
సమావేశంలో మాట్లాడుతున్న కడియం శ్రీహరి
సాక్షి, మహబూబాబాద్: బాహుబలిలాంటి కేసీఆర్‌ను ఓడించడం కాంగ్రెస్ పార్టీ తరంకాదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందే ఓటమిని అంగీకరించిందని, గెలవలేమని కోర్టుకు వెళ్లిందని విమర్శించారు. అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులకు తమ పూర్తి సహకారం అందిస్తామని అసమ్మతి నేతలైన మాజీ ఎమ్మెల్యేలు కవిత, సత్యవతి రాథోడ్ తెలిపారు.
మహబూబాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. కాగా తాను మాత్రం పాలకుర్తి బరిలో ఉన్నానని కడియం సమక్షంలో చెప్పారు. ఈ సమన్వయ సమావేశానికి అసమ్మతి నేతలు మాత్రమే హాజరుకాగా, వారి అనుచరులు కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. కార్యక్రమంలో ఎంపీ సీతారాంనాయక్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, తాజా మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.