ఏబీ రోడ్డులో బైఠాయించిన యెన్నిరామన్నపేట గ్రామస్తులు
వంశధార ప్రాజెక్టు పనులను అడ్డుకున్న వై.ఆర్.పేట గ్రామస్తులు
ఏబీ రోడ్డులో బైఠాయింపు
గ్రామాన్ని 4(1)గెజిట్‌లో చేర్చాలని డిమాండ్
కొత్తూరు: గ్రామాన్ని 4(1) గెజిట్‌లో చేర్చేవరకు వంశధార ప్రాజెక్టు పనులు అడ్డుకుంటామని మండలంలోని యెన్ని రామన్నపేట(వైఆర్‌పేట) గ్రామస్తులు తేల్చి చెప్పారు. ఏపీ ప్రాజెక్టుల నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగరాపు సింహాచలం ఆధ్వర్యంలో ప్రాజెక్టు రెండోదశ పనులను సోమవారం అడ్డుకున్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కరించే వరకు పనులు సాగనివ్వమంటూ యంత్రాల ముందుకు వెళ్లి నినదించారు. తక్షణమే గ్రామాన్ని 4(1) గెజిట్‌లో చేర్చి పరిహారాలు చెల్లించాలని కోరారు. విషయం తెలుసుకున్న ఈఈ అప్పలనాయుడు, డీఈఈలు, జేఈలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పనులు అడ్డుకోవద్దని సూచించారు. ప్రస్తుతం వరద కాలువ పనులు మాత్రమే చేస్తున్నామని చెప్పారు. దీనికి వై.ఆర్.పేట గ్రామస్తులు స్పందిస్తూ ఐదేళ్లకిందట గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా గుర్తించారని, 4(1) గెజిట్‌లో చేర్చడంలో జాప్యం చేయడంపై మండిపడ్డారు. గ్రామస్తులు అందజేసిన వినతి పత్రంలో ఉన్న డిమాండ్‌లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఈఈ తెలిపారు. నిర్వాసితులపై ప్రభుత్వ తీరుకు నిరసనగా అలికాం–బత్తిలి రోడ్డు వైఆర్‌పేట వద్ద బైఠాయించి వాహనరాకపోకలను అడ్డుకున్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ తిర్లంగి కృష్ణమోహన్, పాపారావు, జనార్దనరావు, నర్సింహమూర్తి, గోవిందరావు, కూన అర్జునరావులు పాల్గొన్నారు.