మెడికల్ సీట్ల కేటాయింపులో రూ.100 కోట్ల కుంభకోణం
-
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్
నెల్లూరు(సెంట్రల్):
మెడికల్ సీట్ల కేటాయింపులలో మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులు సుమారు రూ.100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్రప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ ఆరోపించారు. నెల్లూరులోని సీపీఐ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రుల కుంభకోణంతో పేద విద్యార్థులు మెడిసిన్ చదివే అవకాశం కోల్పోయారని పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గు చేటన్నారు. అలాగే పేద విద్యార్థులు చదువుకునే సంక్షేమ వసతిగహాల పరిరక్షణకు యువత ఉద్యమించే తరుణం ఆసన్నమైందన్నారు. పేదలపై కక్ష సాధింపు చర్యలు టీడీపీ ప్రభుత్వం పూనుకుంటోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ వసతిగహాలను మూసి వేయడం ద్వారా పేద, దళిత విద్యార్థులు విద్యకు దూరమవుతారన్నారు. కార్పొరేట్, ప్రైవేటు రంగాలకు తొత్తులుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ సంక్షేమ వసతిగహాలను మూసి వేయడం దుర్మార్గమన్నారు. ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి యామదాల మధు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించక పోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సునీల్, ఉపాధ్యక్షుడు శ్రీహరి పాల్గొన్నారు.