అక్షయపాత్ర మెగా కిచెన్‌ను ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
సంగారెడ్డి రూరల్: రాష్ట్రంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ఏడాదికి రూ.550 కోట్లు ఖర్చు చేస్తోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది శివారులో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో నిర్మించిన ‘అక్షయపాత్ర’హైటెక్ మెగా కిచెన్‌ను శుక్రవారం మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు సన్నబియ్యం అందజేస్తున్నారన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల పౌష్టికాహారానికి అయ్యే ఖర్చులో 60 శాతం కేంద్రం భరించాల్సి ఉండగా, 40 శాతం మాత్రమే ఇస్తోందన్నారు. దాంతో 60 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తోందన్నారు.
కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వరంగంలో విద్యా సౌకర్యాలు అందజేస్తున్నామన్నారు. పేద విద్యార్థులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేసేందుకు అక్షయపాత్ర మెగా కిచెన్ నిర్మాణానికి నిధులు అందజేసిన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తిని మంత్రి అభినందించారు. వరంగల్‌లో సైతం అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో రూ.5కే భోజనం అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వరంగల్‌లో కూడా మెగా కిచెన్‌ను నిర్మించేందుకు సహకరించాలని ఆయన సుధామూర్తిని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్, సీడీసీ చైర్మన్ విజేందర్‌రెడ్డి, అక్షయపాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస, ఉపాధ్యక్షుడు చలపతిదాస తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment