విద్యుత్ శాఖకు అపార నష్టం
విద్యుత్ శాఖకు అపార నష్టం
Published Sun, Sep 25 2016 4:43 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
గుంటూరు (నగరంపాలెం): భారీ వర్షాలకు చెరువులకు గండ్లుపడి వరదనీరు ముంచెత్తడంతో నర్సరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, రాజుపాలెం, క్రోసురు, అచ్చంపేట, చిలకలూరిపేట పరిధిలోని చాలా గ్రామాల్లో విద్యుత్‌శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. వీటి పరిధిలోని సుమారు ఆరు మండలాల్లోని 82 గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థలో అంతరాయం ఏర్పడింది. నివాస ప్రాంతాలకు చెందిన 11,780 సర్వీసులు, వ్యవసాయానికి సంబంధించి 2180 సర్వీసులకు ఇబ్బంది కలిగింది. శనివారం సాయంత్రం వరకు బ్రాహ్మణపల్లి, రాజుపాలెం ప్రాంతాల్లో వరదనీరు భారీగా నిల్వ ఉంది. పీసపాడు వద్ద 33 కేవీ లైనుకు సంబంధించి 20 విద్యుత్ స్తంభాలు, 11 కేవీకి చెందిన 876, ఎల్‌టీ లైను పోల్స్ 847 కూలిపోయాయి. సుమారు 82 కిలోమీటర్ల మేర ఎల్‌టీ, 11 కేవీ లైన్లు దెబ్బతిన్నాయి. 387 వరకు ట్రాన్స్‌ఫార్మర్లు నీటిలో మునిగి మరమ్మతులకు గురయ్యాయి. విద్యుత్‌శాఖకు రూ.2.5 కోట్లు నష్టం వచ్చినట్లు ప్రాథమికంగా అంచనావేశారు. శనివారం ఎనర్జీ సెక్రటరీ అజయ్ జైన్ విద్యుత్‌శాఖ జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లాలో వరద ప్రబావిత ప్రాంతాల్లో జరిగిన విద్యుత్‌శాఖ నష్టంపై సమీక్షించారు. సాధ్యమైనంత వరకు మరమ్మతులు వేగవంతం చేయాలని సూచించారు.
18 సబ్ స్టేషన్లకు అంతరాయం...
వరద ప్రభావిత ప్రాంతాల్లో 35 బృందాలతో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నాం. వరదనీరు తగ్గినప్పటి నుంచే 60 శాతం గ్రామాలకు గురువారం రాత్రే విద్యుత్ సరఫరా చేశాం. వరదల వల్ల 18 సబ్‌స్టేçÙన్‌లకు అంతరాయం కలిగింది. కొన్ని సబ్‌స్టేçÙన్‌లలో నీరు నిల్వ ఉండటంతో శనివారం సాయంత్రం నాటికి ఆరు గ్రామల మినహా అన్ని సర్వీసులకు సరఫరాను పునరుద్ధరించాం. పొలాల్లో నీరు భారీగా నిల్వ ఉండటంతో వ్యవసాయ కనెక్షన్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులు పెండింగులో ఉన్నాయి.
– ఎస్‌ఈ బి.జయభారతరావు
Advertisement