ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అంగన్‌వాడీలు సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బడులు, కాలేజీలు వచ్చే నెల 1వ తేదీ నుంచి తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు అన్ని రకాల విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన మొదలుపెట్టాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయించారు. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్టు 30నాటికి సిద్ధం చేసే బాధ్యతను పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు అప్పగించారు. కరోనా రెండోవేవ్ ఉధృతి కారణంగా మూసివేసిన విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించే అంశంపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విస్తృ తంగా చర్చించిన అనంతరం నిర్ణయాలను ప్రకటించారు. ఈ వివరాలు కేసీఆర్ మాటల్లోనే..
అన్ని అంశాలను పరిశీలించాం..
‘‘కరోనాతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఇబ్బందుల్లో పడింది. విద్యాసంస్థలు మూతపడడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేటు స్కూళ్ల టీచర్లు, విద్యా అనుబంధ రంగాల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థల పునః ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలను, అనుసరిస్తున్న వ్యూహాలపై సమావేశంలో క్షుణ్నంగా చర్చించాం. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యశాఖ అధికారులతో చర్చించాం. గతంలో కంటే రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని వారు నివేదికలు అందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసంచారం సాధారణ స్థితికి చేరుకుంటోంది. చదవండి: తుపాను ముందు.. ప్రశాంతత!
విద్యాసంస్థలను నిరంతరాయంగా మూసివేయడంతో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతున్నదని, వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిస్థితి ఉందనే అధ్యయనాన్ని వైద్యశాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ దాకా ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో అన్నిరకాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని.. సమావేశంలో పాల్గొన్న అందరి అభిప్రాయాలను తీసుకుని.. విద్యా సంస్థలు తెరవాలని నిర్ణయం తీసుకున్నాం. అన్నిజాగ్రత్తలు తీసుకుంటూ సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను పునఃప్రారంభిస్తాం.
పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ..
గ్రామాలు, పట్టణాల్లో ఇన్నిరోజులుగా మూతపడి ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుధ్యాన్ని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చే బాధ్యతను పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు తప్పనిసరిగా తీసుకోవాలి. పాఠశాలలు, విద్యాసంస్థల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత ఆయా గ్రామాల్లోని సర్పంచులు, మున్సిపల్ చైర్మన్‌లదే. జిల్లాపరిషత్ చైర్మన్లు తమ జిల్లాల్లో, మండలాధ్యక్షులు తమ మండలాల్లో పర్యటించి.. అన్ని పాఠశాలలు పరిశుభ్రంగా, శానిటైజేషన్ చేసి ఉన్నాయో లేదో పరిశీలించాలి. జిల్లాల డీపీవోలు, జెడ్పీ సీఈవోలు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, డీపీవోలు ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్థారించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెల 30లోగా ప్రభుత్వ విద్యాసంస్థల శానిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. చదవండి: 84 పోస్టులు.. 11,133 మంది పోటీ
కోవిడ్ జాగ్రత్తలన్నీ పాటించాలి
పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు జ్వరం, ఇతర లక్షణాలు కనిపిస్తే ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి కోవిడ్ పరీక్షలు చేయించాలి. ఒకవేళ కోవిడ్ నిర్థారణ అయితే.. ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించాలి. స్కూళ్లు, కాలేజీల్లో శానిటైజేషన్, మాస్కులు వంటి కోవిడ్ నియంత్రణ చర్యలను విద్యార్థులు విధిగా పాటించేలా చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా, ఇతర జాగ్రత్తలు పాటించేలా చూసుకోవాలి.’’అని సీఎం కేసీఆర్ కోరారు. ఈ సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ సోమేశ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
- విద్యాసంస్థలను నిరంతరాయంగా మూసివేయడంతో విద్యార్థుల్లో.. ముఖ్యంగా స్కూలు పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఇది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిస్థితి ఉందనే అధ్యయనాన్ని అధికారులు మా దృష్టికి తెచ్చారు. కరోనా నియంత్రణలోకి వచ్చిందని చెప్పారు. ఆయా అంశాలను పరిశీలించి అన్నిరకాల విద్యాసంస్థలను తెరవాలని నిర్ణయం తీసుకున్నాం.
- సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు తమ పరిధిలోని స్కూళ్లు, కాలేజీలను ఆగస్టు నెలాఖరుకల్లా పరిశుభ్రం చేయించాలి. ఆవరణ, మరుగుదొడ్లను, నీటి ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్, ఇతర రసాయనాలతో శుభ్రంగా కడిగించాలి. తరగతి గదులను కూడా కడిగించి, శానిటైజేషన్ చేయించాలి.
నేడు జిల్లాల అధికారులతో మంత్రుల భేటీ
విద్యాసంస్థల పునః ప్రారంభం నేపథ్యంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం క్షేత్రస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ఇందులో పాల్గొంటారని వెల్లడించారు. విద్యాసంస్థల ప్రారంభానికి ముందు తీసుకోవాల్సిన చర్యలు, క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపాయి. వీటితోపాటు రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో కరోనా పరిస్థితి ఎలా ఉంది, స్కూళ్లకు సమీపంలోని వైద్య కేంద్రాలు, విద్యార్థులకు పరీక్షలు, ఇతర అంశాలనూ పరిశీలిస్తారని వెల్లడించాయి. సమావేశం తర్వాత స్కూళ్లు, కాలేజీల పునః ప్రారంభానికి సంబంధించిన మార్గదర్శకాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు.
చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. టీ సర్కారు కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment