ఉద్యాన కోతలు | Horticulture cuts | Sakshi
Sakshi News home page

ఉద్యాన కోతలు

Published Thu, Jul 21 2016 1:08 AM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM

ఉద్యాన కోతలు - Sakshi

ఉద్యాన కోతలు

కడప అగ్రికల్చర్‌:
ఉద్యాన తోటలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ఉద్యానశాఖలు జిల్లాకు నిధులు కేటాయించాయి. పండ్లతోటలు, కూరగాయల సాగును పెంచడానికి రైతులను చైతన్యపరిచి సాగును చేపట్టేలా ప్రోత్సహిస్తున్నారు. జిల్లా ఉద్యాన అధికారులు ఈ ఏడాది ఆయా పంటల సాగు, ఇతర పనులకు సంబంధించి ప్రణాళికలు తయారుచేసి పంపారు. ఈ పథకాల అమలుకుగాను జిల్లాలోని ఉద్యానశాఖ–1, 2లకు నిధులు విడుదల చేశారు. అయితే గతేడాది రూ. 35 కోట్లు ఇవ్వగా, ఈ ఏడాది రూ.7 కోట్లు కోత పెట్టి రూ. 28 కోట్లు మాత్రమే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సబ్బిడీ నిధులు మంజూరు చేశాయి.
కేటాయింపులు ఇలా..
 పండ్లతోటల విస్తరణ, పునరుద్ధరణ, పాతతోటల అభివృద్ధికి గాను జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ఉద్యాన శాఖలు రూ.18.05 కోట్లు విడుదల చేశాయి. ఆధునిక పద్ధతిలో హైబ్రిడ్‌ కూరగాయలను సాగుచేసే రైతులను ప్రోత్సహించేందు కోసం రూ.13.62 లక్షలు కేటాయించారు. ఇందులో పండ్ల తోటల విస్తరణకు 40 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. మిగతా వాటికి కేంద్ర, రాష్ట్ర ఉద్యానశాఖలు సగం సబ్సిడీ ఇస్తుండగా, మరో సగం ఆయా పంటలు సాగుచేసే రైతులు భరించాల్సి ఉంటుంది. ఉద్యానశాఖ–1,2 ద్వారా అరటి, మామిడి, చీనీ, నిమ్మ, దానిమ్మ,జామ, బొప్పాయి పండ్లతోటల విస్తరణలో భాగంగా 2222.5 హెక్టార్లకు రూ. 8.89 కోట్లు ఖర్చుచేయనున్నారు. ఈ తోటల నిర్వహణకు రూ.2.57కోట్లు ఎరువులు, పురుగుమందులు, చెట్లకొమ్మల కత్తిరింపులకు సబ్సిడీ రూపంలో ఇస్తారు. అలాగే 2 వేల హెక్టార్లలోని ముదురు పండ్ల తోటల అభివృద్ధికి సంబంధించి రూ.6.59 కోట్లు  ఖర్చుచేయనున్నారు. అలాగే 78 ఫాంపాండ్స్‌ నిర్మాణాలకు రూ.97 లక్షలు అందిస్తారు.
కూరగాయల సాగుకు అంతంతమాత్రమే
ఈ ఏడాది రాష్ట్రీయ వికాస్‌ యోజన కింద 454 హెక్టార్లలో కూరగాయ తోటల సాగుకు రూ.13.62 లక్షల సబ్సిడీని ఇవ్వనున్నారు. అలాగే మల్చింగ్‌కు 1,000 హెక్టార్లను ఎంపిక చేసి రూ.1.60 కోట్ల సబ్సిడీని మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంటు ఇన్‌ హార్టికల్చర్‌ కింద రైతులకు ఇవ్వాలని నిర్ణయించింది. సేంద్రియ వ్యవసాయంలో బాగంగా 50 సంచార వర్మీకంపోస్టు యూనిట్లకుగాను రూ.25 లక్షలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు అనుమతులు ఇచ్చారు. అదేవిధంగా యాంత్రీకరణలో భాగంగా 626 పరికరాల కొనుగోలుకు రూ.102.08 కోట్లు అందించాలని నిర్ణయించారు. ఊతకర్రల సాయంతో ఏర్పాటు చేసుకునే 36.95 హెక్టార్ల కూరగాయల సాగుకుగాను రూ.6.93లక్షలు, శాశ్వత పందిళ్లలో కూరగాయలను 15 హెక్టార్లలో సాగు చేయించడానికి రూ. 37.50 లక్షలు ఇస్తారు. పంట కోత అనంతరం మార్కెట్‌కు ఉత్పత్తులను తీసుకెళ్లే 27,095 ప్లాస్టిక్‌ క్రేట్స్‌కు రూ.32.51లక్షల సబ్సిడీని అందిస్తారు. ఇతరత్రా వాటి అమలుకు రూ.5.22 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాంయింపులు కన్నా ఇవి తక్కువే.   
డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేసుకుంటేనే అనుమతులు:
ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ముందుగా బిందు, తుంపర సేద్య యూనిట్లు ఏర్పాటు చేసుకుంటేనే సాగుకు అనుమతులు ఇవ్వాలనే నిబంధనలు పెట్టారు. జిల్లాలో పులివెందుల, ముద్దనూరు, లక్కిరెడ్డిపల్లె, కమలాపురం, రాయచోటి డివిజన్లలో తప్పనిసరిగా డ్రిప్‌ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయా ఉద్యాన డివిజన్లలో భూగర్భజలాలు అడుగంటి ఉన్నందున బిందు, తుంపర సేద్య పరికరాల అవసరం ఉంటుంది. కానీ మైదుకూరు, బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు ఉద్యాన డివిజన్లలో భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నందున ఆయా రైతులకు అంతగా బిందు, తుంపర సేద్య పరికరాల అవసరం ఉండదు. అటువంటి చోట తప్పనిసరిగా డ్రిప్‌ ఏర్పాటు చేసుకుంటేనే పంటలసాగుకు అనుమతులు ఇస్తామనడాన్ని ఆయా ప్రాంత రైతులు వ్యతిరేకిస్తున్నారు. డ్రిప్, తుంపర పరికరాలు తమ ప్రాంతాలకు అవసం లేదని, అయినంత మాత్రాన సూక్ష్మ సేద్య అనుమతులు ఇవ్వరా? అని అధికారులను ప్రశ్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement