ఆస్పత్రిలో నివాసం.. వైద్యానికేదీ అవకాశం
-
ఎవరు చెప్పిన వినరట.. భవనాన్ని ఖాళీ చేయరట
-
ప్రైవేట్ వ్యక్తుల ‘కబ్జా’లో.. చాకెపల్లి సబ్‌సెంటర్!
బెల్లంపల్లి రూరల్ : ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు పక్కా భవనాలు లేక ఒకవైపు వైద్య సిబ్బందితో పాటు ప్రజలు అవస్థల పాలవుతుంటే ప్రభుత్వ పక్కా భవనం ఉండి కూడా అందులో ఆస్పత్రి నిర్వహణ చేయనీయకుండా ఒక కుటుంబం కొన్నేళ్లుగా కాపురం ఉంటోంది. పూర్తి వివరాలిలా ఉన్నాయి.
ఇదీ పరిస్థితి
బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల చాకెపల్లి ఆరోగ్య ఉపకేంద్రానికి ప్రభుత్వం పక్కా భవనం నిర్మించింది. అయితే ఆ భవనం నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఆరోగ్య సేవలు అందులో జరగడం లేదు. అదే గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఆ భవనంలో ఉంటోంది. చాకెపల్లి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో ఒక కుటుంబానికి చెందిన వారు సొంత ఇంటిలా వాడుకుంటున్నారనే విషయం అధికారులకు తెలిసినా వారెవరూ ఈ వ్యవహారంపై స్పందించడం లేదు. దీంతో చాకెపల్లి గ్రామంలో వైద్యసేవలు అందడం లేదు. నిత్యం తెరుచుకోవాల్సిన చాకెపల్లి ఆరోగ్య ఉపకేంద్రం పండుగలకు, పర్వదినాలకు మాత్రమే తెరుచుకుంటుందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ పని చేసే వైద్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరుకావడం లేదనేది ఈ గ్రామస్తుల ప్రధాన ఆరోపణ. లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ఆరోగ్య ఉపకేంద్రాన్ని నిర్మిస్తే ప్రైవేట్ వ్యక్తులు దానిలో ఉండటం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికి సంబంధిత వైద్య ఆరోగ్య ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం మాత్రం లేదు. ఈ ఉపకేంద్రంలో కాపురం ఉంటున్న కుటుంబాన్ని ఖాళీ చేయిస్తే తాము విధులకు హాజరుకావడం లేదనే విషయంపై ఒత్తిళ్లు వస్తాయనే కారణంగా స్థానిక వైద్య సిబ్బంది కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
వైద్యం.. దైన్యం..
ప్రస్తుతం చాకెపల్లిలో ఆరోగ్య ఉపకేంద్రంలో వైద్యసేవలు కూడా అంతంత మాత్రంగానే సాగుతున్నాయని, ఇక్కడ పని చేసే సిబ్బంది నామమాత్రంగా విధులకు వస్తూ పోతూ ఉంటారని, వారు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పోతారో ఎవరికీ తెలియదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీకాలు, ఇతర వైద్యసేవలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారానే కొనసాగిస్తున్నారు. ఇక్కడ పని చేసే సిబ్బంది కేవలం టీకాలు వేసే రోజుల్లో మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగతా రోజుల్లో పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతున్నారు. దీంతో ఏ రోగమొచ్చినా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ వైద్యులైన ఆర్‌ఎంపీలనే ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కావడం కారణంగా చాలా మంది రోగాల బారిన పడే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఆరోగ్య ఉపకేంద్రంలో నివాసముంటున్న వారితో ఖాళీ చేయించి నిర్వహణ సక్రమంగా సాగేలా చర్యలు తీసుకోవాలని చాకెపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రైవేట్ వ్యక్తులుంటున్నది వాస్తవమే
తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చాకెపల్లి ఆరోగ్య ఉపకేంద్రంలో ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసుకొని ఉంటున్నారు. ఈ విషయంపై పలుమార్లు వారిని అడిగినా ఖాళీ చేయడం లేదు. కొంతమంది గ్రామానికి చెందిన పెద్దలు వారికి మద్దతు తెలుపుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాం. వైద్యసేవలు అందడం లేదనే విషయంపై విచారణ జరుపుతాం.
– రుతుక్లార, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్‌వైజర్, బెల్లంపల్లి