సబ్‌స్టేషన్‌లో అగ్నికీలలు
సబ్‌స్టేషన్‌లో అగ్నికీలలు
Published Wed, Aug 24 2016 10:27 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
* 100 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ పేలి భారీగా మంటలు
* రూ.75 లక్షల నష్టం
* జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
తాడికొండ రూరల్: తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఉన్న 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సాయంత్రం 6.30 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. తాడికొండ, పొన్నెకల్లు పరిసర ప్రాంతవాసులకూ అగ్నికీలలతో పాటు భారీగా ఎగసిపడుతున్న పొగ కనిపించింది. సమాచారం అందుకున్న ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని 100 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు ఎగసిపడినట్లు గుర్తించారు. సుమారు దీని విలువ రూ.50 నుంచి 75 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. కాగా సకాలంలో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు యత్నించినప్పటికీ విఫలం కావడంతో రెండు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. అనంతరం వర్షం కూడా తోడవడంతో 8.30 గంటలకు కొంతమేరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పూర్తిగా మంటలు ఆరిపోతే కానీ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకొనే పరిస్థితి లేదని ఎస్‌ఈ తెలిపారు. జిల్లాలో మూడొంతుల విద్యుత్ సరఫరా ఇక్కడి నుంచే జరుగుతుంది కనుక కొంత మేరకు ఇబ్బంది తప్పదని చెప్పారు.
Advertisement