రొట్టెల పండుగకు భారీ భద్రత | Huge security for rottela pandaga | Sakshi
Sakshi News home page

రొట్టెల పండుగకు భారీ భద్రత

Published Sat, Oct 8 2016 1:58 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

రొట్టెల పండుగకు భారీ భద్రత - Sakshi

రొట్టెల పండుగకు భారీ భద్రత

  • –2,100మందితో బందోబస్తు
  • డ్రోన్, సీసీ కెమెరాలతో  పర్యవేక్షణ
  • ప్రత్యేక పోలీసు సేవాదళ్‌ ఏర్పాటు
  • గుంటూర్‌ రేంజ్‌ ఐజీ ఎన్‌. సంజయ్‌
  • నెల్లూరు(క్రైమ్‌):
    నెల్లూరు బారాషాహీద్‌ దర్గా ఆవరణలో ఈనెల 12 నుంచి జరగనున్న రొట్టెల పండుగకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోన్నట్లు గుంటూర్‌ రేంజ్‌ ఐజీ ఎన్‌. సంజయ్‌ వెల్లడించారు. శుక్రవారం ఆయన జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ, నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్,  ఇతర పోలీసు అధికారులతో కలిసి బారాషాహీద్‌ దర్గాలో రొట్టెల పండుగ బందోబస్తు ఏర్పాట్లు , కమాండ్‌కంట్రోల్‌రూమ్, నూతనంగా నిర్మించిన ఘాట్లను పరిశీలించారు. అనంతరం పండుగ సందర్భగా పోలీసుశాఖ తీసుకొంటున్న భద్రతా ఏర్పాట్లను విలేకరులకు వెల్లడించారు. మతసామరస్యానికి రొట్టెల పండుగ ప్రతీక అన్నారు. దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పండుగలో పాల్గొంటున్నారన్నారు. ఈనెల 12 నుంచి 16వరకు పండుగ జరగనుందన్నారు.  గతేడాది 5లక్షల  మంది దర్గాను దర్శించారనీ, ఈఏడాది 10లక్షల మందికి పైగా భక్తులు పండగుకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్గకుండా జిల్లా పోలీసు యంత్రాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భక్తులు దర్గాను సందర్శించేందుకు అవసరమైన అన్నీ చర్యలు చేపట్టామన్నారు. మునుపెన్నడూ లేని విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోన్నట్లు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం దర్గా ఆవరణలో పోలీసు కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇది 24గంటలు పనిచేస్తుందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గినా నేరుగా కంట్రోల్‌రూమ్‌లో ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకొంటామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కల్గకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ఏసిసుబ్బారెడ్డిస్టేడియం, టిబి హాస్పిటల్, కస్తూరిదేవి గార్డెన్స్‌ తదితర ప్రాంతాల్లో పార్కింగ్‌జోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 
    2,100మందిదో బందోబస్తు...
    పండుగలో భక్తులు ఇబ్బందులు కల్గకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేస్తోన్నామన్నారు. జిల్లా పోలీసులతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు బందోబస్తు విధుల్లో పాల్గొనున్నారని చెప్పారు. ఇద్దరు ఎఎస్పీలు, 13మంది డిఎస్పీలు, 41మంది సిఐలు,113మంది ఎస్‌ఐలతో పాటు 1698మంద పోలీసు సిబ్బంది, కృష్ణపట్నం పోర్టుకు చెందిన 100మంది సెక్యూరిటీగార్డులు, 100మంది ఎన్‌సిసి క్యాడెట్లు 24గంటలు షిఫ్టుల వారిగా బందోబస్తు నిర్వహిస్తారన్నారు. దొంగలు విజృంభించే అవకాశం ఉన్న దృష్ట్యా మఫ్టీలో క్రైం సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 
    ప్రత్యేక పోలీసు సేవాదళ్‌
    వికలాంగులు, వృద్దుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతంలో ఎన్నడూలేని విధంగా 33మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక పోలీసు సేవాదళ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సదరు సిబ్బంది ప్రత్యేక దుస్తుల్లో ఉంటూ దర్గాకు వచ్చే వికలాంగులు, వృద్దులు తదితరులను దగ్గరుండి దర్గాను సందర్శించుకొనేలా చర్యలు చేపట్టామన్నారు. ఇది వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. 
    డ్రోన్, సీసీకెమెరాల పర్యవేక్షణ:
    ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా దర్గా ఆవరణతో పాటు నగరంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద, గంధం వచ్చే రహదారి వెంబడి 36సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దర్గా ఆవరణలో ప్రత్యేకంగా నాలుగు డ్రోన్‌ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామనీ వీటన్నింటిని కంట్రోల్‌రూమ్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌కు అనుసంధానం చేస్తామన్నారు. అక్కడ నుంచి జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్, విజయవాడలోని రాష్ట్ర కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌కు అనుసంధానం చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు అక్కడ నుంచే రొట్టెల పండుగలో ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉందన్నారు. సుశిక్షతులైన సిబ్బంది 24గంటల పాటు కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌లో ఉంటూ పత్రి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. పండుగ సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లుచేపట్టిన జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీని ఈ సదర్భంగా ఐజీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బి, నెల్లూరు నగర, ట్రాఫిక్‌ డిఎస్పీలు ఎన్‌. కోటారెడ్డి, జి.వి రాముడు, నిమ్మగడ్డ రామారావు, ఒకటి, నాలుగు, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లు అబ్దుల్‌ కరీం, సిహెచ్‌ సీతరామాయ్య, వెంకటరావు, ఎస్‌ఐలు గిరిబాబు, శ్రీనివాసరెడ్డి, బలరామయ్య, దర్గా కమిటీ సిబ్బంది తదితరులు çపాల్గొన్నారు. 
     
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement