విద్యుత్ షాట్ సర్కూట్ కారణంగా కాటేదాన్ పారిశ్రామికవాడ ప్రాంతంలోని ఆనంద్ నగర్‌లో అక్రమంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం స్వాతంత్ర దినోత్సవం కావడంతో కంపెనీకి సెలవు ఇవ్వడంతో ప్రాణనష్టం తప్పింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు, హైదరాబాద్ జిల్లా అసిస్టెంట్ డీఎఫ్‌ఓ భగవాన్‌రెడ్డిలు రెండున్నర గంటల పాటు శ్రమించి నాలుగు ఫైర్ ఇంజన్‌లతో మంటలను అదుపులోకి తెచ్చారు. వివరాల ప్రకారం... నగరానికి చెందిన ముఖేష్ ఆనంద్‌నగర్‌లోని 2వేల గజాల స్థలంలో పెద్ద షేడ్ వేసి జేబీఎస్ ఫాలిమార్ కంపెనీని ఏర్పాటు చేశాడు.
ఇందులో ప్లాస్టిక్ దానాతో పాటు ప్లాస్టిక్ సామాగ్రీని తయారు చేస్తున్నాడు. సోమవారం ఉదయం షాట్ సర్కూట్ కారణంగా కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు లేచాయి. నిమిషాలలో పూర్తిగా ఆవరించాయి. విషయం తెలుసుకున్న జిల్లా అసిస్టెంట్ ఫైర్ అధికారి భగవాన్‌రెడ్డి రాజేంద్రనగర్, మోగల్‌పూరా, గౌలిగూడ, మలక్‌పేట్ ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్‌లను రప్పించి మంటలను అదుపులోకి తేచ్చారు. ఒక పక్క మంటలను ఆర్పూతూనే పక్కనే ఉన్న ఇతర కంపెనీలకు మంటలు వ్యాపించకుండా నాలుగు దిక్కుల నుంచి నీటిని వెదజల్లుతూ రెండున్నర గంటల పాటు శ్రమించారు. బుద్వేల్ వాటర్ ఫిల్టర్ నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని రప్పిస్తు మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనలో 35 లక్షల రూపాయల ఆస్తినష్టం సంబవించినట్లు వెల్లడించారు.
ప్రమాదసమయంలో పోగలు కిలోమీటర్ మెర వ్యాపించాయి. పెద్ద పరిశ్రమ... అతి చిన్న పరికరం.. రెండువేల గజాల స్థలంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలో నిర్వహకులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదని పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి వెల్లడించారు. కేవలం చిన్నపాటి మంటలను ఆర్పే పరికరం తప్ప ఎలాంటి ముందస్తు వస్తూవులు లేవన్నారు. ఆ పరికరం సైతం ఎక్స్‌పైరీ డెట్ అయిపోయిందని వెల్లడించారు. అనుమతి లేదు... ఆనంద్ నగర్‌లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. కాటేదాన్‌తో పాటు గగన్‌పహాడ్ ప్రాంతాలలో ఎలాంటి ప్రమాదాలు జరిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు సంఘటన స్థలానికి చెరుకోని అక్రమ పరిశ్రమలని అనుమతులు లెవని తెలుపుతున్నారు.
కానీ వాటిని నిరోధించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. సోమవారం ప్రమాదానికి గురైన పరిశ్రమకు సైతం అనుమతులు లేవని జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. భయాందోళనలో స్థానికులు... దట్టమైన పోగలు కిలో మీటర్ మేర వ్యాపించాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. గతంలో ఎన్ని ప్రమాదాలు జరిగిన ఈ స్థాయిలో దట్టమైన పోగ చూడలేదని స్థానికులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన కంపెనీ చూట్టు ముట్టు ఉన్న ఇతర కంపెనీలని అధికారులు హుటాహుటిన ఖాళీ చేయించారు.