బదిలీలు.. ముప్పుతిప్పలు! | hm, pd and pet councelling on 22nd | Sakshi
Sakshi News home page

బదిలీలు.. ముప్పుతిప్పలు!

Published Thu, Jul 20 2017 10:59 PM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM

hm, pd and pet councelling on 22nd

22న హెచ్‌ఎం, పీడీ, పీఈటీల కౌన్సెలింగ్‌
– ప్రిఫరెన్షియల్‌ కేటగిరీపై తాజాగా జీఓ
– 40శాతం వైకల్యం ఉంటే ఆ కేటగిరీకి అర్హులు
– దరఖాస్తు ప్రక్రియ మొదటికి..
- కౌన్సెలింగ్‌ మళ్లీ వాయిదా?


అనంతపురం ఎడ్యుకేషన్‌ : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు క్షేత్ర స్థాయి అధికారులతో పాటు ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఉద్యోగులకు బదిలీ సర్వసాధారణం. అయితే ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం చేస్తున్న హడావుడి.. జీఓలు.. మారుతున్న షెడ్యూళ్లు.. రోజుకో సవరణతో బదిలీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారుతోంది. చివరగా అంటూ.. రెండు రోజుల క్రితం షెడ్యూల్‌ ఇచ్చిన ప్రభుత్వం తాజాగా గురువారం సాయంత్రం మరో జీఓ ఇచ్చి ఇరకాటంలోకి నెట్టింది. షెడ్యూల్‌ ప్రకారం శనివారం ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్‌ డైరెక్టర్లు, పీఈటీలకు కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటికీ టీచర్ల ఫిర్యాదులు నివృత్తి చేయని పరిస్థితి. వీటిని పరిశీలించి తుది జాబితా శుక్రవారం ప్రకటించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో మరోసారి జీఓ జారీ చేయడంతో కౌన్సెలింగ్‌ మళ్లీ వాయిదా పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

40శాతం వైకల్యం ఉంటే ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ
ఇప్పటిదాకా 70 శాతం వికలత్వం ఉంటే ప్రిఫరెన్షియల్‌ కేటగిరీకి అర్హులు. అయితే తాజాగా ఇచ్చిన 50 జీఓ ప్రకారం 40 శాతం వికలత్వం ఉంటే చాలు ప్రిఫరెన్షియల్‌ కేటగిరీకి అర్హులవుతారు. జీఓ వచ్చిందో లేదో అప్పుడే పలువురు టీచర్లు గురువారం సాయంత్రం జీఓ, వికలత్వ ధ్రువీకరణ పత్రాలు పట్టుకుని సైన్స్‌ సెంటర్‌ చేరుకున్నారు.

మళ్లీ మారనున్న సీనియార్టీ జాబితాలు
సుమారు రెండు నెలలుగా సాగుతున్న బదిలీల తంతు ప్రాథమిక సీనియార్టీ జాబితాలు ప్రకటించడంతో ఒక కొలిక్కి వచ్చిందని భావించారు. తీరా కౌన్సెలింగ్‌కు ఒక రోజు ముందు ఇచ్చిన జీఓతో సీను మళ్లీ మొదటికొచ్చింది. మళ్లీ దరఖాస్తు, వెరిఫికేషన్, ఎంఈఓలు, హెచ్‌ఎంలు కన్ఫర్మేషన్, ఆ తర్వాత డీఈఓ కన్ఫర్మేషన్‌ చేసిన తర్వాత తాత్కాలిక సీనియార్టీ జాబితాలు తయారు చేయాల్సి ఉంటుంది. ఈ తతంగం జరగాలంటే మరిన్ని రోజులు పడుతుంది.
 
వెంటాడుతున్న సమస్యలు
టీచర్ల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కావట్లేదు. బదిలీకి దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులకు వివిధ పాయింట్లపై సందేహాలు వెంటాడుతున్నాయి. ఒకే రకమైన పాయింట్లు కొందరు టీచర్లకు నమోదవుతుండగా.. మరికొందరికి యాడ్‌ కాని పరిస్థితి. ఒకే స్కూల్‌లో పని చేస్తున్న టీచర్లకు పాయింట్లలో తేడాలొస్తున్నాయి. బడికి వెళ్లి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు పాయింట్లు, దరఖాస్తు, సర్టిఫికెట్లు అంటూ ఎంఈఓ, హెచ్‌ఎం, డిప్యూటీ డీఈఓ, డీఈఓ చుట్టూ తిరుగుతున్నారు.

అటకెక్కుతున్న చదువులు
వేసవి సెలవుల్లో చేపట్టాల్సిన బదిలీలను తీరా పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత చేపట్టడం పట్ల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. నిజంగా ప్రభుత్వానికి పేద పిల్లల చదువు పట్ల చిత్తశుద్ధి ఉంటే వేసవి సెలవుల్లోనే బదిలీలు చేపట్టేదంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం విద్యార్థుల పాలిట శాపంగా మారిందంటున్నారు. బదిలీల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం సాగుతోంది. షెడ్యూలు మీద షెడ్యూలును విడుదల చేస్తూ ప్రభుత్వమే జాప్యం చేస్తోంది. బదిలీల నేపథ్యంలో ఎన్ని పాయింట్లు వస్తాయో.. ఏ స్కూల్‌ వస్తుందో.. ఆ స్కూల్‌కు రోడ్డు సదుపాయం ఉందో లేదో.. పాయింట్లు పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా.. దూరం స్కూల్‌ వస్తే కుటుంబ పరిస్థితి ఎలా? అనే అంచనాల్లో ఉపాధ్యాయులు తలమునకలవుతున్నారు. ఫలితంగా పాఠశాలల్లో చదువు అటకెక్కుతోంది.

ఆదేశాలు రాలేదు
40 శాతం వికలత్వం ఉన్న వారిని ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలోకి చేర్చుతూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అయితే వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి తదితర అంశాలపై ఇంకా ఉన్నతాధికారుల నుంచి స్పష్టత లేదు. ప్రస్తుత షెడ్యూల్‌లో భాగంగా అన్ని కేడర్ల తాత్కాలిక సీనియార్టీ జాబితాలు ప్రకటించాం. వాటిపై అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో స్వీకరించాం. వాటిని పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు.
– పగడాల లక్ష్మీనారాయణ, డీఈఓ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement