పట్టాలపైకి ‘హంసఫర్’
- గుంతకల్లు–తిరుపతి మధ్య ట్రయల్ రన్
గుంతకల్లు : సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ ఆమితాబ్ ఓజా చెప్పారు. 2016–17 రైల్వే బడ్జెట్‌లో రైల్వే మంత్రి సురేష్‌ప్రభు తిరుపతి నుంచి ఉత్తరాది రాష్ట్రంలోని జమ్మూతావి క్షేత్రంలోని వైష్ణవిదేవి ఆలయం సందర్శనార్థం హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రవేశపెట్టారు. ఈ రైలు గుంతకల్లు నుంచి తిరుపతి మధ్య శుక్రవారం ట్రయల్ రన్ చేశారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం అమితాబ్ ఓజా, ఏడీఆర్‌ఎం సుబ్బరాయుడు తదితర అధికారుల బృందం గుంతకల్లులో రైలును పరిశీలించారు.
అనంతరం డీఆర్‌ఎం మాట్లాడుతూ సాధారణ ప్రయాణికులకు మెరుగైన వసతి కల్పించాలనే ఉద్దేశంతోనే హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించారన్నారు. కోచ్‌లను జీపీఎస్ (గ్లోబుల్ పొజిషన్ సిస్టం) బేస్డ్ ప్యాసింజర్ పద్ధతిన నిర్మించినట్టు చెప్పారు. ప్రయాణ సమయంలో ముందస్తు రైల్వేస్టేషన్ వివరాలు, ప్రయాణ దూరం తెలియజేస్తూ ఆటోమెటిక్ డిస్‌ప్లే అవుతుందన్నారు. సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు కావడంతో వేగాన్ని పరిశీలించడానికి ట్రయల్ రన్ నిర్వహించినట్లు చెప్పారు. ట్రయల్ రన్‌లో డివిజనల్ అధికారులు, సీనియర్ డీఓఎం ఆంజినేయులు, సీనియర్ డీఈఈ (మెయింటెనెన్స్) అంజయ్య, సీనియర్ డీఈఈ (టీఆర్‌డీ) విజయేంద్రకుమార్, సీనియర్ డీఈఎన్ (కోఆర్డినేషన్) మనోజ్‌కుమార్, ఏసీఎంలు రాజేంద్రప్రసాద్, ఫణికుమార్, స్టేషన్ మాస్టర్ లక్ష్మానాయక్, సీటీఐ వై ప్రసాద్, సీఎంఎస్‌లు ఫజుల్ రహిమాన్, ఖాదర్‌భాషా పాల్గొన్నారు.
‘హంసఫర్’ ప్రత్యేకతలు
- రైలులో 18 త్రీటైర్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. ప్రతి కోచ్‌లోనూ 6 సీసీ కెమెరాలు, కోచ్ ప్రధాన ద్వారం రెండు వైపులా 2 చొప్పున సీసీ కెమెరాలు ఉంటాయి.
- అగ్ని ప్రమాదాలు, సాంకేతిక లోపాల కారణంగా పొగలు తదితరాలు ఏర్పడితే ఆటోమెటిక్ అలారం మోగుతుంది. ప్రమాదం జరిగిన ప్రదేశం అలారం యంత్రంలో డిస్‌ప్లే అవుతుంది.
- బోగీలో సీటు సీటుకు ప్రత్యేక కర్టెన్
- అత్యాధునిక పరికరాలతో ఆకర్షణీయ రంగులతో ప్రత్యేక మరుగుదొడ్లు
- బాత్‌రూంలో కూడా అందుబాటులో సెల్‌ఫోన్ చార్జింగ్ పాయింట్లు
- బోగీ నుంచి బోగీకి మధ్య ఆటోమెటిక్ డోర్ కంట్రోల్ సిస్టం
- హాట్‌కేస్ భోజన, అల్పాహార సదుపాయం
- ఆటోమేటిక్ వెడ్డింగ్ మిషన్ ద్వారా టీ, కాఫీ, పాలు ఇతర తేనీటి విందు ఏర్పాటు
- హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు చార్జీలు ఇతర మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైలు చార్జీల కంటే 20 శాతం అదనం