హెచ్‌ఎం, డెప్యూటీ డీఈఓ, డీసీఈబీ కార్యదర్శి మూడు పోస్టుల బాధ్యత ఒకరికే
– ఏ పోస్టుకూ న్యాయం జరగని వైనం
– గాడి తప్పుతున్న డీసీఈబీ
అనంతపురం ఎడ్యుకేషన్: పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గతేడాది నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమలు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కామన్ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడు జిల్లా సాధారణ పరీక్ష మండలి(డీసీఈబీ) అత్యంత కీలకమయ్యాయి. ప్రశ్నపత్రాల తయారీ మొదలు.. ముద్రణ, అన్ని స్కూళ్లకు పంపిణీ, పరీక్షల నిర్వహణ పూర్తయ్యేదాకా చాలా రహస్యంగా నిర్వహించాల్సి ఉంది. ఈ మొత్తం బాధ్యత డీసీఈబీదే. జిల్లాలో డీసీఈబీ వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. రెండేళ్లగా నిర్వహించిన పరీక్షల తీరును పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. విద్యార్థులకు అత్యంత కీలకమైన సంగ్రహణాత్మక మదింపు(సమ్మేటివ్) పరీక్షల ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో బహిరంగంగా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. పరీక్షలు ప్రారంభం కాకముందే అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు విద్యార్థుల చేతుల్లోకి చేరడం డీసీఈబీ పనితీరుకు అద్దం పడుతోంది.
మూడు పోస్టుల్లో ఆయనే..
ప్రస్తుతం జిల్లా సాధారణ పరీక్ష మండలి కార్యదర్శిగా పని చేస్తున్న నాగభూషణం మూడు పోస్టులకు ‘ఒకే ఒక్కడు’గా వ్యవహరిస్తున్నారు. ఈయన లేపాక్షి మండలం చోళసముద్రం జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. పెనుకొండ డిప్యూటీ డీఈఓగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. కీలకమైన మూడు పోస్టులు ఒక్కరికే అప్పజెప్పడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఉదయిస్తోంది.
డమ్మీగా డీసీఈబీ సభ్యులు
డీసీఈబీలో కార్యదర్శితో పాటు మరో 8 మంది సభ్యులు ఉంటారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ ఇలా అన్ని యాజమాన్యాల పాఠశాలల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటారు. పేరుకు మాత్రమే సభ్యులు కానీ.. చాలా మందికి తమ విధులు కూడా తెలియని పరిస్థితి. ఏదో కార్యదర్శి సమాచారం చేరవేస్తే వచ్చి తూతూమంత్రంగా సమావేశంలో పాల్గొని సంతకాలు చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే డీసీఈబీ సభ్యులు తమ విధుల గురించి అడగరు.. అధికారులు పనులు పురమాయించరు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, పంపిణీ, పరీక్షల నిర్వహణలో కీలకంగా వ్యవహరించాల్సిన డీసీఈబీ కార్యదర్శి, సభ్యులు కనీసం ఒక్క పరీక్ష కేంద్రం కూడా తనిఖీ చేసిన దాఖలాల్లేవు. దీనికితోడు కార్యదర్శి నాగభూషణం మూడు పోస్టుల్లో కొనసాగడం వెనుక ఆంతర్యమేమిటని పలువురు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
ఎవరైనా ముందుకొస్తే బాధ్యతలు
ఒకే వ్యక్తి మూడు పోస్టుల్లో కొనసాగడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయితే డీసీఈబీ కార్యదర్శి విషయంలో ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. పోనీ ప్రధానోపాధ్యాయుల్లో ఎవరైనా ఔత్సాహికులు ముందుకొస్తే కార్యదర్శి పోస్టులో నియమించే విషయం పరిశీలిస్తాం.
- లక్ష్మీనారాయణ, డీఈఓ
ఒకే ఒక్కడు!
Published Sat, Sep 16 2017 1:22 AM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM
Advertisement