భార్యను కిరాతకంగా హత్యచేసిన భర్త
►అనుమానంతో అమానుషం
► కె.కన్నాపురంలో ఘటన
► పరారీలో నిందితుడు
► అనాథగా మారిన మూడేళ్ల కుమారుడు
కె.కన్నాపురం (పెదవేగి రూరల్) : అనుమానంతో ఓ భర్త భార్యను హత్య చేసిన ఘటన పెదవేగి మండలం కె.కన్నాపురంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. మృతురాలి అక్క తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెదవేగి మండలం కొమ్మువారి కన్నాపురం కాలనీకి చెందిన జొన్నకూటి గంగరాజు, జయమ్మ దంపతులకు నలుగురు ఆడ పిల్లలు. రెండో కుమార్తె రోజా(26)ను 2009లో పెదవేగి మండలం కవ్వగుంట గ్రామానికి చెందిన తాళ్లూరి ఏసు కుమారుడైన తాళ్లూరి వెంకటేశ్వరరావుకు ఇచ్చి వివాహం చేశారు.
వీరికి సుమారు మూడేళ్ల వయసు కలిగిన మహిందర్ అనే కుమారుడు ఉన్నాడు. పెళ్లయిన నాటి నుంచి వెంకటేశ్వరరావు రోజాను అనుమానంతో మానసికంగా, శారీరకంగా వేధిస్తుండేవాడు. పలుమార్లు పెద్దలు మందలించినా మార్పు రాకపోగా వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో సుమారు 4 నెలల క్రితం రోజా కె.కన్నాపురంలోని పుట్టింటికి వచ్చేసింది. వెంకటేశ్వరరావు అప్పుడప్పుడూ వచ్చి భార్యతో తగాదాపడడంతో పాటు దాడిచేసి గాయ పరిచేవాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో వెంకటేశ్వరరావు రోజా ఇంటికి వచ్చాడు.
రోజా తల్లి జయమ్మ, అక్క రజని, కుమారుడు మహిందర్ ఇంటిలోనే ఉన్నారు. రోజా ఒంటరిగా ఉన్న సమయం చూసి వెంకటేశ్వరరావు కత్తితో ఆమెపై దాడి చేశాడు. మెడపై, చేతులపై నరికాడు. రోజా అక్క రజని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై కూడా కత్తితో దాడి చేసే యత్నం చేశాడు. అరిస్తే చంపుతానంటూ బెదిరిస్తూ బయటకు పారిపోయాడు. అనంతరం రోజా తల్లి, అక్క కేకలకు చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. అప్పటికే రోజా మృతి చెందింది. రజని ఫిర్యాదు మేరకు పెదవేగి ఎస్సై రామకోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని ఏలూరు డీఎస్పీ జి.వెంకటేశ్వరరావు, సీఐ నాగ మురళీ పరిశీలించారు.