
కిరోసిన్ పోసిన భర్త..నిప్పంటించుకున్న భార్య
నాగార్జునసాగర్ : భార్యాభర్తల మధ్య గొడవ జరిగి భార్యపై భర్త కిరోసిన్ పోయగా ఆమె కోపంతో నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన స్థానిక పైలాన్‌కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బం డారు షిలారు(సైదులు), రమాదేవి దంపతులు. కాగా షిలారు మద్యానికి బానిసై మంగళవారం కూడా బాగా తాగి వచ్చాడు. దాంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మళ్లీ మద్యం తాగి వస్తే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని రమాదేవి పేర్కొంది.
దాంతో షిలారు కోపంతో నీవేంటి పోసుకునేది నేనేపోస్తా అంటూ భార్యపై కిరోసిన్ పోశాడు. అనంతరం రమాదేవి ఆగ్రహంతో వంటికి నిప్పంటించుకుంది. అనంతరం షిలారు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అప్పటికే 50 శాతం శరీరం కాలిపోయింది. వెంటనే స్థానిక కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నల్లగొండకు తరలించారు. మంటలు ఆర్పే క్రమంలో షిలారు చేతులు కూడా కాలడంతో సాగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.