warangal by elections
-
'ఓటర్లు విపక్షాల చెంప చెల్లుమనిపించారు'
-ప్రతిపక్షాల విమర్శలకు ఈ ఫలితాలే సమాధానం -ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ : వరంగల్ జిల్లా ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారని, ఇది తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఓటర్లు విపక్షాల చెంప చెల్లుమనిపించారని చెప్పారు. హన్మకొండలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన ఎంపీలు బోయినిపల్లి వినోద్‌కుమార్, ఆజ్మీర సీతారాం నాయక్, గుండు సుధారాణి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు దాస్యం వినయబాస్కర్, ఆరూరి రమేష్, బానోత్ శంకర్‌నాయక్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ప్రతిపక్షాల నాయకులు దిగజారుడు, వ్యక్తిగత విమర్శలు చేశారని, ఆ విమర్శలకు ఈ ఫలితమే సమాధానమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ చెంప చెల్లుమనేలా తీర్పు ఇవ్వాలని పదే పదే వారు మాట్లాడారని, అయితే ప్రజలు ప్రతిపక్షాలకు డిపాజిట్ దక్కకుండా వారి చెంపచెల్లుమనేలా తీర్పు ఇచ్చారని చెప్పారు. 17 మాసాల ప్రభుత్వ పనితీరు, అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు సంతృప్తి చెందిన ఓటర్లు ఈ విజయాన్ని అందించారన్నారు. దేశ వ్యాప్తంగా ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు అయినా వస్తాయని, ఈ ఎన్నికలో ప్రతిపక్షాలతో పాటు ఎవరికీ డిపాజిట్ రాకుండా ఓడించారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చవకబారు విమర్శలు చేశారని దుయ్యబట్టారు. ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రభుత్వంపై, పార్టీపై మరింత బాధ్యత పెంచిందన్నారు. ఈ నెల 26 నుంచి జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లో పత్తి రైతుల సమస్యలపై మాట్లాడాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలకు సూచించారని, ఎంపీలు పార్లమెంట్లో గళమెత్తుతారని చెప్పారు. -
'టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు రుణపడి ఉంటా'
ఇది సామాన్య కార్యకర్తల విజయం వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తా: పసునూరి దయాకర్ వరంగల్: తన గెలుపు.. సామాన్య కార్యకర్తల విజయంగా భావిస్తున్నానని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గెలిపించిన టీఆర్ఎస్ పార్టీకి, పార్టీ అధినేత సీఎం చంద్రశేఖర్‌రావుకు రుణపడి ఉంటానన్నారు. తెలంగాణ ఉద్యమంలో మమేకమై పార్టీ పటిష్టత కోసం పనిచేసిన తనకు పార్టీ అధినేత గుర్తింపు ఇవ్వడమే కాకుండా, ప్రచారం చేసేందుకు పార్టీ నిధులు అందించారని, పేదలకు కేసీఆర్ అండగా ఉన్నడన్న దానికి ఇది నిదర్శనమమని దయాకర్ అన్నారు. జిల్లా చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించి దేశంలోనే గుర్తింపు తెచ్చిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, వరంగల్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలందరి సహకారంతో జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని చెప్పారు. తన గెలుపు కోసం శ్రమించిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు ఆయన కృజ్ఞతలు తెలిపారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న హిజ్రాలు
-
ఓటు హక్కు వినియోగించుకున్న కడియం శ్రీహరి
-
'కేసీఆర్‌కు ఉప ఎన్నికల భయం పట్టుకుంది'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఉప ఎన్నికల భయం పట్టుకుందని టీవైఎస్ఆర్సీపీ నేతలు శివకుమార్, విజయ్ చందర్ వ్యాఖ్యానించారు. నగరంలోని వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు సమావేశమయ్యారు. వరంగల్ ఉప ఎన్నికలకు సంబంధించి రూపొందించిన పాటల సీడిని ఈ సందర్భంగా వారు ఆవిష్కరించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా రైతుల ఆత్మహత్యలు ఆగలేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ చరిత్ర సృష్టించబోతోందని ఆ పార్టీ నేతలు శివకుమార్, విజయ్ చందర్ ధీమా వ్యక్తం చేశారు. -
కేసీఆర్ పై ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వరంగల్ ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని టీకాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం నాడు టీకాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ.. పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు అభ్యర్థుల వయసును సడలిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని టీకాంగ్రెస్ నేతలు భన్వర్‌లాల్‌ను కోరినట్లు తెలుస్తోంది. -
బదనాం కాకుండా టీటీడీపీ తంటాలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉపఎన్నికపై తెలంగాణ టీడీపీ నాయకత్వం తర్జన భర్జన పడుతోంది. బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కమలం నుంచి బరిలోకి దిగిన ఎన్ఆర్ఐ డాక్టర్ దేవయ్య విజయం కోసం తెలంగాణ తమ్ముళ్లు కసర త్తు చేస్తున్నారు. తమ వైపు నుంచి ఎలాంటి పొరపాటు లేకుండా అభ్యర్థి గెలుపు కోసం శ్రమించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన సూచన మేరకు టీ టీడీపీ నాయకులు వ్యూహరచనలో మునిగిపోయారు. అయితే, గత ఎన్నికల అనుభవం చేదుగా ఉండడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరకాల, పాలకుర్తిలో టీడీపీ గెలిచింది. కానీ, వరంగల్ లోక్‌సభ స్థానంలో ఉమ్మడి అభ్యర్థి (బీజేపీ) మూడో స్థానంలో నిలిచినా, కనీసం డిపాజిట్ దక్కలేదు. టీడీపీ శ్రద్ధపెట్టకపోవడంతోనే ఇలా జరిగిందని అప్పుడు బీజేపీ మండిపడింది. ఈనేపథ్యంలో మిత్రపక్షం నుంచి మాట రాకుండా చూసుకుంటున్నామని టీడీపీ నేత ఒకరు చెప్పారు. ఉప ఎన్నిక కోసమే సర్వసభ్య భేటీ! ప్రధానంగా ఉప ఎన్నికలపై చర్చించేందుకే శనివారం టీటీడీపీ రాష్ట్ర కమిటీ సర్వసభ సమావేశాన్ని ఏర్పాటు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త కమిటీ ఏర్పాటయ్యాక ఇప్పటిదాకా ఎలాంటి సమావేశం నిర్వహించలేదు. దీంతో కొత్త కమిటీతో భేటీ అయ్యేందుకు, అదే సమయంలో ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సమావేశం జరుపుతున్నారని అంటున్నారు. -
మరిపెడ చెక్‌పోస్ట్ వద్ద రూ. 2 లక్షలు పట్టివేత
వరంగల్: వరంగల్ జిల్లా మరిపెడ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 2 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం కారును పోలీసులు పోలీస్ స్టేషన్‌కి తరలించి... సీజ్ చేశారు. అనంతరం డ్రైవర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మర చేశారు. ఆ క్రమంలో గత వారం రోజుల వ్యవధిలో పలుప్రాంతాల్లో భారీ మొత్తంలో నగదును అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. -
‘ఉప’ భాష్యాలు నిరర్థకం
డేట్లైన్ హైదరాబాద్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ రెంటికీ పోటీచేసి గెలిచిన చంద్రశేఖర్‌రావు శాసనసభ స్థానాన్ని ఉంచుకుని మెదక్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చెయ్యడంతో జరిగిన ఉప ఎన్నికకూ రేపు వరంగల్‌లో కడియం రాజీనామా వల్ల ఏర్పడిన ఖాళీకి జరగబోయే ఎన్నికకూ తేడా ఉంది. ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధులు రాజీనామాలు చెయ్యడం, మళ్లీ పోటీ చెయ్యడం టీఆర్ఎస్లో సర్వసాధారణం. ఇట్లా తరచూ ఎన్నికలు జరగడం వల్ల ప్రజాధనం మంచినీళ్ల ప్రాయంగా వృథా అవుతుంది. కానీ ప్రజాస్వామ్యంలో ఇటువంటివి తప్పనిసరి. తెలంగాణ రాష్ర్టంలోనే చరిత్రాత్మకమైన వరంగల్ లోక్‌సభ నియోజక వర్గానికి ఈ నెలలో జరగనున్న ఉప ఎన్నిక టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుపైన రెఫరెండం అవుతుందా? నూతన రాష్ర్టం ఏర్పడిన తరువాత, వెనువెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పడినాక, పదిహేడు నెలలకు ఈ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అవసరమైంది. పదిహేడు నెలల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును నిర్ణయించేస్తారా, తీర్పులు చెప్పేస్తారా అని టీఆర్ఎస్ వాళ్లు అంటుంటే; ఇది కచ్చితంగా రెఫరెండమే అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ మాటలు అంటున్న పార్టీలలో పక్క రాష్ర్టంలో ఇంతేకాలంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలు కూడా ఉన్నాయి. పదేళ్లపాటు కేంద్రంలో అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కూడా ఇది రెఫరెండంగానే భావించాలని అంటున్నాయి. పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో ఒక ఉప ఎన్నిక జరిగితే దాని ఫలితాన్ని నిజంగానే ఆ ప్రభుత్వ పని తీరు మీద ప్రజల తీర్పుగా భావించాలా? అదెట్లా సహేతుకం అవుతుంది? వరంగల్ ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరు మీద రెఫరెండం అంటున్న మూడు ప్రధాన పక్షాలూ గతంలో ఎక్కడో ఒకచోట అధికారంలో ఉన్నవే. అట్లా ఉన్ననాడు ఉప ఎన్నికలను ఎదుర్కొన్నవే. ఆ ఉప ఎన్నికలలో ఓడి పోయినవే. ఆనాడు ప్రజా తీర్పును శిరసావహించి ఆ పార్టీలు అధికారంలో నుండి తప్పుకున్నాయా? ఎప్పటి మాటో ఎందుకు? 2014 సార్వత్రిక ఎన్నికలలో మంచి విజయం సాధించి కేంద్రంలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ ఆ తరవాత స్వల్పకాలంలోనే జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో చిత్తు చిత్తుగా ఓడింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా నిన్నగాక మొన్ననే బీజేపీ ఓటమి చవిచూసింది. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని దిగిపొమ్మందామా? ఇక్కడ అదే కూటమిలో భాగస్వాములయిన టీడీపీ, బీజేపీలు వరంగల్ ఉపఎన్నిక టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు మీద రెఫరెండం అని యుగళగీతం ఆలపిస్తున్నాయి. అదెలా? ప్రజాతీర్పులో పరమార్థం ఐదు సంవత్సరాలు మా ప్రతినిధులుగా పరిపాలన చేయమంటూ ప్రజలు ఇచ్చిన తీర్పు ఫలితమే ఈ ప్రభుత్వం. దాన్ని అందరూ శిరసావహించాలి. అంతేకాదు, మధ్యలో దాన్ని పడదోసే ప్రయత్నం కూడా అప్రజాస్వా మికమే. అయితే ఇప్పుడు వరంగల్ బరిలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ, ఆ పార్టీల అధి నాయకులందరూ అధికార టీఆర్‌ఎస్‌తోసహా ఈ మౌలిక ప్రజా స్వామ్య సూత్రాన్ని ఎన్నడూ గౌరవించిన వాళ్లు కారు. 1994లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్.టి.రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి అత్యద్భుత మెజా రిటీ ఇచ్చి గెలిపిస్తే కొన్ని మాసాల్లోనే ఆయన ప్రభుత్వాన్ని అప్రజాస్వా మికంగా కూల్చిన చంద్రబాబునాయుడు బృందంలో ఇప్పటి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుది కూడా ప్రధాన పాత్ర. ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి అయితే ప్రత్యక్ష భాగస్వామి. 2014 ఎన్నికల్లో వరం గల్ నుండి ఎన్నికయి పార్లమెంట్‌కు వెళ్లిన కడియం శ్రీహరి రాజీనామా చేసి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టినందునే ఈ ఉప ఎన్నిక అవసరం అయింది. ఎన్టీఆర్‌ను గద్దె దించేందుకు జరిగిన మొత్తం వ్యవహారానికి నాంది శ్రీహరి నుండే జరిగింది. ఇక ఎన్టీఆర్‌ను అప్రజాస్వామికంగా దింపేసిన చంద్ర బాబుతో అదే ఐదేళ్ల కాలంలో బీజేపీ దోస్తీ చేసింది. కలసి ఎన్నికలకు వెళ్లింది. అధికారంలో భాగస్వాములు కూడా అయ్యారు. ఇక నా ప్రభుత్వాన్ని అప్రజా స్వామికంగా కూలదోశారు సాయానికి రండి అని ఎన్టీఆర్ మొరపెట్టుకుంటే పట్టించుకోని ఢిల్లీలో ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. అందుకే వీళ్లెవరూ ఆ మౌలిక ప్రజాస్వామ్య సూత్రాన్ని గౌరవించరు అని చెప్పడం. ప్రజాస్వామ్యంలో ఇది అనివార్యం ఇక ప్రస్త్తుతానికి వస్తే వరంగల్ పార్లమెంట్‌కు బహుముఖ పోటీ జరగ బోతున్నది. అధికార టీఆర్ఎస్, బీజేపీ-టీడీపీ కూటమి, కాంగ్రెస్, వామ పక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెడుతున్నాయి. ఉస్మా నియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తరఫున కూడా ఒక అభ్యర్ధిని పోటీలో నిలబెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ రెంటికీ పోటీ చేసి గెలిచిన చంద్రశేఖర్‌రావు శాసనసభ స్థానాన్ని మాత్రం ఉంచుకుని మెదక్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చెయ్యడంతో జరిగిన ఉప ఎన్నికకూ రేపు వరంగల్‌లో కడియం రాజీనామా వల్ల ఏర్పడిన ఖాళీకి జరగబోయే ఎన్నికకూ చాలా తేడా ఉంది. ప్రజలు ఎన్నుకున్న పద వులకు రాజీనామాలు చెయ్యడం, మళ్లీ పోటీ చెయ్యడం టీఆర్ఎస్కు మంచి నీళ్ల ప్రాయం. ఇట్లా తరచూ ఎన్నికలు జరగడం వల్ల ప్రజాధనం కూడా అంతే మంచినీళ్ల ప్రాయంగా వృథా అవుతుంది. కానీ ప్రజాస్వామ్యంలో ఇటు వంటివి తప్పని సరి. మెదక్ ఉప ఎన్నిక జరిగే నాటికి కొత్త రాష్ర్టం, కొత్త ప్రభుత్వం కాబట్టి ప్రజావ్యతిరేకత ఉండే అవకాశం లేదు. ప్రతిపక్షాలకు ప్రభుత్వం మీద దాడి చేసే అవకాశమూ లేదు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక అట్లా కాదు. ఏడాదిన్నర కాలంలో అధికార పార్టీ అంగీకరించక పోయినా ఏ ప్రభుత్వం మీదనైనా కొంత ప్రజావ్యతిరేకత ఏర్పడటానికి ఈ గడువు చాలు. టీఆర్ఎస్ ఎన్నికల్లో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసి, ఊపిరి సలపని విధంగా వాగ్దానాలు చేసి, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కొంచెం ఎక్కువగానే ఉంది. అధికార పార్టీ వ్యతిరేక ఓటు బహుముఖ పోటీ కారణంగా చీలిపోతుంది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం తిరిగి టీఆర్ఎస్ వశం కావడం తప్పదన్నది స్పష్టం. అధికారం ఉంది, పైగా ఒక్కో శాసనసభా విభాగానికి ఒక మంత్రిని ఇంచార్జ్‌గా నియమించారు, ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారం చేయ నున్నారు. అభ్యర్ధి స్థానికుడు కావడం టీఆర్ఎస్కు కలిసొచ్చే అంశాలు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది టీఆర్ఎస్ గెలుపు గురించి కాదు, ఎంత ఆధిక్యతతో గెలుస్త్తుంది అన్న అంశం. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి కడియం శ్రీహరి కొన్ని లక్షల ఓట్ల మెజారిటీతో గెలు పొందారు. ఆయనకు గతంలో పరిపాలనా అనుభవం ఉండబట్టి, సమ ర్థ్ధుడుగా పేరు ఉంది కాబట్టి కదా ముఖ్యమంత్రి ఆయనను పార్లమెంట్‌కు రాజీనామా చేయించి మరీ శాసన మండలి సభ్యుడిని చేసి ముఖ్యమైన మంత్రిత్వశాఖతో బాటు, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు. నిజం గానే కడియం శ్రీహరి సీనియర్ మంత్రి, అనుభవజ్ఞుడు. ఆయనకు ముఖ్య మంత్రి ఇచ్చింది విద్యాశాఖ. మంచి ఫలితాలు సాధిస్తాడనే విశ్వాసంతోనే కదా ముఖ్యమంత్రి ఆయనకు ఆ పదవి ఇచ్చింది! ఆ ఫలితాలు నిజంగానే సాధించి ఉంటే 2014 ఎన్నికలలో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలిచినా శ్రీహరి సాధించిన మెజారిటీ కంటే అధికమైన మెజారిటీ రేపు జరగబోయే ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించాలి. కోరి తెచ్చిపెట్టుకున్నందుకు శ్రీహరి విద్యాశాఖలో సాధిస్తారని ఆశించిన ఫలితాలు సాధించినట్టు అవు తుంది. కానీ అధికార పార్టీ పెద్దలకు, ముఖ్యంగా స్వయంగా కడియం శ్రీహరికే ఆ విశ్వాసం లేనట్టుంది. ఆయనే ఒక సభలో వరంగల్ ఉప ఎన్నిక ఫలితం ప్రభుత్వం పని తీరు మీద రెఫరెండం కాబోదు అన్నారు. అంటే గెలుస్తామనే నమ్మకం లేదన్న మాట అని ప్రతిపక్షాలు వెంటనే వెంటబడ్డాయి. ప్రజల్లోకి సంకేతాలు వేరేగా వెళ్లాయి. రెఫరెండం అనే ప్రతిపక్షాలు పన్నిన వలలో శ్రీహరి పడిపోయారని గ్రహించిన అధికార పక్షం నాలుక కరుచుకుని, నష్ట నివారణ చర్యలు తీసుకునే చర్యల్లో భాగంగానే ముఖ్యమంత్రి కుమా రుడు కె.టి.రామారావుతో కచ్చితంగా ఇది రెఫరెండమే అని అదే వరంగల్‌లో మరో సభలో చెప్పించింది. సరిదిద్దుకునే అవకాశం వస్తుంది ఐదేళ్ల పాటు సక్రమ పాలన అందించండి అని ప్రజలు తీర్పు ఇచ్చాక మధ్యలో వచ్చే ఏ ఉప ఎన్నిక ఫలితం అయినా ఆ ప్రభుత్వం మీద దాని పాలన మీద రెఫరెండం కాదు. అయితే ఉప ఎన్నికలన్నీ ప్రభుత్వం ప్రజల్లో తమ పట్ల ఉన్న ఆదరణను కొలుచుకునే ఒక సాధనంగా భావించినప్పుడు మాత్రమే అవసరమయితే తమ విధానాలను మార్చుకోడానికి మంచి అవకాశంగా మలుచుకునే వీలుంటుంది. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికను అట్లాగే చూడాలి. ఒక సీటు పెరిగినా తగ్గినా పార్లమెంట్లో తెలంగాణ రాష్ర్ట సమితి అదనంగా చేసేదేమీ లేదు, చెయ్యలేక పోయేదేమీ లేదు. దేవులపల్లి అమర్, datelinehyderabad@gmail.com -
'కేసీఆర్ స్వార్థం వల్లే ఉప ఎన్నిక'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ స్వార్థపూరిత నిర్ణయంతోనే వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వరంగల్ పట్టణంలో ఆదివారం తెలంగాణ వైస్ఆర్సీసీ నేతలు సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థి ఎంపికపై, ఎన్నిక వ్యూహాలపై పార్టీ నేతలు చర్చించారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని పొంగులేటి అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ బతికే ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లాకు చెందిన పార్టీ నేతలు హాజరయ్యారు. -
'నా ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారు'
- వామపక్షాల అభ్యర్థి వినోద్‌కుమార్ పరకాల(వరంగల్): వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో వామపక్షాల అభ్యర్థిగా బరిలో దిగిన తాను ఎవరెవరితో మాట్లాడుతున్నానో తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ ఆరోపించారు. వరంగల్ జిల్లా పరకాలలో శనివారం జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని కావడంతో తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్నారు. చిన్నతనంలోనే తండ్రి మరణించగా తన తల్లి కూలీకి వెళ్తూ కుటుంబాన్ని పోషించిందని.. పశువుల కాపరి నుంచి ప్రొఫెసర్ స్థాయికి ఆపై ప్రిన్సిపాల్ కాగలిగానని తెలిపారు. ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్న మిగతా పార్టీల అభ్యర్థులకు వేల కోట్ల ఆస్తులు ఉన్నా... తనపై మాత్రం తెలంగాణ ఉద్యమ సమయం నాటి వందల కేసులు ఉన్నాయంటూ వినోద్‌కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. -
తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ
-
పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ భవన్లో గురువారం పార్టీ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తదితరులు హాజరయ్యారు.