గుంతకల్లు : కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఓ మహిళ కట్టుకున్న భర్తను కొడుకు సహాయంతో అంతమొందించిన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో చోటుచేసుకుంది. గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులు, బంధువుల కథనం మేరకు.. విద్యుత్ శాఖలో లైన్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సాల్మన్‌రాజు (48) కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు రోడ్డులో నివాసముంటూ మండల కేంద్రమైన యాడికిలో విధులు నిర్వర్తించేవాడు. ఇతనికి భార్య ప్రేమలత, కుమారుడు శశాంక్ (24), కుమార్తె స్వరూప(20) ఉన్నారు. తాగుడుకు బానిసైన సాల్మన్‌రాజు విధుల్లో తనకు సహాయంగా కుమారుడిని వెంట తీసుకువెళ్లేవాడు.
ఈ నేపథ్యంలో భర్తను చంపితే కుమారుడికి ఉద్యోగం వస్తుందని భావించిన ప్రేమలత.. గురువారం మద్యం మత్తులో ఉన్న భర్తను కుమారుడితో కలిసి చితకబాది కిందికి తోసింది. ఈ క్రమంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అయితే.. మెట్లపై నుంచి కిందపడ్డాడని నాటకమాడారు. స్థానికంగా ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకువెళ్లి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించి సాల్మన్‌రాజు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. శనివారం ఉదయం మృతదేహాన్ని సంప్రదాయం ప్రకారం ప్రభాత్‌నగర్‌లోని సీఎస్‌ఐ చర్చికి తీసుకెళ్లి ప్రార్థనలు చేయించారు. అంతలో సాల్మన్ మృతిపై అనుమానాలున్నాయని ఆయన బంధువులు వన్‌టౌన్ ఎస్‌ఐ నగేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాల్మన్‌రాజు భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో వాస్తవం వెలుగు చూసింది. కేసు దర్యాప్తులో ఉంది.
కొడుకు ఉద్యోగం కోసం భర్త హత్య
Published Sun, Jun 5 2016 12:25 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
Advertisement