‘ఉప’ భాష్యాలు నిరర్థకం | devulapalli amar article on warangal by elections | Sakshi
Sakshi News home page

‘ఉప’ భాష్యాలు నిరర్థకం

Published Wed, Nov 4 2015 1:31 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

‘ఉప’ భాష్యాలు నిరర్థకం - Sakshi

‘ఉప’ భాష్యాలు నిరర్థకం

డేట్‌లైన్ హైదరాబాద్
2014 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ రెంటికీ పోటీచేసి గెలిచిన చంద్రశేఖర్‌రావు శాసనసభ స్థానాన్ని ఉంచుకుని మెదక్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చెయ్యడంతో జరిగిన ఉప ఎన్నికకూ రేపు వరంగల్‌లో కడియం రాజీనామా వల్ల ఏర్పడిన ఖాళీకి జరగబోయే ఎన్నికకూ తేడా ఉంది. ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధులు రాజీనామాలు చెయ్యడం, మళ్లీ పోటీ చెయ్యడం టీఆర్‌ఎస్‌లో సర్వసాధారణం. ఇట్లా తరచూ ఎన్నికలు జరగడం వల్ల ప్రజాధనం మంచినీళ్ల ప్రాయంగా వృథా అవుతుంది. కానీ ప్రజాస్వామ్యంలో ఇటువంటివి తప్పనిసరి.
 
తెలంగాణ రాష్ర్టంలోనే చరిత్రాత్మకమైన వరంగల్ లోక్‌సభ నియోజక వర్గానికి ఈ నెలలో జరగనున్న ఉప ఎన్నిక టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనితీరుపైన రెఫరెండం అవుతుందా? నూతన రాష్ర్టం ఏర్పడిన తరువాత, వెనువెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పడినాక, పదిహేడు నెలలకు ఈ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అవసరమైంది. పదిహేడు నెలల్లోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరును నిర్ణయించేస్తారా, తీర్పులు చెప్పేస్తారా అని టీఆర్‌ఎస్ వాళ్లు అంటుంటే; ఇది కచ్చితంగా రెఫరెండమే అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ మాటలు అంటున్న పార్టీలలో పక్క రాష్ర్టంలో ఇంతేకాలంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలు కూడా ఉన్నాయి. పదేళ్లపాటు కేంద్రంలో అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కూడా ఇది రెఫరెండంగానే భావించాలని అంటున్నాయి.

పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో ఒక ఉప ఎన్నిక జరిగితే దాని ఫలితాన్ని నిజంగానే ఆ ప్రభుత్వ పని తీరు మీద ప్రజల తీర్పుగా భావించాలా? అదెట్లా సహేతుకం అవుతుంది? వరంగల్ ఉప ఎన్నిక ఫలితం టీఆర్‌ఎస్ ప్రభుత్వ పని తీరు మీద రెఫరెండం అంటున్న మూడు ప్రధాన పక్షాలూ గతంలో ఎక్కడో ఒకచోట అధికారంలో ఉన్నవే. అట్లా ఉన్ననాడు ఉప ఎన్నికలను ఎదుర్కొన్నవే. ఆ ఉప ఎన్నికలలో ఓడి పోయినవే. ఆనాడు ప్రజా తీర్పును శిరసావహించి ఆ పార్టీలు అధికారంలో నుండి తప్పుకున్నాయా? ఎప్పటి మాటో ఎందుకు? 2014 సార్వత్రిక ఎన్నికలలో మంచి విజయం సాధించి కేంద్రంలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ ఆ తరవాత స్వల్పకాలంలోనే జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో చిత్తు చిత్తుగా ఓడింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా నిన్నగాక మొన్ననే బీజేపీ ఓటమి చవిచూసింది. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని దిగిపొమ్మందామా? ఇక్కడ అదే కూటమిలో భాగస్వాములయిన టీడీపీ, బీజేపీలు వరంగల్ ఉపఎన్నిక టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనితీరు మీద రెఫరెండం అని యుగళగీతం ఆలపిస్తున్నాయి. అదెలా?

ప్రజాతీర్పులో పరమార్థం
ఐదు సంవత్సరాలు మా ప్రతినిధులుగా పరిపాలన చేయమంటూ ప్రజలు ఇచ్చిన తీర్పు ఫలితమే ఈ ప్రభుత్వం. దాన్ని అందరూ శిరసావహించాలి. అంతేకాదు, మధ్యలో దాన్ని పడదోసే ప్రయత్నం కూడా అప్రజాస్వా మికమే. అయితే ఇప్పుడు వరంగల్ బరిలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ, ఆ పార్టీల అధి నాయకులందరూ అధికార టీఆర్‌ఎస్‌తోసహా ఈ మౌలిక ప్రజా స్వామ్య సూత్రాన్ని ఎన్నడూ గౌరవించిన వాళ్లు కారు. 1994లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్.టి.రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి అత్యద్భుత మెజా రిటీ ఇచ్చి గెలిపిస్తే కొన్ని మాసాల్లోనే ఆయన ప్రభుత్వాన్ని అప్రజాస్వా మికంగా కూల్చిన చంద్రబాబునాయుడు బృందంలో ఇప్పటి టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుది కూడా ప్రధాన పాత్ర. ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి అయితే ప్రత్యక్ష భాగస్వామి.

2014 ఎన్నికల్లో వరం గల్ నుండి ఎన్నికయి పార్లమెంట్‌కు వెళ్లిన కడియం శ్రీహరి రాజీనామా చేసి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టినందునే ఈ ఉప ఎన్నిక అవసరం అయింది. ఎన్టీఆర్‌ను గద్దె దించేందుకు జరిగిన మొత్తం వ్యవహారానికి నాంది శ్రీహరి నుండే జరిగింది. ఇక ఎన్టీఆర్‌ను అప్రజాస్వామికంగా దింపేసిన చంద్ర బాబుతో అదే ఐదేళ్ల కాలంలో బీజేపీ దోస్తీ చేసింది. కలసి ఎన్నికలకు వెళ్లింది. అధికారంలో భాగస్వాములు కూడా అయ్యారు. ఇక నా ప్రభుత్వాన్ని అప్రజా స్వామికంగా కూలదోశారు సాయానికి రండి అని ఎన్టీఆర్ మొరపెట్టుకుంటే పట్టించుకోని ఢిల్లీలో ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. అందుకే వీళ్లెవరూ ఆ మౌలిక ప్రజాస్వామ్య సూత్రాన్ని గౌరవించరు అని చెప్పడం.

ప్రజాస్వామ్యంలో ఇది అనివార్యం
ఇక ప్రస్త్తుతానికి వస్తే వరంగల్ పార్లమెంట్‌కు బహుముఖ పోటీ జరగ బోతున్నది. అధికార టీఆర్‌ఎస్, బీజేపీ-టీడీపీ కూటమి, కాంగ్రెస్, వామ పక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెడుతున్నాయి. ఉస్మా నియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తరఫున కూడా ఒక అభ్యర్ధిని పోటీలో నిలబెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ రెంటికీ పోటీ చేసి గెలిచిన చంద్రశేఖర్‌రావు శాసనసభ స్థానాన్ని మాత్రం ఉంచుకుని మెదక్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చెయ్యడంతో జరిగిన ఉప ఎన్నికకూ రేపు వరంగల్‌లో కడియం రాజీనామా వల్ల ఏర్పడిన ఖాళీకి జరగబోయే ఎన్నికకూ చాలా తేడా ఉంది. ప్రజలు ఎన్నుకున్న పద వులకు రాజీనామాలు చెయ్యడం, మళ్లీ పోటీ చెయ్యడం టీఆర్‌ఎస్‌కు మంచి నీళ్ల ప్రాయం. ఇట్లా తరచూ ఎన్నికలు జరగడం వల్ల ప్రజాధనం కూడా అంతే మంచినీళ్ల ప్రాయంగా వృథా అవుతుంది. కానీ ప్రజాస్వామ్యంలో ఇటు వంటివి తప్పని సరి.

మెదక్ ఉప ఎన్నిక జరిగే నాటికి కొత్త రాష్ర్టం, కొత్త ప్రభుత్వం కాబట్టి ప్రజావ్యతిరేకత ఉండే అవకాశం లేదు. ప్రతిపక్షాలకు ప్రభుత్వం మీద దాడి చేసే అవకాశమూ లేదు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక అట్లా కాదు. ఏడాదిన్నర కాలంలో అధికార పార్టీ అంగీకరించక పోయినా ఏ ప్రభుత్వం మీదనైనా కొంత ప్రజావ్యతిరేకత ఏర్పడటానికి ఈ గడువు చాలు. టీఆర్‌ఎస్ ఎన్నికల్లో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసి, ఊపిరి సలపని విధంగా వాగ్దానాలు చేసి, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కొంచెం ఎక్కువగానే ఉంది. అధికార పార్టీ వ్యతిరేక ఓటు బహుముఖ పోటీ కారణంగా చీలిపోతుంది.

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం తిరిగి టీఆర్‌ఎస్ వశం కావడం తప్పదన్నది స్పష్టం. అధికారం ఉంది, పైగా ఒక్కో శాసనసభా విభాగానికి ఒక మంత్రిని ఇంచార్జ్‌గా నియమించారు, ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారం చేయ నున్నారు. అభ్యర్ధి స్థానికుడు కావడం టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశాలు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది టీఆర్‌ఎస్ గెలుపు గురించి కాదు, ఎంత ఆధిక్యతతో గెలుస్త్తుంది అన్న అంశం. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి కడియం శ్రీహరి కొన్ని లక్షల ఓట్ల మెజారిటీతో గెలు పొందారు. ఆయనకు గతంలో పరిపాలనా అనుభవం ఉండబట్టి, సమ ర్థ్ధుడుగా పేరు ఉంది కాబట్టి కదా ముఖ్యమంత్రి ఆయనను పార్లమెంట్‌కు రాజీనామా చేయించి మరీ శాసన మండలి సభ్యుడిని చేసి ముఖ్యమైన మంత్రిత్వశాఖతో బాటు, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు. నిజం గానే కడియం శ్రీహరి సీనియర్ మంత్రి, అనుభవజ్ఞుడు. ఆయనకు ముఖ్య మంత్రి ఇచ్చింది విద్యాశాఖ. మంచి ఫలితాలు సాధిస్తాడనే విశ్వాసంతోనే కదా ముఖ్యమంత్రి ఆయనకు ఆ పదవి ఇచ్చింది! ఆ ఫలితాలు నిజంగానే సాధించి ఉంటే 2014 ఎన్నికలలో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలిచినా శ్రీహరి సాధించిన మెజారిటీ కంటే అధికమైన మెజారిటీ రేపు జరగబోయే ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ సాధించాలి.

కోరి తెచ్చిపెట్టుకున్నందుకు శ్రీహరి విద్యాశాఖలో సాధిస్తారని ఆశించిన ఫలితాలు సాధించినట్టు అవు తుంది. కానీ అధికార పార్టీ పెద్దలకు, ముఖ్యంగా స్వయంగా కడియం శ్రీహరికే ఆ విశ్వాసం లేనట్టుంది. ఆయనే ఒక సభలో వరంగల్ ఉప ఎన్నిక ఫలితం ప్రభుత్వం పని తీరు మీద రెఫరెండం కాబోదు అన్నారు. అంటే గెలుస్తామనే నమ్మకం లేదన్న మాట అని ప్రతిపక్షాలు వెంటనే వెంటబడ్డాయి. ప్రజల్లోకి సంకేతాలు వేరేగా వెళ్లాయి. రెఫరెండం అనే ప్రతిపక్షాలు పన్నిన వలలో శ్రీహరి పడిపోయారని గ్రహించిన అధికార పక్షం నాలుక కరుచుకుని, నష్ట నివారణ చర్యలు తీసుకునే చర్యల్లో భాగంగానే ముఖ్యమంత్రి కుమా రుడు కె.టి.రామారావుతో కచ్చితంగా ఇది రెఫరెండమే అని అదే వరంగల్‌లో మరో సభలో చెప్పించింది.
 
సరిదిద్దుకునే అవకాశం వస్తుంది
ఐదేళ్ల పాటు సక్రమ పాలన అందించండి అని ప్రజలు తీర్పు ఇచ్చాక మధ్యలో వచ్చే ఏ ఉప ఎన్నిక ఫలితం అయినా ఆ ప్రభుత్వం మీద దాని పాలన మీద రెఫరెండం కాదు. అయితే ఉప ఎన్నికలన్నీ ప్రభుత్వం ప్రజల్లో తమ పట్ల ఉన్న ఆదరణను కొలుచుకునే ఒక సాధనంగా భావించినప్పుడు మాత్రమే అవసరమయితే తమ విధానాలను మార్చుకోడానికి మంచి అవకాశంగా మలుచుకునే వీలుంటుంది. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికను అట్లాగే చూడాలి. ఒక సీటు పెరిగినా తగ్గినా పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ర్ట సమితి అదనంగా చేసేదేమీ లేదు, చెయ్యలేక పోయేదేమీ లేదు.

దేవులపల్లి అమర్, datelinehyderabad@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement