మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
Published Tue, Nov 22 2016 6:46 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
ఏలూరు అర్బన్ ః స్వల్ప విషయానికే భర్త తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురైన వివాహిత ఆత్మహత్యకు యత్నించి ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బూరుగ ఝాన్సీ (30), తంబిలకు దాదాపు 12 ఏళ్ళ కిందట వివాహం జరిగింది. నాటి నుంచి దంపతులు లింగపాలెం మండలం అన్నపనేనివారిగూడెంలోఇద్దరు పిల్లలతో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఝాన్సీ తన ఇద్దరు పిల్లలను తీసుకుని సమీపగ్రామంలో జరుగుతున్న ఉత్సవాలకు వెళ్లింది. ఈ ఉత్సవాలలో పిల్లలు మారాం చేయడంతో రూ. 200లతో ఆట వస్తువులు కొనిచ్చింది. అనంతరం తిరిగి ఇంటికి రాగా అదే రోజు రాత్రి పిల్లలకు ఆటవస్తువులు కొనివ్వడానికి రెండు వందలు ఎందుకు ఖర్చు చేశావంటూ భర్త తంబి భార్యను తీవ్రంగా మందలించాడు. దాంతో జీవితంపై విరక్తి చెందిన ఝాన్సీ రాత్రి వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు తీవ్రగాయాలపాలైన బాధితురాలిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేక పోవడంతో బాధితురాలు ఝాన్సీ ఆసుపత్రిలోనే మృతి చెందింది.
Advertisement