కోళ్లకు విషాదం.. కోట్లలో జూదం | Huge bettings on sankrathi festival | Sakshi
Sakshi News home page

కోళ్లకు విషాదం.. కోట్లలో జూదం

Published Mon, Jan 16 2017 10:54 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

కోళ్లకు విషాదం.. కోట్లలో జూదం - Sakshi

కోళ్లకు విషాదం.. కోట్లలో జూదం

  • జిల్లాలో యథేచ్ఛగా కోడిపందేలు
  • బరుల పక్కనే పేకాట, గుండాట శిబిరాలు
  • ఈడుపుగల్లుకు భారీగా తరలివచ్చిన పందెంరాయుళ్లు
  • ఫ్లడ్‌లైట్ల వెలుతురులో రాత్రిళ్లు సైతం పందేలు
  • కాళ్లకు కత్తులు తప్పలేదు..నెత్తుటి ధారలు ఒలికించక తప్పలేదు..చట్టాలు ఉన్నా..కోర్టు తీర్పులు చెప్పినా పందెంరాయుళ్ల కాంక్షకు కోళ్లు బలికాక తప్పలేదు. సంప్రదాయం ముసుగులో గిరిగీసి బరులు ఏర్పాటు చేయగా, కోట్లాది రూపాయలు చేతులు మారాయి... వేల కోళ్లు నెలకొరిగాయి.

    మచిలీపట్నం : సంక్రాంతి పండుగ మూడు రోజులు జిల్లాలో కోడిపందేలు, పేకాట, గుండాట భారీ స్థాయిలో సాగాయి. సంప్రదాయం ముసుగున పెద్ద ఎత్తున జూదానికి తెరలేపారు. కోడిపందేల బరుల వద్ద పేకాట యథేచ్ఛగా సాగింది. రాత్రిళ్లు సైతం ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో పేకాట, కోడిపందేలను నిర్వహించారు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే జిల్లాలో అత్యధికంగా కోడిపందేల బరులు కొనసాగాయి.

    చేతులు మారిన రూ. కోట్లు :
    పండుగ మూడు రోజలు జిల్లావ్యాప్తంగా కోడిపందేలు, పేకాట కొనసాగటంతో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. బరుల వద్దే పెద్ద ఎత్తున పేకాట, గుండాటలను నిర్వహించారు. మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి భోజన సదుపాయాలను సైతం కల్పించారు. స్టాల్‌ యజమానులు చెప్పిందే రేటుగా పందెంరాయుళ్లు కొనుగోలు చేయాల్సి వచ్చింది.
    ► పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లులో గోదావరి జిల్లాలకు దీటుగా సంక్రాంతి బరులు నడిచాయి. సువిశాల ప్రాంగణంలో కోడిపందేలు, జూదం ఏర్పాటు చేశారు.  ప్రత్యేక ఆకర్షణగా పొట్టేళ్ల పందేలు నిర్వహించారు. వీటిని తిలకించేందుకు, పాల్గొనేందుకు తెలంగాణ, ఆంధ్రతో పాటు, కర్ణాటక రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఈడుపుగల్లులో సంక్రాంతి బరిని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈనెల 12వ తేదీ నుంచి కోడిపందేలు, పెద్ద బజారు–చిన్నబజారు, కోతముక్క నడిచాయి. వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. నాలుగు రోజులపాటు నడిచిన పందేలలో రోజూ 50 వేల నుంచి 70 వేలకు పైగా జనం ఇక్కడికి తరలివచ్చినట్లు ప్రాథమిక అంచనా. రోజుకు రూ. 2 కోట్లు నుంచి రూ. 3 కోట్లు మేర నగదు చేతులు మారినట్లు తెలిసింది.
    ► మచిలీపట్నం నియోజకవర్గం గోపువానిపాలెం, మేకవానిపాలెం, శ్రీనివాసనగర్, రుద్రవరం, గోకవరం, పట్టణంలోని ఓ పాఠశాల పక్కనే కోడిపందేల శిబిరాలను మూడు రోజుల పాటు నిర్వహించారు. పేకాట శిబిరాలను ఏర్పాటు చేయటంతో పందెం రాయుళ్లు  జేబులు ఖాళీ చేసుకున్నారు. మందుబాబులు కోడిపందేల శిబిరాల వద్ద కొట్లాటలకు దిగారు.
    ► గన్నవరం నియోజకవర్గం అంపాపురం, అప్పనవీడు ప్రాంతాల్లో భారీస్థాయిలో కోడిపందేలు, పేకాట శిబిరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే అనుచరులు తమదైన శైలిలో  బరులను నిర్వహించారు.
    ► నూజివీడు నియోజకవర్గంలో తుక్కులూరు, పోతిరెడ్డిపల్లి, సీతారామపురం, రావిచర్ల, జనార్ధనవరం, ఈదర, శోభనాపురంలలో బరులను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పందేలు నిర్వహించారు.
    ► అవనిగడ్డ నియోజకవర్గంలోని వెంకటాపురం, కొడాలి, నక్కవానిదారి, శ్రీకాకుళం ప్రాంతాల్లో భారీస్థాయిలో బరులను ఏర్పాటు చేశారు. మొవ్వ, పెదకళ్లేపల్లి, దిండి, నాగాయలంక, సొర్లగొంది, పాగోలులలో పేకాట శిబిరాలు, చిత్తులాటలు జోరుగా సాగాయి.
    ► కైకలూరు నియోజకవర్గంలోని భుజబలపట్నం, కొల్లేటికోటలలో మూడు రోజుల పాటు భారీగా పేకాట శిబిరాలు నిర్వహించారు. భైరవపట్నం, బొమ్మినంపాడు, తాడినాడ, గొల్లనపాలెంలో కోడిపందేల శిబిరాలు శని, ఆదివారాల్లో జోరుగా సాగాయి.
    ► పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలంలో పగలు, రాత్రి తేడాలేకుండా పేకాట శిబిరాలను నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాకు దీటుగా పేకాట, కోడిపందేల శిబిరాలను ఏర్పాటు చేశారు. మునిపెడ, పల్లెపాలెం, నాగేశ్వరరావుపేట, అర్తమూరు, పెదతుమ్మిడి, మల్లంపూడి, గూడూరు, కొంకేపూడి, బల్లిపర్రులలో కోడిపందేలు, పేకాట శిబిరాలు జరిగాయి.
    ► తిరువూరు నియోజకవర్గంలో మునికుళ్ల, పెనుగొలను, ముష్టికుంట్ల, కాకర్ల, తిరువూరు టౌన్‌ ప్రాంతాల్లో పెద్దఎత్తున కోడిపందేల శిబిరాలను ఏర్పాటు చేశారు. గుడివాడ నియోజకవర్గంలోనూ జోరుగా కోడిపందేలు కొనసాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement