నడ్డివిరిచిన విద్యుత్ ఛార్జీలు
► పెరిగిన ఛార్జీలతో బతికేదేలా?
► పొదుపు పాటించకుటే బిల్లు మోతే
ఎల్.ఎన్.పేట: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకోవలసిన అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మరుసటి రోజునుంచే విద్యుత్ బిల్లులు మోత ప్రజల నెత్తిన పిడుగులా పడింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాల వారికి ఇచ్చిన వేసవి కానుక ఇది. చంద్రబాబు మూడేళ్ల పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచడం ఇది మూడోసారి. ఈనెల ఒకటో తేదీ నుంచి పెంచిన విద్యుత్ బిల్లు అమల్లోకి వచ్చాయి. పేద, బడుగు, బలహీన, మద్యతరగతి, ఉతన్న ఇలా ఏ వర్గాన్ని వదలకుండా అందరి నెత్తిన తలాకాస్త పెంచుకుంటు పోయారు. వినియోగదారుడు వాడుకునే ప్రతీ యూనిట్‌పైన పెంచిన ఛార్జీల భారం పడింది. ఇలా ఎడా పెడా పెంచుకుని పోతున్న విద్యుత్ ఛార్జీలను ఎలా భరించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రజల రోజు, నెలవారీ ఆదాయం (సంపాదన)లో ఎలాంటి పెరుగుదల లేకుండా పోతుంది. ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయని పలు వర్గాలకు చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. వేసవి కాలం కావడంతో పని చేసుకుని ఇంటికి చేరి విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికి పెరిగిన చార్జీలు షాక్‌కొడుతున్నట్లు ఉంటాయి. పిల్లలు టివీ చూస్తామన్న పెద్దలకు భయం పుట్టుకొస్తోంది.
ప్రజలకు మోసం చేస్తున్నారు: చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత ప్రజలకు మోసం చేసే కార్యక్రమాలే ఎక్కువుగా జరుగుతున్నాయి. బాబు మారిడాని నమ్మిన ప్రజలు గత ఎన్నికల్లో పట్టం గట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత తన పాత విధానాలే అవలంబిస్తోన్నారు. ప్రజలకు మోసం చేయడంలో ఆయన కంటే ఘనాపాటి ఎవరు లేరు. ---కిలారి త్రినాద్, వైఎస్సార్ సీపీ మండల కన్వినర్, యంబరాం, ఎల్.ఎన్.పేట
ప్రభుత్వమే భరించాలి: పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలి. అన్ని వర్గాల వారి కోసం కాకున్న కనీసం నెలకు 200 యూనిట్లు కంటే తక్కువగా విద్యుత్ వినియోగం చేసే లబ్దిదారులకు చెందిన ఛార్జీలను ప్రభుత్వమే భరించాలి. ఎప్పటికప్పుడు ఛార్జీలు పెంచుకుంటు పోవడం వలన కూలి చేసుకునే వారి కుటుంబాలకు అప్పులే మిగులుతాయి. ---బూర్లె లింగన్న, రైతు, మిరియాపల్లి, ఎల్.ఎన్.పేట