– రూ.48 లక్షల పనుల కోసం రాయబారాలు
– మున్సిపాల్టీలో అన్ని పనులు ఎక్సెస్‌కే
హిందూపురం అర్బన్ : పట్టణంలోని ఐదో వార్డులోని క్రిస్టియన్ శ్మశాన వాటిక నుంచి ధర్మపురం బ్రిడ్జి వరకు సుమారు 100 మీటర్ల పైగా డ్రైన్‌కు సీసీ లైనింగ్ పనుల టెండర్ వదులుకోవాలని మున్సిపాల్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుడు తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నట్లు సమాచారం. మున్సిపాల్టీలో ధర్మపురంలోని పెద్ద కాల్వకు సీసీ లైనింగ్ కోసం రూ.48 లక్షల నిధులు కేటాయించారు. అలాగే పార్కుల వద్ద పునరుద్ధరణకు రూ.50 లక్షలు, వీధిలైట్ల ఏర్పాటుకు రూ.10 లక్షలు కేటాయించి పనులకు ఈ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు ఆహ్వానించారు.
ఈ టెండర్ షెడ్యూల్స్ దాఖలు ఈనెల 20న ముగిశాయి. 23న టెండర్ల తెరవాల్సి ఉంది. ఈమేరకు డ్రైన్‌కు సీసీ లైనింగ్ నిర్మాణ పనులకు ఏడుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. పార్కు పనులకు ఎవరూ టెండర్ దాఖలు చేయలేదు. అలాగే మరో పనికి ముగ్గురు దాఖలు చేశారు. ఇందులో కీలక టెండర్ అయినా సీసీ లైనింగ్ వర్క్ కోసం అనంతపురం నగరానికి చెందిన ఓ కాంట్రాక్టర్ షెడ్యూల్డ్ కాస్ట్ కన్నా తక్కువగా కోడ్ చేసి దాఖలు చేయడంతో ఈ మేరకు ఆ వర్క్ ఆయనకే దక్కే అవకాశం ఉంది. దీంతో తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు టెండర్ దక్కే అవకాశం లేకపోవడంతో కీలక నాయకుడు రంగంలో దిగి రాయబారాలు మొదలుపెట్టినట్లు సమాచారం.
ఎక్సెస్ కోడ్ చేస్తేనే మిగులయ్యేది
కాంట్రాక్టర్‌తో ఆ నాయకుడు టెండర్ వదలుకోవాలని సుతిమెత్తగా హెచ్చరికలు చేస్తున్నారని తెలిసింది. తక్కువగా కోడ్ చేసి పనులు చేస్తే మీకు ఏమి మిగలదు. మీకే మిగలకపోతే మా పర్సెంటేజీ ఏమిస్తారని చెప్పినట్లు తెలియవచ్చింది. టెండర్ వదలుకుంటే కొంత ఎక్సెస్‌గా దాఖలు చేసిన మా కాంట్రాక్టర్‌కు వర్క్ వస్తుందన్నారు. పనులు చేసే సమయంలో ఇబ్బందులు వచ్చేస్తాయని చెప్పారని విశ్వసనీయ సమాచారం.
ఈప్రొక్యూర్‌మెంట్ పనుల్ని ఎస్‌ఈ నిర్ణయిస్తారు : ఇన్‌చార్జ్ కమిషనర్ రమేష్
ఇటీవల నిర్వహించిన ఈ ప్రొక్యూర్‌మెంట్ పనులకు టెండర్లు పూర్తయ్యాయి. వాటిని ఇంకా తెరవలేదు. 23న తెరవాల్సి ఉంది. కానీ ఒత్తిళ్ల కారణంగా చేయలేదు. పనులను ఎస్‌ఈకి పంపితే ఆయన ఖరారు చేస్తారు. తర్వాత కౌన్సిల్ ఆమోదానికి పెడతాం.
టెం‘డర్’
Published Sat, Jul 30 2016 11:19 PM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
Advertisement
Advertisement