తూచ్..తూచ్ తొండి ‘ఆట’
Published Mon, Feb 20 2017 10:28 PM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM
* ఆడకుండానే ఆడించినట్లుగా కాగితాలపై నమోదు
* క్రీడాకారులు రాకుండానే టీమ్‌లు రెడీ
* ఇదీ మండలస్థాయి ఆటల పోటీల తీరు
ఆడకుండానే ఆడినట్లుగా.. కూత పెట్టకుండానే పెట్టినట్లుగా.. ఎగరకుండానే ఎగిరినట్లుగా.. ఆటల పోటీలు జరిగాయి. కాదు కాదు.. జరిగాయని మనం అనుకోవాలి. అదేమిటనుకుంటున్నారా.. అవును మరి. మన పీడీలు, అధికారులు అలా చక్రం తిప్పేశారు. పోటీలను నిర్వహించకుండానే కాగితాలపైనే టీంలను ఎంపిక చేసి ఆడించినట్లుగా బొమ్మ చూపిస్తూ తొండి ‘ఆట’ ఆడారు. క్రీడా పోటీల పరువు తీశారు.
ప్రత్తిపాడు: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మండల స్థాయిలో అండర్ –19 క్రీడా పోటీలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా అండర్–19 విభాగంలో అథ్లెటిక్స్, వాలీబాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, కబడ్డీ పోటీలు బాలుర, బాలికల విభాగాల్లో నిర్వహించాల్సి ఉంది. పోటీల్లో విజేతలుగా నిలిచిన టీమ్‌లను ఈ నెల 21, 22 తేదీల్లో జిల్లా స్థాయిలో జరగనున్న పోటీలకు పంపాలి. కానీ ఇవేమీ చేయకుండా అసలు ఆటల పోటీలే నిర్వహించకుండా మండలంలో పీఈటీలు కాగితాలపై టీమ్‌లను నింపేశారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ పోటీలు జరగాల్సి ఉంది. పోటీలకు మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుంచి క్రీడాకారులు హాజరవుతారన్న ఉద్దేశంతో ముందుగానే భోజనాన్ని సైతం ఏర్పాటు చేయించారు. తీరా ఏ ఒక్క పాఠశాల నుంచీ క్రీడాకారులు రాకపోవడంతో పోటీలు జరగలేదు. కానీ పీడీలు మాత్రం పోటీలు జరిగినట్లుగా చెబుతున్నారు. మండలంలోని ఎనిమిది పాఠశాలలకుగాను నాలుగు పాఠశాలల నుంచి టీమ్‌లు వచ్చాయని వాలీబాల్, కబడ్డీ, షాట్‌పుట్, డిస్కస్‌త్రో, లాంగ్‌జంప్, హైజంప్ పోటీలను నిర్వహించామని కట్టుకథను అల్లారు. పచ్చి అబద్ధాలు చెబుతూ అధికారులు, పీడీలు అటు ప్రజలను ఇటు మీడియాను తప్పుదో పట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అసలు ఇసుకే లేని మైదానంలో హైజంప్, లాంగ్ జంప్ ఎలా ఆడగలుగుతారు..? అన్న ధర్మ సందేహాలను పీడీ మరిచినట్లున్నారు.
పోటీల నిర్వహణకు నిధులు..
పోటీల నిర్వహణకుగాను ప్రభుత్వం ఒక్కో మండలానికి ఐదు వేల రూపాయల నిధులను కేటాయించింది. వీటితో క్రీడాకారులను మండల స్థాయి, జిల్లా స్థాయి పోటీలకు తీసుకువెళ్లడం వంటి వాటికి నిధులను వెచ్చించాల్సి ఉన్నప్పటికీ ఈ తతంగమంతా జరగనే లేదు. కానీ పేపర్లలో మాత్రం వచ్చినట్లు, ఆడినట్లు చూపించి ఉన్నతాధికారులకు టోకరా వేస్తున్నారు.
వచ్చారు ఆడించాం..
పోటీలకు క్రీడాకారులు వచ్చారు. ఎనిమిది పాఠశాలలకుగాను నాలుగు పాఠశాలల నుంచి క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. కబడ్డీకి నాలుగు, వాలీబాల్‌కు నాలుగు టీమ్‌లు వచ్చాయి. వారితో ఆటలాడించాం. అథ్లెటిక్స్ నిర్వహించాం.
- భాస్కరరావు పీడీ, ప్రత్తిపాడు హైస్కూల్
ఒక్క పాఠశాల వాళ్లు కూడా రాలేదు:
మండల స్థాయి పోటీలు కావడంతో మిగిలిన పాఠశాలల నుంచి కూడా క్రీడాకారులు వస్తారన్న ఉద్దేశంతో అందరికీ భోజనాలను కూడా ఏర్పాటు చేశాం. కానీ ఒక్క పాఠశాల నుంచి కూడా విద్యార్థులు రాలేదు. పీడీ ప్రమోషన్లు, పీఈటీల బదిలీల్లో హడావిడిగా ఉండటం వలన రాలేదంట.
- రమాదేవి, హెచ్‌ఎం, ప్రత్తిపాడు హైస్కూల్
Advertisement
Advertisement