మేయర్‌ ఇన్‌ లవ్‌.. | Hyderabad Mayor Bonthu Rammohan wife Sridevi love story | Sakshi
Sakshi News home page

మేయర్‌ ఇన్‌ లవ్‌..

Published Tue, Feb 14 2017 2:08 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

మేయర్‌ ఇన్‌ లవ్‌..

మేయర్‌ ఇన్‌ లవ్‌..

సాక్షి, సిటీబ్యూరో : ఫేస్‌బుక్కులు.. వాట్సప్పులు లేవు. సెల్‌ఫోన్లు.. ఎస్సెమ్మెస్‌లు కూడా లేవు. చాటింగ్‌లు.. ఔటింగ్‌లు.. ఈటింగ్‌లు అసలే లేవు. పార్కులు,  సినిమాలు, షికార్లు జాన్తానై.  ఇవేవీ లేకుండానే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజ్‌ సాక్షిగా నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, శ్రీదేవిల ప్రేమ మొగ్గతొడిగింది. మొదట వీరి ప్రేమకు శ్రీదేవి కుటుంబం నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా.. నెలరోజుల్లోనే ఆమోదం పొందింది. 2000–01లో ఓయూలో పబ్లిక్‌అడ్మినిస్ట్రేషన్‌లో పీజీలో చేరిన రామ్మోహన్‌ జూనియర్‌ శ్రీదేవి. విద్యార్థి రాజకీయాల్లో, తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూలో క్రియాశీలకంగా ఉన్న రామ్మోహన్‌.. శ్రీదేవి నడవడిక నచ్చి మనసులోని మాట బయట పెట్టాడు.

2001 జూలైలో మొగ్గతొడిగిన వీరి ప్రేమబంధం 2004 ఫిబ్రవరి7న వాలంటైన్స్‌డేకు వారం ముందు వివాహబంధంతో ఒక్కటి చేసింది. రామ్మోహన్‌ తరపువారి నుంచి అభ్యంతరాల్లేకపోయినా, శ్రీదేవి తరపు నుంచి వెంటనే గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో వనస్థలిపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం నెలరోజులకు శ్రీదేవి కుటుంబీకుల ఆమోదంతో జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో దావత్‌తో రెండు కుటుంబాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. ఉద్యమకాలంలో పోలీసు కేసులు, జైళ్లకు వెళ్లడం వంటివి చూసినప్పటికీ వెరవకుండా శ్రీదేవి స్థిరనిర్ణయంతో ఉండటం తనకెంతో నచ్చాయంటాడు రామ్మోహన్‌. ముందుండి పదుగురిని నడిపించడంలో ఆయన నాయకత్వం ఆకర్షించాయన్నారు శ్రీదేవి.

ఆమె క్రియాశీల రాజకీయాల్లో లేనప్పటికీ, నైతిక అండదండలు, మద్దతు పుష్కలంగా ఉండేవి. వాటివల్లే ముందుకు వెళ్లగలిగానంటున్నారు రామ్మోహన్‌. మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా రామ్మోహన్‌కు చేదోడువాదోడుగా ఉంటూ ప్రచారంలోనూ వెన్నంటి నిలిచారు శ్రీదేవి.   వరంగల్‌ జిల్లాకు చెందిన రామ్మోహన్‌ , ఇక్కడి అమీర్‌పేటకు చెందిన శ్రీదేవి ఊర్లు వేరైనా , కులాలు వేరైనా ఒక్కటిగా నిలిచారు. వీరికిద్దరు కూతుర్లు. కూజిత నాలుగో తరగతి, ఉషశ్రీ యూకేజీ చదువుతున్నారు. ఆదర్శవంతమైన మార్గంలో నడిచి నలుగురికి ఆదర్శంగా నిలిచారీ జంట. ఉద్యమంలో రామ్మోహన్‌ క్రియాశీల పాత్రను గుర్తించిన సీఎం కేసీఆర్‌..కాప్రా డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలిచాక మేయర్‌గా అవకాశం కల్పించడం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement