మర్రిగూడ (నల్లగొండ) : తనకు ఎస్పీ ఉద్యోగం వచ్చిందంటూ అసత్య ప్రచారం చేసుకుంటున్న ఓ యువతికి మంగళవారం పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఘటన వివరాల్లోకి వెళ్తే... నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర భీమనపల్లికి చెందిన సిలివేరు పార్వతమ్మ(19) డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేసింది.
అయితే తనకు పెద్ద ఉద్యోగం వచ్చిందని, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ) గా సెలెక్ట్ అయ్యానని కొన్ని రోజులుగా గ్రామంలో చెప్పుకుంటోంది. అలా ఈ విషయం ఆనోటా ఈనోటా ప్రచారమై పోలీసులకు చేరింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే పార్వతమ్మ చెప్పేదంతా అవాస్తవమని తేలటంతో పోలీసులు ఆమెపై సెక్షన్ 170 ప్రకారం కేసు నమోదు చేశారు. పార్వతమ్మను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపినట్లు నాంపల్లి సీఐ ఇ. వెంకట్‌రెడ్డి తెలిపారు.