మొగుడు కాదు యముడు
- వరకట్నం కోసం భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త
- ఫ్యాన్‌కు ఉరేసుకుందని పూడ్చిపెట్టే ప్రయత్నం
- మృతురాలి తండ్రి వెళ్లడంతో పరార్
- నాన్నే కర్రతో కొట్టాడని చెబుతున్న మూడేళ్ల కుమార్తె
- పోలీసుల అదుపులో అత్త
దొరవారిసత్రం (సూళ్లూరుపేట): అగ్ని సాక్షిగా మూడు ముళ్లు వేసి జీవితాంతం నీ వెంట ఉంటానని ప్రమాణం చేసిన భర్తే వరకట్నం కోసం యముడిగా మారాడు. మద్యం మత్తులో భార్యను కర్రతో కొట్టి హతమార్చాడు. అనంతరం భార్య ఫ్యాన్‌కు ఉరేసుకుందని గోప్యంగా పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించాడు. మండలంలోని మొదుగులపాళెంలో గురువారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు...తడ మండలం పెదమాంబట్టు గ్రామానికి చెందిన సమ్మన మునిరాజ, శ్యామల దంపతుల కుమార్తె హరిత(25)కు మొదుగుళపాళేనికి చెందిన కాటూరు వెంకటయ్య, బుజమ్మ పెద్దకుమారుడు బాబుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. కొంత కాలం వీరి కాపురం సజావుగా సాగింది.
వీరికి మూడేళ్ల కుమార్తె హర్షిత ఉంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం చందనముడిలోని సమీప బంధువుల ఇంట్లో జరిగిన పుట్టిరోజు వేడుకలకు హరితను అత్త బుజ్జమ్మ వదిలిపెట్టి ఇంటికి వచ్చింది. సాయంత్రం భర్త బాబు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లిందని గొడవ పెట్టుకోవడంతో హరిత బంధువులు ఆమెను తీసుకువచ్చి వదిలిపెట్టి వెళ్లారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న బాబు భార్యపై కర్రతో దాడి చేయడంతో మృతి చెందింది. అనంతరం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుందని మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండానే కుటుంబ సభ్యుల సహాయంతో పూడ్చిపెట్టేందుకు ట్రాక్టర్‌లో తరలించేందుకు సన్నాహాలు చేశాడు. ఈ క్రమంలోనే రాత్రి వేళ హరిత తండ్రి మునిరాజ వెళ్లడంతో శవాన్ని వదిలిపెట్టి పరారయ్యాడు.
మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నాయుడుపేట సీఐ రత్తయ్య, దొరవారిసత్రం ఎస్సై కోటిరెడ్డి శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకుని మృతిపై ఆరా తీశారు. మృతురాలి కుడి చెప్ప, గొంతుపై బలమైన గాయాలు ఉండడంతో శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అత్త బుజ్జమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతురాలు తండ్రి మునిరాజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
అదనపు కట్నం కోసమే బలితీసుకున్నాడు
హరిత, బాబులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో బాబుకు 10 సవర్లు, హరితకు 40 సవర్ల బంగారంతో పాటు కట్నం కింద రూ.5లక్షలు అందజేసినట్లు మృతురాలి తండ్రి మునిరాజా తెలిపాడు. పెళ్‌లైన ఆరు నెలల నుంచి బాబు అదనపు కట్నం కోసం భార్యను హింసిస్తూ పలుమార్లు పుట్టింటికి పంపేవాడు. ఆ సమయంలో పెద్దల సమక్షంలో కొంత నగదు ఇచ్చి మధ్యస్తం చేసి పంపేవాళ్లమని, అయినా తన బిడ్డను బలితీసుకున్నాడని మృతురాలి తండ్రి బోరున విలపించాడు. చివరికి అభంశుభం తెలియని హరిత మూడేళ్ల కుమార్తె హర్షిత కూడా నాన్న అమ్మను కర్రతో కొట్టాడని వచ్చి రాని మాటల్లో చెబుతుండడం చూసి బంధువులు ఎంత ఘోరమని కన్నీటి పర్యంతమయ్యారు.
డీఎస్పీ విచారణ
గూడూరు డీఎస్పీ శ్రీనివాసులు మొదుగుళపాళేనికి చేరుకుని హరిత మృతదేహాన్ని పరిశీలించి మృతిపై విచారించారు. అనంతరం నిందితుడ్ని పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు.