
'టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు రుణపడి ఉంటా'
ఇది సామాన్య కార్యకర్తల విజయం
వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తా: పసునూరి దయాకర్
వరంగల్: తన గెలుపు.. సామాన్య కార్యకర్తల విజయంగా భావిస్తున్నానని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గెలిపించిన టీఆర్‌ఎస్ పార్టీకి, పార్టీ అధినేత సీఎం చంద్రశేఖర్‌రావుకు రుణపడి ఉంటానన్నారు. తెలంగాణ ఉద్యమంలో మమేకమై పార్టీ పటిష్టత కోసం పనిచేసిన తనకు పార్టీ అధినేత గుర్తింపు ఇవ్వడమే కాకుండా, ప్రచారం చేసేందుకు పార్టీ నిధులు అందించారని, పేదలకు కేసీఆర్ అండగా ఉన్నడన్న దానికి ఇది నిదర్శనమమని దయాకర్ అన్నారు.
జిల్లా చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించి దేశంలోనే గుర్తింపు తెచ్చిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, వరంగల్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలందరి సహకారంతో జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని చెప్పారు. తన గెలుపు కోసం శ్రమించిన టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలకు ఆయన కృజ్ఞతలు తెలిపారు.