గూడు చెదిరిన‘హౌసింగ్ కార్పొరేషన్ ’
♦ గృహనిర్మాణ సంస్థకు మంగళం పాడనున్న సర్కారు
♦ విడతల వారీగా ఇతర శాఖలకు ఉద్యోగుల డిప్యుటేషన్లు
♦ తాజాగా 106 మంది ఏఈలు బదిలీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ గూడు చెదిరిన పక్షివోలే మారింది. దానికి అస్తిత్వం లేకుండా పోతోంది. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరిట కార్పొరేషన్ హవా నడిపించింది. అవినీతిలో కూరుకుపోయిన ఇళ్ల పథకానికి ప్రభుత్వం చెక్ పెట్టడంతో గృహనిర్మాణ సంస్థకు పెద్దగా పనిలేకుండా పోయింది. దీంతో ఆ శాఖకు మంగళం పాడి అందులోని ఉద్యోగులకు ఇతర శాఖల్లోకి బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులకు మహానగర మంచినీటి సరఫరా మురుగునీటి పారుదల బోర్డుకు డిప్యుటేషన్‌పై పంపింది. ఇదే తరహాలో పంచాయతీరాజ్, రహదారులు భవనాల శాఖకు సైతం ఇంజనీర్లను బదిలీపై పంపేందుకు చర్యలు చేపట్టింది.
జలమండలిలోకి 66 మంది: హౌసింగ్ కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్ అధికారులను పొరుగు శాఖలకు సాగనంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తొలుత డిప్లొమా అర్హతతో ఉన్న ఇంజనీర్లకు డిప్యుటేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 66 మంది ఏఈ(సహాయక ఇంజనీర్లు)లను జలమండలికి కేటాయించింది. డిప్యుటేషన్ ఉత్తర్వులు తీసుకున్న ఏఈలు జలమండలిలో రిపోర్టు చేశారు. బివరేజెస్ కార్పొరేషన్‌కు 40 మందిని డిప్యుటేషన్‌పై పంపింది.
సుముఖత వ్యక్తం చేస్తే...: తాజాగా 106 మంది ఏఈలను డిప్యుటేషన్‌పై పంపిన హౌజింగ్ కార్పొరేషన్ మిగతా ఉద్యోగులను ఏయే శాఖల్లో సర్దుబాటు చేయాలనే అంశంపై మళ్లగుల్లాలు పడుతోంది. ఈక్రమంలో పంచాయతీ రాజ్, రహదారులు, భవనాల శాఖకు ఉద్యోగుల సమాచారాన్ని పంపింది. అర్హతల ఆధారంగా ఆయా శాఖలు సుముఖత వ్యక్తం చేస్తే వారికి సైతం డిప్యుటేషన్ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ శాఖలకు పంపించేవారిలో సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్లు(ఏఈఈ), ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు(డీఈఈ), కార్యనిర్వాహక ఇంజనీర్లు(ఈఈ) ఉన్నారు. వారికి నెలవారీ వేతనాలను ఆయా శాఖలే చెల్లించాలి.
సీఐడీ కేసుల సంగతేంటి!: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జరిగిన అవకతవకలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి పలువరు హౌసింగ్ అధికారులపై కేసులు నమోదయ్యాయి. నిధుల దుర్వినియోగం, నిర్మాణాల్లో అక్రమాలు, ఇళ్ల మంజూరీలో తాజాగా కార్పొరేషన్‌లోని ఉద్యోగులనంతా డిప్యూటేషన్‌పై పంపితే విచారణ ప్రక్రియ ఎలా సాగుతుందనే గందరగోళం కూడా ఉంది.