
భార్య అందంగా లేదని..
భార్యపై హత్యాయత్నం చేసిన భర్తతో పాటు ఆమె బావను పోలీసులు గురువారం రిమాండుకు తరలించారు.
♦ వేధింపులు..ఆపై హత్యాయత్నం
♦ భర్తతో పాటు బావ రిమాండు
మోమిన్‌పేట: భార్యపై హత్యాయత్నం చేసిన భర్తతో పాటు ఆమె బావను పోలీసులు గురువారం రిమాండుకు తరలించారు. తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఏవీ రంగా వివరాలు వెల్లడించారు. బంట్వారం మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన ప్రభు(28) నాలుగు సంవత్సరాల క్రితం ధారూరు మండలం మున్నురుసోమారం అనుబంధ గ్రామమైన ధర్మపూర్ నివాసి లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరి కాపురం కొన్నిరోజుల పాటు సజావుగానే సాగింది. భార్య అందంగా లేదని కొంతకాలంగా ప్రభు లక్ష్మిని శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు.
దీంతో ఆమె గతంలో రెండుసార్లు మిహ ళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఇరువర్గాల పెద్దలు రాజీ కుదిర్చారు. భార్యను బాగా చూసుకుంటానని ప్రభు హామీ ఇచ్చాడు. దీంతో పోలీసులు దంపతులిద్దరికి కౌన్సెలింగ్ చేసి పంపించారు. అయినా ప్రభు తీరు మారలేదు. ఈక్రమంలో తన అన్న ఎల్లయ్యతో కలిసి ఈనెల 18న ఇంట్లో ఎవరూలేని సమయంలో లక్ష్మిపై హత్యాయత్నానికి ప్రయత్నించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నదమ్ములిద్దరిని అరెస్టు చేసి గురువారం రిమాండుకు తరలించారు. సమావేశంలో బంట్వారం ఇన్‌చార్జి ఎస్‌ఐ నాగభూషణం తదితరులు ఉన్నారు.