44 పై చంద్రయన్‌పల్లి నుంచి సోన్ బ్రిడ్జి వరకు 65 కిలోమీటర్ల పరిధిలో 7 మద్యం దుకాణాలు, జాతీయ రహదారి 63 నిజామాబాద్ నగరంలోని రైల్వేకమాన్ నుంచి కమ్మర్‌పల్లి వరకు 55 కిలోమీటర్లు పరిధిలో 22 మద్యం దుకాణాలు ఉన్నాయి.
రాష్ట్ర రహదారి నం.25 నగరంలోని తిలక్‌గార్డెన్ నుంచి నర్సి బ్రిడ్జి వరకు 41 కిలో మీటర్ల పరిధిలో 4 మద్యం దుకాణాలు ఉన్నాయి. సంగారెడ్డి నుంచి ఆదిలాబాద్ జిల్లా బైంసా మెదక్, బాన్సువాడ, వర్ని, బోధన్ రోడ్డును జాతీయ రహదారిగా ఇటీవల ప్రకటించారు. రాష్ట్ర రహదారి నం.6 వర్ని నుంచి బోధన్ వరకు 21 కిలోమీటర్ల పరిధిలో 6 మద్యం దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులు మినహా అన్ని రోడ్లపై ఇప్పటి వరకు 500 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా వీటిలో 179 మృతి చెందారు. 483 మంది గాయపడ్డారు.