కాలనీవాసులకు చేతులు జోడించి నమస్కరిస్తున్న యూనియన్ నాయకులు
- పోలేపల్లి ఫోర్త్‌క్లాస్ కాలనీలో హైడ్రామా
- కాలనీ పక్కనే శవ దహనంపై స్థానికుల ఆందోళన
- మరోసారి ఇలా జరగనీయమన్న యూనియన్ నేతలు
ఖమ్మం రూరల్:
పోలేపల్లి నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీలో బుధవారం సాయంత్రం హైడ్రామా చోటుచేసుకుంది. రాజీవ్‌గృహకల్పకు చెందిన రిటైర్డ్ ఫోర్త్‌క్లాస్ ఉద్యోగి భిక్షపతి మృతదేహాన్ని కాలనీ చెంతనే ఉన్న మున్నేరు ఒడ్డున పూడ్చివేసేందుకు బంధువులు, యూనియన్ నాయకులు సిద్ధమయ్యారు. జనావాసాల మధ్య ఎట్టి పరిస్థితిలో శవాన్ని పూడ్చనీయమని కాలనీ వాసులు ఆందోళనకు పూనుకున్నారు. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో ఎస్సై వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది అక్కడికి వచ్చారు. యూనియన్ నాయకులు, కాలనీ వాసులతో చర్చించారు. నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోడి లింగయ్య జోక్యం చేసుకొని..‘ ఇప్పటికే మృతదేహాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాం. ఈ శవం ఒక్కదాన్ని మాత్రమే ఇక్కడ ఖననం చేస్తాం. మరోమారు ఇలాంటి ఘటనలకు తావివ్వం. మీకు కావాలంటే హామీ పత్రం ఇస్తాను.’ అని స్థానికులకు నచ్చజెప్పడంతో శాంతించారు. హామీపత్రం ఇస్తేనే ఖననానికి అంగీకరిస్తామనడంతో గురువారం రాసిస్తానని అంగీకరించారు.