ఆటంకాలెన్నో!
ఆటంకాలెన్నో!
Published Fri, Oct 21 2016 1:40 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
ఆకివీడు : ‘ఆటలకు అమిత ప్రాధాన్యం ఇస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తయారుచేస్తాం. వారు ఆటల్లో తర్ఫీదు పొందేందుకు అన్ని వసతులూ కల్పిస్తాం’ అంటూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు ఆచరణలో అమలు కావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ఆటంకాలెదురవుతున్నాయి. దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణంగా కనిపిస్తున్నాయి. జిల్లాలోని 464 ఉన్నత పాఠశాలల్లో క్రీడా మైదానాలు ఉన్నాయి. వీటిలో 80 శాతం పచ్చికబయళ్లను తలపిస్తున్నాయి. కొన్ని మైదానాలు ఆటకు అనుకూలంగా లేవు. చాలా పాఠశాలల్లో కీడ్రా పరికరాలే లేవు. దాతల సహకాంతో క్రీడా సామగ్రి పాఠశాలలకు అందినా ఆడుకునేందుకు క్రీడామైదానం అనుకూలంగా లేకపోవడంతో అవి స్టోర్ రూమ్‌లకే పరిమితమైపోతున్నాయి.
రైకాకి రెక్కలొచ్చేనా!
గతంలో పైకా (పంచాయతీ యువ క్రీడా ఖేల్ అభియాన్) పేరుతో పాఠశాలల్లోని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించేవారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేవారు. అయితే ఆ పథకం పేరును గత ప్రభుత్వం రైకా(రాజీవ్ యువ క్రీడా ఖేల్ అభియాన్)గా మార్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అటకెక్కించాయి. పాఠశాలల్లో చదువుతున్న ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదివే విద్యార్థులకు ఈ పథకం కింద మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించాలి. ప్రతిభ ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించాలి. అయితే ఇది ఎక్కడా అమలు కావడం లేదు.
పీఈటీలేరీ !
పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సరిపడా పీఈటీలూ లేరు. పీఈటీలు ఉన్నా.. బడుల్లో క్రీడా మైదానాలు లేవు. మైదానాలు ఉన్నా.. అవి ఆటలకు అనుకూలంగా లేవు. ఇలా అనేక సమస్యలు ఆటలతో దోబూచులాడుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు.
నిధుల కొరత
అధ్వానంగా తయారైన మైదానాల మరమ్మతులకు, క్రీడా సామగ్రికి నిధుల కొరత ఉన్నట్టు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. అయితే స్కూల్ గ్రాంట్‌ను దీనికి వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఆ గ్రాంటుతో బడి నిర్వహణ చేస్తున్నందున క్రీడాభివృద్ధికి దానిని కేటాయించలేమని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.
స్కూల్ గ్రాంట్ వినియోగించలేం
స్కూల్ గ్రాంట్‌ను క్రీడాభివృద్ధికి వినియోగించలేం. రూ.7 వేల గ్రాంటును బడి నిర్వహణకే సరిపోతోంది. – రామానుజాచార్యులు, ప్రధానోపాధ్యాయుడు, చినకాపవరం
ఆటలకు జాగాలేదు
మా బడిలో క్రీడా ప్రాంగణం ఉన్నా.. ఆడుకునేందుకు జాగాలేదు. నిన్న మొన్నటి వరకూ వర్షపు నీటితో మైదానం నిండిపోయింది. ఇప్పుడిప్పుడే నీరు ఇంకుతోంది. ప్రస్తుతం కొద్ది ఖాళీ స్థలంలోనే ఆటలాడుకుంటున్నాం. మాకు తగిన శిక్షణ లేదు. – రవి, విద్యార్థి, జెడ్పీ హైస్కూల్, ఆకివీడు
స్కూల్ గ్రాంట్‌తో క్రీడాసామగ్రి
స్కూల్ గ్రాంట్లతో క్రీడా సామగ్రి కొనుక్కోవచ్చు. దాతల సహకారంతో కొన్ని పాఠశాలలకు సామగ్రి అందుతోంది. – ఎం.సూర్యనారాయణమూర్తి, డివైఇఓ, భీమవరం.
రైకా తేదీలు ఖరారు కాలేదు
రైకా పోటీలకు ప్రభుత్వం తేదీలు ఖరారు చేయలేదు. ఈ నెలాఖరులోపు ఖరారయ్యే అవకాశం ఉంది. అండర్–14, అండర్–17 స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తాం. మండలం, జోనల్, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించాల్సి ఉంది. విద్యార్థినులకు ఈ ఏడాది పోటీలు లేవు. – ఎస్‌కె. అజీజ్, జిల్లా క్రీడాధికారి, ఏలూరు
Advertisement
Advertisement