హతురాలు వెంకటమ్మ మృతదేహం
రాజేంద్రనగర్: అనుమానంతో భార్య గొంతు నులిమి చంపేశాడు.. నేరం తనపై రాకుండా ఉండేందుకు ఇతరులతో మధ్యాహ్నం జరిగిన గొడవలో తగిలిన దెబ్బల వల్ల చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడో భర్త. రాజేంద్రనగర్ పోలీసుల కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా గండేడ్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన కె.మల్లేష్(32)కు అదే ప్రాంతానికి చెందిన కె.వెంకటమ్మ(28)తో ఆరేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి శ్రీధర్(5), శ్రీదేవి(3) సంతానం.
ఎనిమిది నెలలుగా బండ్లగూడ సన్ సిటీ ప్రాంతంలో నిర్మిస్తున్న ఓ అపార్ట్‌మెంట్‌లో వెంకటమ్మ వాచ్‌మెన్ గా పని చేస్తూ.. అక్కడే కుటుంబం అంతా నివాసం ఉంటోంది. మల్లేష్ కూలీ పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన మల్లేష్ రోజూ తాగి వచ్చి భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని గొడవపడేవాడు. ఇదిలా ఉండగా... శనివారం మధ్యాహ్నం 3 గంటలకు అపార్ట్‌మెంట్‌లో సెంట్రింగ్ పని చేస్తున్న కార్మికుడు.. వెంకటమ్మ ఉంటున్న తాత్కాలిక గుడారంలోని విద్యుత్ స్విచ్చ్ బోర్డ్ నుంచి విద్యుత్ సరఫరా తీసుకోవడానికి సెంట్రింగ్ కార్మికుడు రాగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
కార్మికుడు ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చిన మల్లేష్ గొడవ విషయం తెలుసుకొని సదరు కార్మికుడిని నిలదీయడంతో ఇద్దరు సెంట్రింగ్ కార్మికులు అతడిని కొట్టారు. అడ్డువెళ్లిన వెంకటమ్మను కూడా కొట్టి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి ఇదే విషయమై మల్లేష్, వెంకటమ్మ దంపతులు గొడవపడ్డారు. అనంతరం పిల్లలకు అన్నం తినిపించి వెంకటమ్మ నిద్రపోయింది. మద్యం మత్తులో ఉన్న మల్లేష్ భార్యపై ఉన్న అనుమానం, ఆమెపై ఉన్న కోపం కారణంగా టవల్‌తో వెంకటమ్మ మెడకు చుట్టి, ఊపిరాడకుండా చేసి చంపేశాడు. రాత్రి సెంట్రింగ్ కార్మికులు కొట్టిన దెబ్బలతో తన భార్య చనిపోయిందని ఆదివారం ఉదయం గోల గోల చేసి స్థానికులను నమ్మించాడు.
స్థానికులు నిజంగానే రాత్రి జరిగిన గొడవలో తగిలిన దెబ్బలతో వెంకటమ్మ చనిపోయిందని భావించి రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి భర్తతో పాటు స్థానికులను ఘటనపై ఆరా తీశారు. అనంతరం సెంట్రింగ్ కార్మికులను స్టేషన్ కు తీసుకెళ్లి విచారిస్తున్న సమయంలో భార్యాభర్తలు తరచూ గొడవపడేవారనే విషయం తెలిసింది. వెంటనే భర్త మల్లేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. తనకు భార్యకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోకుండా తనతో గొడవ పడుతుండటంతో చంపేశానని చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అనాథలైన చిన్నారులు...
తల్లి చనిపోవడం.... తండ్రిని పోలీసులు అరెస్టు చేయడంతో చిన్నారులు శ్రీధర్, శ్రీదేవి అనాథలుగా మిగిలారు. వారి పరిస్థితిని చూసి చలించిపోయిన స్థానికులు ఇద్దరికీ అన్నం పెట్టి లాలించారు. అనంతరం వచ్చిన బంధువులకు ఇద్దరినీ అప్పగించారు.
(నింధితుడు మల్లేష్)