
అక్రమ నిర్మాణాలు కూల్చండి
- రసాభాసగా కౌన్సిల్ సమావేశం
- మున్సిపల్ స్థలాల ఆక్రమణపై దుమారం
- అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం
- వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు బైకాట్
హిందూపురం అర్బన్ : మున్సిపల్ స్థలాల ఆక్రమణలపై అధికార పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారుల మ«ధ్య వాదనలు దుమారం రేపాయి. అధికారులను టార్గెట్ చేసి ఒత్తిడి చేస్తే సెలవులపై వెళ్లిపోతామని వాకౌట్ చేశారు. అధికారులు లేని కౌన్సిల్‌లో ప్రజాసమస్యల పరిష్కారమేదంటూ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు బైకాట్‌తో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం శనివారం దద్దరిల్లిపోయింది.
కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ఏడాది చివరిరోజు శనివారం చైర్‌పర్సన్ ఆర్.లక్ష్మి అధ్యక్షతన కమిషనర్ పి.విశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగింది. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు నాగభూషణం, ఆసీఫ్‌వుల్లా మాట్లాడుతూ పట్టణంలో చెత్త గురించి ప్రస్తావించారు. పని చేయకుండానే జీతాలు ఎలా చెల్లిస్తారంటూ ప్రశ్నించారు. కౌన్సిలర్ షాజియా మాట్లాడుతూ పరిగి రోడ్డులోని మున్సిపల్ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా ఎందుకు స్పందించలేదన్నారు.
ఇంతలో టీడీపీ కౌన్సిలర్ రోషన్‌అలీ మాట్లాడుతూ ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ఎస్‌బీఐ వద్ద ఉన్న పే అండ్ యూజ్ లెట్రిన్లను మూడంతస్తులుగా నిర్మిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. కమిషనర్ స్పందించి నోటీసులు జారీ చేశామన్నారు. అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ పట్టణంలో అక్రమ నిర్మాణాలు పెరిగాయి.. నోటీసులు కాకుండా నిర్మాణాలు కూల్చివేయాలని సూచించారు.
అధికారులు, టీడీపీ కౌన్సిలర్ల వాగ్వాదం
సిబ్బంది తక్కువగా ఉన్నా.. తీవ్ర ఒత్తిడితో పని చేస్తున్నా.. తమపై పెత్తనం చేస్తే సహించేది లేదని మెప్మా టీపీఓ విజయభాస్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అదే రీతిలో మెప్మా విభాగంలో అవినీతిమయమని ఎలా చెబుతావంటూ సీపీఐ కౌన్సిలర్ దాదాపీర్‌పై కూడా వాదనకు దిగారు. అధికారులను టార్గెట్ చేస్తే సెలవులపై వెళ్లిపోతామంటూ వాకౌట్ చేశారు.
వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల బైకాట్
అవసరమైనప్పుడు అధికారులను మీరే వెనకేసుకొస్తారు. రెండేళ్లుగా ఆక్రమణలపై చర్యలు తీసుకోండంటూ నిలదీసినా ఉలుకూ పలుకూ లేదు. ఉన్నట్టుండి అధికారులను టార్గెట్ చేస్తూ 15 రోజుల్లో అన్నింటిపై చర్యలు తీసుకోవాలంటున్నారని వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ శివ, కౌన్సిలర్లు ఆసీ‹ఫ్‌వుల్లా, రెహెమన్ విమర్శించారు. అధికారులు లేని సమావేశంలో ప్రజాసమస్యలను ఎవరితో చర్చించాలంటూ ప్రతిపక్ష కౌన్సిలర్లు బైకాట్ చేశారు.