ఆకర్షించని నగరాలు
ఆకర్షించని నగరాలు
Published Thu, Jul 21 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
ఆర్భాటమేగానీ... కానరాని ఆచరణ
స్మార్ట్ సిటీలపై చిత్తశుద్ధి కరువు
ఒక్కవార్డులోనూ అమలుకు నోచుకోని పథకం
వనరులు, నిధులు విడుదలపై ఊసెత్తని పాలకులు
విజయనగరం మున్సిపాలిటీ : ప్రతి జిల్లా కేంద్రంతో పాటు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దుతామని ఆర్భాటంగా పాలకులు చేసిన ప్రకటన ఇప్పటికీ కార్యరూపం దాల్చడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రకటించిన కార్యక్రమం జిల్లాలోని ఎంపిక చేసిన ఐదు పట్టణ ప్రాంతాల్లోని ఒక్క వార్డులోనూ అమలుకునోచుకోలేదు. ఏడాదిన్నర క్రితం మున్సిపల్ పాలకవర్గాలు స్మార్ట్ పేరుతో నిర్వహించిన కార్యక్రమాలు కేవలం బూటకమని తేలిపోయింది.
దత్తత విధానం కాదని....
రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన చిన్న పాటి పట్టణాల నుంచి పెద్ద నగరాలను సైతం స్మార్ట్ సిటీలుగా తయారు చేయాలనే భావనతో ఆరునెలల క్రితం స్మార్ట్ వార్డుల పథకాన్ని తెరపైకి తీసుకువచ్చింది. గతంలో ఆయా ప్రాంతాలను, పట్టణాలను స్మార్ట్‌గా తీర్చిదిద్దేందుకు దత్తత విధానాన్ని తెరపైకి తీసుకురాగా.. ఏ ఒక్క శ్రీమంతుడూ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రాలేదు. ఇక తప్పదని రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగరపంచాయతీల్లో మొత్తం వార్డుల్లో 20 శాతం వార్డులను 2016 మార్చి నెలాఖరులోగా స్మార్ట్‌గా తీర్చిదిద్దాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పలు నిబంధనలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇలా దశల వారీగా స్మార్ట్ వార్డులను తీర్చిదిద్దూతూ స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగానే విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న 9వ వార్డుతో పాటు 3, 5, 13, 15, 22, 24, 32 వార్డులను ఎంపిక చేశారు. తరువాత బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో వార్డులను ఎంపిక చేస్తారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వార్డు ప్రజలకు కష్టాలు తీరినట్లేనన్న భావన వ్యక్తమవుతోంది. అయితే ఐదు పట్టణప్రాంతాల్లో ఎంపిక చేసిన ఏ ఒక్క వార్డులోనూ ఈ పథకం అమలుకు నోచుకోలేదు. పైగా గతంలో కన్నా పరిస్థితులు దయనీయంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
స్మార్ట్ వార్డుగా మారాలంటే...
ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పట్టణప్రాంతాల్లో వార్డులు స్మార్ట్‌గా రూపుదిద్దుకోవాలంటే ప్రధానంగా ఐదు అంశాలు అమలు చేయాల్సి ఉంది.వార్డు పరిధిలో గల గృహాలన్నింటికీ శతశాతం మంచి నీటి కుళాయి కనెక్షన్లు కల్పించాలి. నిరంతరం వాటి ద్వారా నీటి సరఫరా చేయాలి.శతశాతం వార్డులోని గృహాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ఇంటింట చెత్త సేకరణ పక్కాగా నిర్వహించటంతో పాటు సేకరించిన చెత్తను కుప్పలుగా వదిలేయకుండా ఎప్పటికప్పుడు డంపింగ్‌యార్డుకు తరలించాలి. తడి పొడిచెత్తలను వేరు చేయాలి. స్మార్ట్‌కు ఎంపిక చేసిన వార్డుల్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలి. వార్డు పరిధిలో ప్రధాన జంక్షన్లు ఉంటే అక్కడ మొక్కలు నాటాలి. నీటి సంరక్షణలో భాగంగా ఇంకుడు గుంతలు నిర్మించాలి.
వీటితో పాటు జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో అమలు చేయాల్సిన 20 అంశాల్లో ప్రగతి సాధించాలి.
Advertisement
Advertisement