22న జరిగే శంకుస్థాపన చరిత్రాత్మకం
♦ అమరావతి సంకల్పజ్యోతిని అందుకున్న ముఖ్యమంత్రి
♦ ప్రధాన వేదిక, హెలిప్యాడ్లు, రోడ్ల పనుల పరిశీలన
♦ బందోబస్తు, రాజధాని రైతులకు వసతులపై ఆరా
♦ పవిత్ర మట్టి, జలాల వద్ద ప్రత్యేక పూజల్లో సీఎం
సాక్షి, విజయవాడ బ్యూరో: నూతన రాజధాని నగర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో మరచిపోలేని చరిత్రాత్మక ఘట్టమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందుకోసం సాంప్రదాయంగా భారీగా ఏర్పాట్లు చేశామన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు శంకుస్థాపన జరిగే ఉద్ధండ్రాయునిపాలెం సభా ప్రాంగణం ప్రాంతానికి చేరుకున్న ముఖ్యమంత్రి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి బయలుదేరి ఉద్దండ్రాయునిపాలెం చేరుకున్న అమరావతి సంకల్పజ్యోతిని అందుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రధాన జ్యోతిని ఆవిష్కరించిన సీఎం కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు.
శంకుస్థాపన ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయనీ, కనీవినీ ఎరుగని రీతిలో కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అనంతరం ప్రధాన వేదిక, దాని పక్కనే ఉన్న రెండు ఉప వేదికలు, అక్కడే సిద్ధం చేసిన యాగశాల, శంకుస్థాపన శిలాఫలకాన్ని సీఎం పరిశీలించారు. ఇంకా పూర్తి చేయాల్సిన ఏర్పాట్లపై గుంటూరు జిల్లా కలెక్టర్, జేసీలతో చర్చించారు. అనంతరం రాజధాని రైతుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీని, సాంస్కృతిక కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, హెలిప్యాడ్లు, పార్కింగ్ ప్రదేశాల గురించి ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు.
పుణ్య జలాలు, మట్టిని కలిపి బుధవారం హెలికాప్టర్ ద్వారా సీఆర్ డీఏ ప్రాంతం అంతా చల్లిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ ప్రాంతం అంతా శక్తివంతం చేయటానికి, మట్టిని, నీటిని చల్లి పవిత్రం చేయాలని నిర్ణయించినట్లు సీఎం వివరించారు. మంగళవారం రాష్ట్రంలోని 13 జిల్లాలు, దేశంలోని పుణ్యక్షేత్రాల నుంచి వచ్చిన జలాలు, మట్టి ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఎదుట ఉన్న ప్రాంగణంలోకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అక్కడ జరిగిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు.
రాజధాని నిర్మాణం కోసం మహాసంకల్ప పత్రాలు అందించిన వారందరి జ్ఞాపకాలు చిరస్థాయిగా మిగిలేలా భద్రపరిచి భూమిలో శాశ్వతంగా ఉండేలా చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 13 వేల గ్రామాలు, 3 వేల వార్డులు, 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల నుంచి, మానససరోవరం, మక్కా మసీదు, జెరూసలెం లాంటి పుణ్య క్షేత్రాలతోపాటు గాంధీ, నెహ్రూ, భగత్‌సింగ్, అంబేడ్కర్, సుభాష్ చంద్రబోస్ తదితర స్వాతంత్య్ర సంగ్రామ యోధులు జన్మించిన ప్రాంతాల నుంచి పవిత్ర జలాలు, మట్టి ఇక్కడికి చేరుకున్నాయని చెప్పారు.
‘మన నీరు-మన మట్టి’, ’నా ఇటుక- నా అమరావతి’ కార్యక్రమాలను రాష్ట్రంలోని 5 కోట్ల మందిని భాగస్వాముల్ని చేయటానికే నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన మట్టి, జలాలు ఉన్న వాహనాలు, రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల నమూనాలతో ఉన్న వాహనాలు, 13 జిల్లాల నుంచి వచ్చిన ప్రత్యేక వాహనాల ర్యాలీని సీఎం ప్రారంభించారు.
అప్రతిష్ట తేవాలని చూస్తున్నారు
రాజధాని శంకుస్థాపనను కొన్ని రాజకీయ పార్టీలు అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. మంగళవారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల్లో ఏదో ఒక ఇబ్బందిని సృష్టించడానికి కొందరు చూస్తారని అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రాజధానిని ప్రతి ఒక్కరూ నిండు మనసుతో ఆశీర్వదించాలన్నారు.
మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం
అంతకుముందు శంకుస్థాపన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 19వ తేదీకల్లా ఏర్పాట్లు పూర్తికావాలని ముందు నుంచి చెబుతున్నా ఎందుకు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. అన్ని పనులకు కమిటీలు వేసి, నిర్దిష్టంగా బాధ్యతలు అప్పగించినా ఎవరూ వాటి గురించి పట్టించుకోలేదని, అందుకే ఇంకా చాలా పనులు మిగిలిపోయాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్షణం నుంచి ఇచ్చిన పనుల్లోనే ఉండాలని ఎప్పటికప్పుడు తనకు రిపోర్టు చేయాలని ఆదేశించారు.
భవిష్యత్‌లో ఇది విశ్వనగరం: కోడెల
దసరా పండగ ఈసారి కొత్త ఉత్సాహాన్ని, సంతోషాన్ని ముందే మోసుకొచ్చిందనీ, భవిష్యత్తులో ఇక్కడి ప్రాంతమంతా విశ్వనగరంగా మారనుందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మంగళవారం ఆయన కుటుంబ సమేతంగా ఉద్ధండ్రాయునిపాలెం వచ్చి శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు.