పాపం పండింది.. | Horse baba arrested in fraud case | Sakshi
Sakshi News home page

పాపం పండింది..

Published Mon, Jul 17 2017 2:34 AM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

కురవి: దంపతులను ఆశీర్వదిస్తున్న బాబా(ఫైల్‌)

కురవి: దంపతులను ఆశీర్వదిస్తున్న బాబా(ఫైల్‌)

గుర్రం బాబాపై కేసు..
తీసుకొచ్చిన వ్యక్తిపై కూడా..
భీమదేవరపల్లిలో ఇదే తంతు
పోలీసులు వదిలేయడంతో కురవిలో మోసం


కురవి/భీమదేవరపల్లి:
గిరిజనుల ఆరోగ్యాలను బాగుచేస్తానని మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసిన  గుర్రం బాబాతోపాటు మరో వ్యక్తిపై కురవి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆది వారం ‘సాక్షి’లో ‘గుర్రంబాబా ఘరానా మోసం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి విధితమే. దీనిపై స్పందించిన పోలీ సులు దొంగబాబాపై కేసు నమో చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం దోసపహాడ్‌ గ్రామానికి చెందిన కడవంచి రామ్‌ దొంగ బాబాగా అవతారమెత్తి బొడ్రాయి ప్రతిష్ఠాపన పేరుతో కురవి శివారు లింగ్యా తండాకు చేరుకున్నాడు. అనంతరం తండాలో ఓ వ్యక్తి ఇంట్లో ఆశ్రయం తీసుకున్నా డు.

బొడ్రాయి ప్రతిష్ఠాతోనే తండావాసులు సుఖ సంతోషాలతో ఉంటారని పెద్ద మనుషులను నమ్మించాడు. దీనికి పెద్దమనుషులు ఒప్పుకుని రూ.29వేలు వసూలు చేసి గుర్రంబాబాకు అందజేశారు. అంతటితో ఆగకుండా గుర్రంపై తండాలో ఇళ్లు ఇళ్లు తిరుగుతూ ఒక్కో ఇంటివద్ద ఆగి ‘మీ ఇంట్లో బాగాలేదు.. నయం చేయాల్సి ఉంది.. కొంత ఖర్చు అవుతుందని’ చెప్పాడు. దీంతో ఆరోగ్యాలు బాగాలేని వ్యక్తు లు కొందరు ఆయన మాటలను నమ్మి రూ. 2వేల నుంచి రూ.10వేల వరకు ముట్టచెప్పుకున్నారు. తండాకు చెందిన ఓ వ్యక్తికి కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో గుర్రం బాబా ఇంటి ముందుకు వచ్చి మీ ఆరోగ్యం బాగాలేదు, బాగుచేయడానికి రూ.1లక్ష ఖర్చు అవుతుందని చెప్పడంతో బాధితుడు తలూపాడు. రూ.1లక్ష ఇచ్చుకోలేక మళ్లీ అతన్ని కలువలేదు. ఇలా అనేక మంది వద్ద డబ్బులను వసూళ్లు చేశాడు. డబ్బులతోకాకుండా చిన్న రోగమైతే కోడిపుంజు, పెద్ద రోగమైతే గొర్రెపోతు ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది.  

దొంగబాబాతోపాటు మరొకరిపై కేసు ..
గిరిజనులను మోసం చేసి డబ్బులు వసూళ్లకు పాల్పడిన సంఘటనపై స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని కురవి ఎస్సై తీగల అశోక్‌ తెలిపారు.  బాబాతోపాటు తం డాకు చెందిన ఇస్లావత్‌రాములుపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. కాగా, బాబాపై గతంలో నల్లగొండ, నిజామాబాద్‌ తదితర జిల్లాలో సైతం కేసులునమోదు  అయినట్లు తెలిసింది.

గుర్రానికి ట్రాలీ.. బాబాకు కారు..
గుర్రంబాబా ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట ఓ ట్రాలీ ఆటో ఉంటుంది. అందులో గుర్రాన్ని తరలిస్తారు. అలాగే ఆయనకు ఒక సొంత కారు ఉంటుంది. ఆ కారులో తండాలకు చేరుకుంటాడు. అనంతరం ఓ ఇంట్లో ఆశ్రయం పొంది, నుదుటున విభూది పూసుకుని, కాషాయపు వస్త్రాలు ధరించి, గుర్రాన్ని అలంకరించి తండాల్లో ఊరేగింపు చేస్తూ అమాయకులను మోసం చేస్తుంటాడు.  

భీమదేవరపల్లిలో ఇదే తంతు..
వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలంలో గుర్రం బాబా ఇలాంటి ఘటనకే పాల్పడడంతో అక్కడి పోలీసులకు బాధితులు ఈనెల 4వ తేదీన ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు బాబా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించి వదిలేసినట్లు తెలిసింది.భీమదేవరపల్లి పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుని ఉంటే కురవి శివారు లింగ్యా తండాలో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement