పెళ్లైన నాలుగు నెలలకే..
► హైదరాబాద్‌లో వివాహిత అనుమానాస్పద మృతి
► ఉరేసుకుందని కుటుంబ సభ్యులకు..
► గుండెపోటుతో చనిపోయిందని అంబులెన్స్ డ్రైవర్‌కు చెప్పిన భర్త
► గుట్టుచప్పుడు కాకుండా నెల్లూరు తీసుకువచ్చిన వైనం
► భర్తే చంపేశాడంటున్న మృతురాలి కుటుంబసభ్యులు
నెల్లూరు సిటీ: బ్యాంకులో ఉద్యోగం.. మంచి వ్యక్తి.. బిడ్డను బాగా చూసుకుంటాడని తల్లిదండ్రులు పెళ్లి చేసి పంపించిన నాలుగు నెలలకే వివాహితకు నూరేళ్లు నిండాయి. ఏం జరిగిందే ఏమో తెలియదు హైదారాబాద్‌లో శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భార్య మృతదేహాన్ని భర్త గుట్టుచప్పుడు కాకుండా అంబులెన్స్‌లో నెల్లూరుకు తరలించడం.. భార్య కుటుంబ సభ్యులకు ఉరేసుకుని చనిపోయిం దని..అంబులెన్స్ డ్రైవర్‌కు గుండెపోటుతో చనిపోయిందని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నెల్లూరులోని అయ్యప్పగుడి సమీపంలోని విక్రమ్‌నగర్‌కు చెందిన బత్తల కృష్ణయ్య, వెంకమ్మ దంపతుల కుమారుడు బత్తల మహేష్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. గతంలో వివాహం కాగా భార్యతో విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నాడు. బుచ్చిరెడ్డిపాళెం, అనంతనారాయణపురానికి చెందిన వల్లెపు కల్లింగయ్య, గోవిందమ్మ దంపతుల కుమార్తె శాంతి(25)ని రెండో వివాహం చేసుకున్నాడు. శాంతి తల్లిదండ్రులు ఇద్దరు పక్షవాతంతో మంచానికి పరిమితమవడంతో అన్న బీమరాజు దగ్గరుండి చెల్లిలి వివాహం చేశారు.
పెళ్లైన నాటి నుంచే నరకం
మహేష్ పెళ్లైన తరువాత హైదరాబాద్‌లోని చింతల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ప్లాట్‌ను అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. అప్పట్నుంచే భార్యను మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. కనీసం తిండి కూడా పెట్టకపోవడంతో అపార్ట్‌మెంట్‌లోని వారే ఆహారాన్ని అందించేవారు. తల్లిదండ్రులకు చెబితే ఇంట్లో నుంచి తరిమేస్తానని బెదిరించడంతో నాలుగు నెలల పాటు నరకయాతన అనుభవించిందని మృతురాలి కుటుంబసభ్యులు తెలిపారు.
గుట్టుచప్పుడుగా మృతదేహం తరలింపు
హైదరాబాద్ నుంచి బత్తల మహేష్ శనివారం శాంతి కుటుంబసభ్యులకు ఫోన్ చేశాడు. శాంతి ఇంట్లో ఉరేసుకుని చనిపోయిందని చెప్పాడు. శాంతి కుటుంబసభ్యులు వెళ్లేందుకు సిద్ధమవుతుండగానే తానే మృతదేహాన్ని తీసుకువస్తున్నాని తెలిపాడు. అంబులెన్స్ డ్రైవర్‌కు గుండెపోటుతో చనిపోయిందని చెప్పి గుట్టుచప్పుడు కాకుండా ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకు నెల్లూరులోని విక్రమ్‌నగర్‌కు మృతదేహాన్ని తీసుకువచ్చాడు.
శాంతి మృతదేహంపై రక్తపు మరకలు ఉండడంతో కుటుంబసభ్యులు, బంధువులకు అనుమానం కలిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవగా మహేష్ చల్లగా జారుకున్నాడు. దీంతో కోపోద్రిక్తులైన శాంతి కుటుంబ సభ్యులు మహేష్ ఇంటిపై దాడి చేశారు. అనంతరం తమ బిడ్డను భర్త చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేవారు. కేసును హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.