datelinehyderabad
-
ఉచిత విద్యుత్.. ఒకింత ఊరట
డేట్లైన్ హైదరాబాద్ నక్సలైట్ ఉద్యమం కారణంగా వందలు వేల ఎకరాల భూస్వాములు ఇప్పుడు లేరు. చిన్న కమతాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న మాట నిజమే. అట్లా ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులు వ్యవసాయం సొంతంగా చేసుకుంటారు కాబట్టి, ఈ తరహా భూములకు ఎనిమిది వేల రూపాయల సాయం అందించడం వల్ల లబ్ధి జరుగుతుంది. కానీ పదులూ, వందల ఎకరాల భూములు ఉండి కౌలుకు ఇచ్చుకుని వేరే వ్యాపారాలు, వృత్తులు చేసుకునే వాళ్లు కూడా చాలామంది ఉంటారు. ఈ సాయం వాళ్లకు కాకుండా కౌలు చేసే వాళ్లకు కదా వెళ్లాల్సింది! కరెంట్ బిల్లులు కట్టనందుకు బావి దగ్గర నుంచి ఫ్యూజులు పీక్కొచ్చి ఎంఆర్ఓ కార్యాలయంలోనో, ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాల్లోనో పెట్టేసుకోవడం చూశాం. నీరందక కళ్ల ముందే ఎండిపోతున్న చేనును చూసి దిక్కుతోచకుండా మిగిలిన రైతు పరిస్థితి చూశాం. అలాంటి రైతు ‘ఊరన్నా ఇడిచిపెట్టి పోవాలె, ఉసురన్నా తీసుకోవాలె.’ బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసిన తెలంగాణ రైతుల దైన్యం ఎలా ఉండేదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, చంద్రబాబునాయుడి ప్రభుత్వ హయాంలో చూశాం. అప్పుడే, ‘నేను అధికారంలోకి వచ్చాక ఉచిత కరెంట్ ఇస్తాను, కరెంట్ బిల్లుల బకాయిలు రద్దు చేస్తాను’ అని అప్పటి ప్రతిపక్షనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. దీనికి చంద్రబాబు స్పందన ఏమిటో కూడా మన విన్నాం.‘ఆ కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే!’ అని ఎద్దేవా చేసిన చంద్రబాబునాయుడు తరువాత డాక్టర్ వైఎస్ తను ఇచ్చిన హామీని నెరవేర్చడం స్వయంగా చూశారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే సర్కార్ కార్యాలయాల్లో బందీలుగా ఉన్న ఫ్యూజులను పైసా అపరాధ రుసుం కట్టించుకోకుండానే రైతులకు ఎట్లా తిరిగి ఇచ్చిందీ కూడా చంద్రబాబు వీక్షించారు. హామీ మేరకు ఉచిత కరెంట్ ఎట్లా ఇచ్చిందీ, కరెంట్ బిల్లుల బకాయిలు ఎట్లా మాఫీ చేసిందీ కూడా ఆయన గమనించారు. అప్పటికి దేశంలో ఇంకా విద్యుత్ సంస్కరణలు ఊపందుకోలేదు. ఈ చర్య వల్ల రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్ధికభారం మోయవలసి వచ్చింది. అయినా రాజశేఖరరెడ్డి వెనక్కు తగ్గలేదు. ఫతేమైదాన్‌లో ప్రమాణ స్వీకారం చేశాక ఆయన మొదటి సంతకం ఉచిత విద్యుత్ సరఫరా ఫైల్ మీదనే చేశారు. ఆయన జీవించినంత కాలం అదే విధానం అమలు పరిచారు. రాజశేఖరరెడ్డి నిర్ణయం తెలుగు ప్రాంత రైతులకు గొప్ప ఊరట. ఉమ్మడి రాష్ట్రంలో నాటి తెలంగాణ రైతులకు మరీ పెద్ద ఊరట. తెలంగాణలో అత్యధికంగా, ఇరవై అయిదు లక్షల బోరు బావులు వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు. కరెంట్ అవసరం ఆనాడు తెలంగాణ రైతులకే ఎక్కువ. ఇప్పటికీ తెలంగాణలో బోరు బావుల మీద ఆధారపడి చేస్తున్న వ్యవసాయం శాతం అధికమే. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట తలపెట్టిన ప్రాజెక్టులు అన్నీ పూర్తయితే పరిస్థితి మారుతుంది. బోరు బావుల అవసరం పూర్తిగా తగ్గిపోతుంది. కాలువలు పారుతున్నప్పుడు బోర్ల అవసరం ఉండదు. పైగా భూగర్భ జలాల పరిస్థితి కూడా చాలా మెరుగు పడుతుంది. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో ఏర్పడిన నూతన ప్రభుత్వం నిరంతరాయంగా వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తూనే ఉంది. రైతులకు మంచిరోజలు 2017 డిసెంబర్ 31 రాత్రి 12 గంటల ఒక్క నిమిషం, అంటే నూతన సంవత్సరం లోకిఅడుగుపెట్టిన క్షణం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన 24 గంటల విద్యుత్ సరఫరా మీద అనుకూలంగా, ప్రతికూలంగా జరుగుతున్న చర్చలూ, విమర్శలూ, విశ్లేషణల గురించి తరువాత మాట్లాడుదాం. ఇందులో 40 శాతం విద్యుత్ సరఫరా, వ్యవసాయం కోసం ప్రభుత్వం ఉచితంగా చేస్తుంది. దానికి ప్రభుత్వం భరించాల్సిన మొత్తం సంవత్సరానికి రూ. 600 కోట్లు. ప్రాజెక్టులు పూర్తయి కాలవల్లోకి నీళ్లొస్తే ఈ వ్యయం బాగా తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రాజెక్టులకు ఎత్తిపోతల కోసం వాడే విద్యుత్ భారం ప్రభుత్వానికి తప్పదు. ఏది ఏమైనా తెలంగాణ రైతు వ్యవసాయం మీద ఆశలు పెంచుకునే మంచిరోజులు వచ్చాయని చెప్పాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. ఉచితంగా విద్యుత్ వస్తున్నది, అందునా 24 గంటల సరఫరా జరుగుతున్నది కాబట్టి వృథా అయ్యే అవకాశాలను కూడా ప్రభుత్వం గమనించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆటోమేటిక్ స్టార్టర్ల విషయంలో ప్రభుత్వం ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. వాటిని తొలగింప చెయ్యడానికి పై స్థాయి నుంచి కింది దాకా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పని చేయవలసి ఉంటుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య మీద వస్తున్న విమర్శల గురించి ఆలోచిస్తే– 2003 ప్రాంతాల్లో ప్రారంభమైన విద్యుత్ సంస్కరణలు తరువాత కాంగ్రెస్ నాయకత్వం లోని యూపీఏ ఒకటి, రెండు ప్రభుత్వాల హయాంలలో (పదేళ్లలో) ఊపందుకుని విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు పూర్తయి అనేక రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ లభ్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలోని జేఏసీ అంచనా. ఇందుకు ఆధారంగా జేఏసీ నాయకులు 2017 –2018 కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) వార్షిక నివేదికలో రూపొందించిన వివరాలను చూపుతున్నారు. అయితే దేశమంతటా ఇబ్బడి ముబ్బడిగా కరెంట్ ఉత్పత్తి అయి మిగులు పరిస్థితిలోకి వెళితే ఆ వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చెయ్యడానికి వాడుకుంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. జేఏసీ చెబుతున్నది కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావించడం కూడా సరికాదు. 24 గంటల విద్యుత్ సరఫరా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వల్ల పడనున్న భారం ఏటా రూ.600 కోట్లని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా అందుకోసం విద్యుత్ సంస్థల మీద పది వేల కోట్ల రూపాయల మేర భారం పడనుందనీ, అందులో రూ. 5,500 కోట్ల భారాన్ని మాత్రమే ప్రభుత్వం భరిస్తానని అంటున్నదని జేఏసీ చెబుతున్నది. ప్రభుత్వ వర్గాలు చెబుతున్న దానికీ, జేఏసీ చూపుతున్న లెక్కలకూ చాలా వ్యత్యాసం ఉంది. ఎంతైనా ప్రజల డబ్బే కాబట్టి ప్రభుత్వం దీనికి సరైన వివరణ ఇస్తే బాగుంటుంది. అంతిమంగా విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోకుండా చూడాల్సిన బాధ్యతా ప్రభుత్వానిదే. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ 24 గంటల విద్యుత్ సరఫరా ఫలితాలు రెండు రోజుల్లోనే తెలియవు. కొంతకాలం పరిశీలించాల్సిందే. ఎకరాకు ఎనిమిదివేలు రైతులకు లాభం చేకూర్చే మరో కార్యక్రమం– ఎకరాకు ఏటా ఎనిమిది వేల రూపాయలు.రెండు విడతలుగా రైతులకు చెల్లించే ఈ మొత్తం ముఖ్యమంత్రి చెబుతున్నట్టుగా మొత్తం అవసరాలు తీర్చలేకపోయినా కూడా రైతుకు ఊరటే. కానీ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు– కౌలు రైతులకు ఈ పథకం వర్తింపచేసే ప్రసక్తే లేదని. తెలంగాణలో ఎంతమంది రైతులు సొంతంగా వ్యవసాయం చేస్తున్నారు, ఎంత భూమి కౌలుదారుల చేతుల్లో ఉంది అనే లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? ఆ లెక్కలు తేల్చి ఈ పథకం అమలు చేస్తే ప్రజాధనం వృధా కాకుండా ఉంటుంది. పైగా పేద, ధనిక భేదం లేకుండా అందరికీ ఎకరానికి ఎనిమిది వేలు ఇస్తామనడం సరయినది కాదు. తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం కారణంగా వందలు వేల ఎకరాల భూస్వాములు ఇప్పుడు లేరు. చిన్న కమతాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న మాట నిజమే. అట్లా ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులు వ్యవసాయం సొంతంగా చేసుకుంటారు కాబట్టి, ఈ తరహా భూములకు ఎనిమిది వేల రూపాయల సాయం అందించడం వల్ల తప్పక కొంత లబ్ధి జరుగుతుంది. కానీ ఇంకా తక్కువ సంఖ్యలోనే అయినా పదులూ, వందల ఎకరాల భూములు ఉండి కౌలుకు ఇచ్చుకుని వేరే వ్యాపారాలు, వృత్తులు చేసుకునే వాళ్లు కూడా చాలామంది ఉంటారు. ఈ సాయం వాళ్లకు కాకుండా కౌలు చేసే వాళ్లకు కదా వెళ్లాల్సింది! తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఎకరానికి ఏటా 8 వేల రూపాయల ఆర్థికసాయం మంచి ఆలోచనే అయినా రైతులను వేధిస్తున్న ఇతర సమస్యల మీద మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎంతో ఆర్భాటంగా ముఖ్యమంత్రి ప్రకటించిన రైతు సమాఖ్యల మీద పెద్ద పెట్టున విమర్శలు రావడంతో మళ్లీ వాటి ఊసే ఎత్తడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న జన్మభూమి కమిటీల లాగా కాకుండా రైతు సంక్షేమానికి పాటు పడే, న్యాయం జరిగేటట్టు చూసే ఒక ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయవలసిన అవసరం అయితే ఉంది. పంటకు గిట్టుబాటు ధర రాక, నాణ్యమైన విత్తనాలు లభిం చక, పంటల బీమా లేక ఊపిరి సలపక రైతుల ఉసురు తీస్తున్న ఉదంతాలు అనేకం. పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నా తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగలేదన్న సంగతి వాస్తవం. ముప్పిరిగొంటున్న ఈ సమస్యలన్నిటికీ తగిన పరిష్కారం చూపకుండా కేవలం 24 గంటలు విద్యుత్ సరఫరా చేసి, ఏడాదికి ఎనిమిది వేలు ఇచ్చినంత మాత్రాన రైతు పరిస్థితి బాగుపడదు. మిగిలిన రైతు సమస్యల పరిష్కారమూ ముఖ్యమేనని చెప్పడం అందుకే. గడువు కంటే ముందుగానే వస్తాయంటున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్ర శేఖరరావు ఈ సమస్యలతో పాటు తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేసిన ముఖ్యమైన వాగ్దానాలు నెరవేర్చే ప్రయత్నం చేస్తేనే సాధ్యం. అంతేతప్ప చంద్రబాబునాయుడి మార్గంలో రాజకీయ పేకాటలో జోకర్ వంటి పవన్‌కల్యాణ్ లాంటి వాళ్లు సాయపడతారనుకుంటే పొరపాటు. తెలంగాణ రాష్ట్రంలో పేకాట క్లబ్‌లను మూయించి ఎన్నో కుటుంబాలను కాపాడిన ముఖ్యమంత్రికి బహుశా ఆ ఆట రాదేమో. పేకాటలో జోకర్లు ఎన్ని ఉన్నా ఒరిజినల్ సీక్వెన్స్ ఒకటి తప్పనిసరి. లేకపోతే ఆటలో ఓటమే. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
‘నంద్యాల’ విజేత నల్లధనమే!
డేట్లైన్ హైదరాబాద్ ఒక్కసారి శోభా నాగిరెడ్డి మరణం సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో ఉండగా ప్రమాదంలో మరణిస్తే కనీసం ఆ పిల్లలను పలకరించని, ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించని చంద్రబాబు, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం పట్టుపడితే తప్ప మొక్కుబడిగా సంతాప తీర్మానం కూడా పెట్టని బాబు, ఆయన పార్టీ పాపం తల్లితండ్రులు లేని పసిపిల్లలు అని ఇప్పుడు సానుభూతి చూపడం ఓట్లు దండుకోవడానికే కదా! ఏ ఆట అయినా గెలవడానికే ఆడతారు ఎవరయినా! ఏ ఎన్నికలో అయినా గెలవాలనే పోటీ చేస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా! ఫలితాలు వెలువడిన తరువాత సమీక్షించుకోవడం సహజం. ఈ సమీక్ష మామూలుగా ఓడిన పక్షం వైపే ఎక్కువగా జరుగుతుంది. ఏయే కారణాల వల్ల ఓడిపోయాం? ఎక్కడ పొరపాటు జరిగింది? భవిష్యత్తులో గెలవడానికి పనితీరును ఎట్లా మెరుగు పరుచుకోవాలి...? ఇలా, ఈ రీతిలో సమీక్షించుకుంటారు. సోమవారం దేశ వ్యాప్తంగా జరిగిన నాలుగు శాసనసభా స్థానాల ఉప ఎన్నికల్లో అధికార పక్షాలే గెలుపొందాయి. గోవాలో రెండు స్థానాలనూ అక్కడి అధికార పక్షం భారతీయ జనతా పార్టీ, ఢిల్లీలో ఒక స్థానం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల స్థానాన్ని అధికార పక్షం తెలుగుదేశం పార్టీ గెల్చుకున్నాయి. మందీ మార్బలం, హంగూ ఆర్భాటం, అధికార యంత్రాంగం తమ పక్షాన పనిచేస్తాయి కాబట్టి సాధారణంగా ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా అధికార పక్షాన్నే గెలుపు వరించడం సహజం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఉప ఎన్నికల్లో అధికార పక్షం ఓడిపోవడం చూస్తాం. ఉప ఎన్నికలలో ఇది మామూలే ఇటీవలి చరిత్ర పరిశీలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి ఫలితాలను మనం చూశాం. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు 2006లో కేంద్ర మంత్రి పదవికీ, కరీంనగర్ లోక్‌సభ స్థానానికీ రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు అధికార కాంగ్రెస్ అభ్యర్థి మీద రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తరువాత డాక్టర్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకీ, పార్లమెంట్ సభ్యత్వానికీ రాజీనామా చేసి కడప పార్లమెంట్ స్థానానికి మళ్లీ పోటీ చేసినప్పుడు అద్భుతమయిన ఆధిక్యం సాధించారు. ఆయనతో బాటు డాక్టర్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి కూడా పులివెందుల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ మంచి మెజారిటీతో గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తరువాత జగన్మోహన్రెడ్డికి మద్దతుగా శాసనసభ్యత్వాలకూ, పార్లమెంట్ సభ్యత్వాలకూ రాజీనామాలు చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో అత్యధికులు గెలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత తెలంగాణలో కూడా పలువురు వివిధ పార్టీల శాసనసభ్యులు రాజీ నామా చేసి ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ఈ అన్ని సందర్భాల్లోనూ కొన్ని స్పష్టమయిన అంశాలు ఎన్నికలను ప్రభావితం చేశాయి. కేసీఆర్ పోటీ చేసినప్పుడు, ఆ తరువాత తెలంగాణలో పలువురు శాసనసభ్యులు పోటీ చేసిన ప్పుడు ఉప ఎన్నికల మీద తెలంగాణ ఉద్యమ ప్రభావం తీవ్రంగా ఉండటం చూశాం. జగన్మోహన్రెడ్డి పోటీ చేసిన ఉప ఎన్నిక తండ్రి మరణానంతరం ఆయన పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరి బలంగా ప్రభావం చూపింది. ఆ తరువాత కాలంలో వైఎస్ఆర్ సీపీలో చేరిన ఇతర పార్టీల ఎంఎల్ఏల ఉప ఎన్నికల సందర్భంలో కూడా ఇదే అంశం అధికార పక్షం ఓడిపోడానికి కారణం అయింది. 2004 నుంచి 2014 దాకా చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలో 40కి పైగా శాసనసభా స్థానాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగితే ఎక్కడా తెలుగుదేశం పార్టీ గెలవకపోగా 20 స్థానాలకు పైగా డిపాజిట్లు కూడా కోల్పోవడం గమనార్హం. ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వెలువడగానే కొందరు తెలుగుదేశం మంత్రులు, నాయకులు విజయోత్సాహం తట్టుకోలేక ప్రతిపక్షం పని అయిపోయింది, ఇక జగన్మోహన్రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుంది అని నోటికి వచ్చినట్టు మాట్లాడారు. మరి అంత దీనస్థితిలోకి తెలుగుదేశం పార్టీ ఆనాడు దిగజారితే ఆ పార్టీకి నాయకుడిగా చంద్రబాబునాయుడు ఎందుకు సన్యాసం తీసుకోలేదు? నంద్యాలలో శిల్పా మోహన్‌రెడ్డి ఓటమికి ఆనాడు టీడీపీ వారి ఓటమికి ఎక్కడయినా పోలిక ఉందా? తప్పించుకోలేరు కాబట్టే... ఇక నంద్యాల ఉప ఎన్నిక విషయానికి వద్దాం. ఈ అసెంబ్లీ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందినది. ఈ స్థానం నుంచి గెలిచి, పార్టీ ఫిరాయించి అధికార పక్షానికి వలసపోయిన నాగిరెడ్డి మరణం కారణంగా అక్కడ ఉప ఎన్నిక జరిగింది. నంద్యాలతో బాటు తమ పార్టీ నుంచి అధికార పక్షానికి వలసపోయిన మరో 20 శాసనసభా స్థానాలకు కూడా ఆ ఎంఎల్ఏలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తూనే ఉంది. అందుకు ఏ మాత్రం సాహసం చెయ్యని చంద్రబాబునాయుడుకు నాగిరెడ్డి ఆకస్మిక మృతితో అక్కడ ఉప ఎన్నికకు వెళ్లక తప్పలేదు. ఇప్పుడు నంద్యాలలో గెలిచాక ఇకపైన ఎక్కడ ఎన్నిక జరిగినా తమ పార్టీయే గెలుస్తుందని ప్రకటించుకున్నారు. అదేక్షణం మరి మిగిలిన 20 స్థానాలకు ఉప ఎన్నికలకు సిద్ధమేనా అంటే సమాధానం దాటవేసి వెళ్లిపోయారు. ఆ ఇరవై స్థానాలలో కూడా జరిగితే...! నిజంగానే నంద్యాల ప్రజలు ఈ మూడేళ్ల రెండుమాసాల కాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసిన తీరుకు ముచ్చట పడి ఓట్లేసి గెలిపించి ఉంటే మిగిలిన 20 స్థానాల్లో కూడా ఎన్నికలను ఎదుర్కోడానికి వెనకాడటం ఎందుకు? ఆ సాహసం ఆయన చేయరన్న విషయం అందరికీ తెలుసు. అదే చేయవలసి వస్తే ఓ నాలుగువేల కోట్ల రూపాయలు ఖర్చు చెయ్యాలి. ఒక్క ఎన్నిక కాబట్టి నంద్యాలలో 200 కోట్లతో సరిపెట్టారు. అట్లాగే ఒక్కచోటే ఎన్నిక కాబట్టి మొత్తం మంత్రివర్గాన్నీ, ఎంఎల్‌ఏలనూ, ఎంపీలనూ నెల రోజులపాటు నంద్యాలలోనేవిడిది చేయించారు. అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మొత్తాన్ని మోహరింప చెయ్యగలిగారు. ఫలితం వెలువడగానే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారు, నంద్యాల ఉప ఎన్నిక కారణంగా రాష్ట్రమంతటా అభివృద్ధి ఆగిపోయిందని. ఒక్క ఉప ఎన్నిక కోసం మొత్తం అధికార యంత్రాంగాన్ని నంద్యాలకు తరలించమని ఎవరు చెప్పారు ఆయనకు? ఆ అవసరం ఎందుకొచ్చిందట! ఇంత చేస్తే ఈ మాత్రం గెలుపు సాధించగలిగారు. నంద్యాల ఫలితం వెలువడ్డ తరువాత పలువురు తెలుగుదేశం సీనియర్ నాయకులు సంతోషానికి బదులు దిగులు పడ్డారట. ఎందుకంటే ఒక్క నంద్యాల ఎన్నికకే 50 స్థానాల్లో పోటీ చేసినంత కష్టపడ్డాం, ఇక 2019 ఎన్నికలను ఎట్లా ఎదుర్కోవాలో అని ఆందోళన చెందారట. అట్లాంటిది ఇప్పుడు 20 స్థానాలకు ఒక్కసారే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఇదంతా ఎట్లా సాధ్యం అవుతుంది? అందుకే చంద్రబాబు ఆ పనికి సిద్ధంగా లేకపోగా మీ ఎంపీలతో రాజీనామా చెయ్యించండని వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు సవాలు విసురుతున్నారు. ఇప్పుడు జరగాల్సింది ఏమిటి? సక్రమంగా గెలిచిన పార్లమెంట్ సభ్యులు రాజీనామా చెయ్యడమా, అక్రమంగా పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఏలు రాజీనామా చెయ్యడమా? దబాయించేస్తే సరిపోతుంది అనుకుంటే ఎలా? గెలుపు ఎవరిది? ఇంతకీ నంద్యాలలో ఎవరు గెలిచారు? మొత్తం ఎన్నికల కాలంలో ఒక్క క్షణం కూడా నోరు విప్పని భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచారా, ఆయనకు టికెట్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గెలిచారా? సాంకేతికంగా గెలిచింది తెలుగుదేశం అభ్యర్ధి బ్రహ్మానందరెడ్డి అయినా, అసలు గెలిచింది మాత్రం మితిమీరిన అధికార దుర్వినియోగం, వందల కోట్ల రూపాయల నల్లధనం, అభివృద్ధి పేరిట జరిగిన విధ్వంసం, గెలిపించకపోతే అభివృద్ధిని ఆపేస్తామన్న బెదిరింపులు. నిజానికి నంద్యాల ఉపఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనవ్వుల పాలయ్యారు. పెద్ద నోట్ల రద్దు (డిమోనిటైజేషన్)తో నల్లధనం మొత్తం బయట పడిపోయిందని మోదీ చెబుతుంటే ఆయన మిత్రపక్షం తెలుగుదేశం మాత్రం నంద్యాల వీధుల్లో నల్లధనం పారిం చింది. భూమా నాగిరెడ్డి మరణం, అంతకు ముందే ఆయన భార్య శోభా నాగిరెడ్డి మరణం ఈరెండింటినీ సానుభూతిగా మలచి తనకు అనుకూలంగా మార్చుకోడానికి కూడా చంద్రబాబునాయుడు ఏ అవకాశమూ వదిలిపెట్టలేదు. తల్లీతండ్రీ లేని పిల్లలను చూసి తెలుగుదేశంకు ఓటు వెయ్యండని నంద్యాల వీధుల్లో ఆ ఇద్దరి మరణానికి సంబంధించిన వీడియోలు, లేజర్ షోలు చూపించారు. ఒక్కసారి శోభా నాగిరెడ్డి మరణం సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో ఉండగా ప్రమాదంలో మరణిస్తే కనీసం ఆ పిల్లలను పలకరించని, ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించని చంద్రబాబునాయుడు, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం పట్టుపడితే తప్ప మొక్కుబడిగా సంతాప తీర్మానం కూడా పెట్టని చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ పాపం తల్లితండ్రులు లేని పసిపిల్లలు అని ఇప్పుడు సానుభూతి చూపడం ఓట్లు దండుకోవడానికే కదా! నంద్యాలలో ఓడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి పార్టీ ఫిరాయింపుల విషయంలో జాతీయ స్థాయిలో చర్చకు తెర తీయడంలో విజయం సాధించారు. ఆరేళ్ల శాసన మండలి సభ్యత్వానికి శిల్పా చక్రపాణిరెడ్డి చేసిన రాజీనామా చిన్న త్యాగం కాదు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలను సమీక్షించుకోవాల్సింది ఎవరు? సాధారణంగా ఏ ఎన్నిక ఫలితాన్నయినా సమీక్షించుకునేది ఓడిపోయిన పక్షమే. కానీ ఇక్కడ అష్టకష్టాలు పడి, అన్ని అడ్డదారులూ తొక్కి గెలిచి ఓడిన అధికార పక్షమే సమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి. datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
‘దక్షిణం’ కోసం ప్రదక్షిణలు
డేట్లైన్ హైదరాబాద్ తనను తీవ్రంగా వ్యతిరేకించి, అవమానకరంగా వ్యవహరించిన నితీశ్‌నే అక్కున చేర్చుకున్న మోదీ చంద్రబాబు ఆనాడు చేసిన అవమానాన్ని తమ రాజకీయ ప్రయోజనం కంటే ఎక్కువ సీరియస్‌గా తీసుకుంటారా? అదేమైనా మనసులో ఉన్నా అసలు కారణాలు వేరే ఉన్నాయి. పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు, అన్ని వర్గాలనూ దూరం చేసుకున్న పరిస్థితిలో మునుగుతున్న పడవలో ప్రయాణం చెయ్యాలని ఎవరనుకుంటారు? ఈ ఆగస్టులో ఏపీ రాజకీయాలు ఆసక్తికరమైన మలుపులు తిరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఏం చేయాలని అనుకుంటున్నది? తెలంగాణలో అధికారపక్షాన్ని తన దారికి తెచ్చుకుని, ఆంధ్రప్రదేశ్‌లో అధికారపక్షంతో తెగతెంపులు చేసుకోవాలని అనుకుంటున్నదా? మిత్రుపక్షాలైనా సరే, భారంగా మారతాయనిపిస్తున్న పార్టీలను వదిలించుకుని కొత్త స్నేహాల కోసం బీజేపీ చేయి చాస్తున్నట్టు ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదేదో రెండు తెలుగురాష్ట్రాలలో తన వ్యూహంగా మాత్రమే బీజేపీ చేస్తున్నట్టు లేదు. 2019 సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో బీజేపీకి గతంలో కంటే ఎక్కువ స్థానాలను సాధించుకోవడంతో బాటు, రాష్ట్రాల్లో కూడా తమ ప్రభుత్వం లేదా తమ మిత్రుల ప్రభుత్వాలు అధికారంలో ఉండేటట్టు చూసుకోవడం నరేంద్ర మోదీ, అమిత్ షా తాజా వ్యూహం. తద్వారా లోక్‌సభతో బాటు రాజ్యసభలో కూడా తమ మాట నెగ్గేటట్టు చేసుకుంటే ఇక అడ్డు ఉండదన్నది ఆ నాయకద్వయం ఆలోచన. సంపూర్ణ అధికారమే లక్ష్యంగా ముందుకు పోతున్న ఈ నాయకులు ఇద్దరికీ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల మీద ప్రత్యేకమైన ప్రేమ కానీ, ద్వేషం కానీ లేవు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న మాటను నూటికి నూరు పాళ్లు నిజం చేస్తూ మొన్ననే బిహార్‌లో నితీశ్‌కుమార్ మోదీ శిబిరంలో చేరిపోవడం, మోదీని మించిన నాయకుడు ఈ దేశంలోనే లేరు అనేంత దాకా వెళ్లడం చూశాం. ఇంకెవరయినా ఈ మాటలు మాట్లాడితే ఆశ్చర్యపోనక్కర లేదు. నితీశ్ బీజేపీతో జత కట్టడాన్ని ఘర్‌వాపసీ అంటున్న వాళ్లంతా మోదీ నాయకత్వాన్ని అంగీకరించేందుకు ససేమిరా అనే నితీశ్ ఎన్డీఏ కూటమిని వీడిన విషయం, ఒక దశలో బీజేపీయేతర పార్టీలన్నిటికీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకొచ్చిన విషయం మరిచిపోయినట్టున్నారు. ఇటీవలే జరిగిన బిహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యు) మధ్య జరిగిన మాటల యుద్ధం కూడా గుర్తు చేసుకోవాలి వాళ్లు. నైతికమా అనైతికమా, న్యాయమా అన్యాయమా, చట్ట విరుద్ధమా రాజ్యాంగ బద్ధమా అన్న చర్చ చేయడానికి కేంద్రంలోఅధికారంలో ఉన్న మోదీ షా జోడీ ఆలోచించేందుకు సిద్ధంగా లేదు. దేశాన్నంతటినీ తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం లక్ష్యంగా ముందుకు పోతున్నారు. తమిళనాడు పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం కదా! ద్రవిడ రాజకీయాలకు పెట్టింది పేరైన తమిళనాడు ఇక బీజేపీ అదుపులోకి వచ్చినట్టే. బిహార్ బీజేపీ బుట్టలో పడనే పడింది. దీంతో 15 రాష్ట్రాలు బీజేపీ పాలనలోకి వచ్చేసినట్టే. నియోజకవర్గాల పెంపు లేకపోతే... తమిళనాడులో ఏఐడీఎంకే గ్రూపులు దారికి రాకపోతే రాష్ట్రపతి పాలన విధించి 2018లో మరికొన్ని రాష్ట్రాలతో బాటు ఎన్నికలు నిర్వహించవచ్చు. దక్షిణాదిలో కూడా అధికారంలోకి రావాలన్న బీజేపీ వ్యూహకర్తల లక్ష్యంలో భాగంగా తమిళనాడును దారికి తెచ్చుకునే పనిలోపడ్డట్టున్నారు. కర్ణాటకలో గతంలో అధికారం అనుభవించిన బీజేపీ మళ్లీ అధికారం లోకి వచ్చే అవకాశాల పట్ల ఆశతోనే ఉంది. కేరళ కొరకరాని కొయ్య. ఇక పోతే దక్షిణాదిలో మిగి లింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్–రెండు తెలుగు రాష్ట్రాలు. ఇటీవలి పరిణామాల నేప«థ్యంలో ఈ రెండు రాష్ట్రాలలో మోదీ షా జోడీ ఏం చేయబోతున్నదో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ అధికార పక్షాలు విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల్లో మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను మాత్రం కచ్చితంగా పెంచేందుకు కేంద్రాన్ని ఒప్పించగలమన్న ధీమాతో ఎడా పెడా ప్రతిపక్షాల నుంచి శాసనసభ్యులను చేర్చుకుని కూర్చున్నారు. తెలంగాణలో 25 మంది, ఆంధ్రప్రదేశ్‌లో మరో 21 మంది శాసనసభ్యులు, కొంతమంది లోక్‌సభ సభ్యులు అధికార పక్షానికి వలసపోయారు. ఇద్దరికీ మిత్రుడిగా, తమ ప్రయోజనాల పరిరక్షకుడిగా చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు భావించిన వెంకయ్యనాయుడును ఉప రాష్ట్రపతి పదవికి పంపించడం, ఆ వెంటనే, నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేదని స్పష్టం చెయ్యడంతో ఇద్దరు నేతలూ దిక్కు తోచని స్థితిలో పడ్డారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఇద్దరు ముఖ్యమంత్రులూ ప్రధానమంత్రిని కలసి నియోజకవర్గాల పెంపు విషయంలో స్పష్టమయిన ప్రకటన చేయించుకు రావాలని గట్టి ఆలోచనతో వెళ్లారు. చంద్రబాబునాయుడుకు య«థావిధిగానే ప్రధానమంత్రి అపాయిం ట్మెంట్ దొరకలేదు. అయితే ప్రధానితో సమావేశం కోసం వేచి ఉండకుండా తొందర పనులు ఉన్నందున చంద్రబాబే విజయవాడకు వెళ్లిపోయారని ఆయన అనుయాయులు నమ్మించే ప్రయత్నం చేశారనుకోండి! ఇక ప్రధానమంత్రి అపాయింట్మెంట్ పొంది మరునాడు ఆయనను కలసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఆ అంశం మరిచిపోవచ్చునని మీడియా మిత్రులకు చెప్పారు. నియోజకవర్గాల సంఖ్య పెరగకపోయినా మాకేం ‘ఫరక్’ పడదు అని ఆయన గాంభీర్యం ప్రదర్శించినా కొంచెం స్వరం మారడం గమనించవచ్చు. గత సంవత్సరం మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన వెంటనే తీవ్రంగా స్పందించి, తెలివి తక్కువ చర్యగా వర్ణించిన చంద్రశేఖర్‌రావు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి ఉపదేశం విన్నాక కనువిప్పు కలిగి అదొక విప్లవాత్మక నిర్ణయం అని కొనియాడారు. ఏం మతలబు జరిగిందో ఆయనకే తెలియాలి. ఇంతమాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే మొన్న ప్రధానిని కలసి బయటికొచ్చాక అదే చంద్రశేఖర్‌రావు పెద్ద నోట్ల రద్దు సత్ఫలితాలు ఏమీ కనిపించలేదని మీడియాకు చెప్పారు. సొంతంగా ఎదిగేందుకు బీజేపీ కృషి ఈ మధ్యకాలంలో ఒకపక్క తెలంగాణ బీజేపీ నాయకులు తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శల బాణాలు విసురుతూనే ఉన్నా స్నేహబంధం కుదిరిపోయిందనీ, ఈ పార్లమెంట్ సమావేశాల తరువాత టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంలో చేరనుందనీ వార్తలు వచ్చాయి. కేసీఆర్ కూడా అమిత్ షాను విమర్శించినా కేంద్ర ప్రభుత్వం మీద, మోదీ మీద ఈగ వాలనివ్వక పోవడం ఆ ప్రచారానికి ఆస్కారం కల్పించింది. అంతెందుకు, కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చి మర్యాద పూర్వకంగా కలుస్తానన్నా కనీసం ఫోన్లో కూడా ఆమెతో మాట్లాడటానికి సిద్ధపడక పోవడం బీజేపీ మెప్పు కోసమే అన్న విమర్శ అయితే ఉంది. సొంతంగానే పోటీ చేస్తాం అని శ్రేణుల్లో ఉత్సాహం కలిగించడం కోసం మాట్లాడుతున్నా టీఆర్ఎస్ అధినేతకు పరిస్థితులు బాగా తెలుసు, వచ్చే ఎన్నికలలో గెలుపు నల్లేరు మీద నడక కాదని. నియోజకవర్గాల పెంపు లేకపోతే అందరినీ సంతృప్తి పరచడం అసాధ్యం. ఆ విధంగా తెలంగాణ లో అధికారపక్షం తమతో పొత్తుకు ముందుకు రాక తప్పని పరిస్థితి కల్పిస్తూనే సొంతంగా ఎదిగే ప్రయత్నంలో బీజేపీ పడ్డట్టుంది. మోదీ అమిత్ షా ఎత్తుగడలను తట్టుకుని టీఆర్ఎస్ సొంతంగానే నిలబడుతుందా, సర్దుకుపోతుందా చూడాలి. టీడీపీతో బెడిసిన సంబంధాలు ఇక ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. వాజ్‌పేయి, అడ్వానీల కాలం నాటి ఎన్డీఏ కాదనీ మోదీ, అమిత్ షాల కాలమనీ గుర్తించడానికి చంద్రబాబునాయుడుకు ఎక్కువ కాలం పట్టలేదు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబునాయుడుకు ముందు వరుసలో స్థానం కేటాయించారని అనుకూల మీడియాలో రాయిం చుకోవడం కేవలం ఢిల్లీలో ఇంకా తమకు సముచిత గౌరవం ఉందని చెప్పుకోవడానికే. ఈ మూడేళ్లకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం నడుస్తున్న తీరు తెలియనంత అజ్ఞానంలో బీజేపీ నాయకత్వం ఉండదు కదా! కేంద్రం విడుదల చేసిన నిధులను ఖర్చు చేస్తున్న తీరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్దల వ్యవహార శైలి ఎప్పటికప్పుడు తెలుసుకుం టున్న కేంద్ర నాయకత్వం ఇక్కడ కూడా సొంతంగా పార్టీని బలోపేతం చేసే ఆలోచనతో బాటు, ప్రత్యామ్నాయ మిత్రులను వెతుక్కోవడం సహజంగానే జరుగుతున్నది. ఇక్కడొక విషయం మాట్లాడుకోవాలి. దేశమంతా ఇంతకాలం బీజేపీకి దూరంగా ఉన్న పలు పార్టీలు దగ్గరై ఎన్డీఏలో చేరడానికి సిద్ధపడుతుంటే, పాత భాగస్వామి తెలుగుదేశం ఎందుకు దూరమవుతున్నది అన్నదే ఆ విషయం. రాజకీయ దురంధరుడినని తనకు తానే కితాబు ఇచ్చుకునే చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రాణవాయువు వంటి ప్రత్యేక హోదా మొదలైన అన్ని హామీలను గాలికి వదిలేసి అణిగి మణిగి ఉన్నా ఎందుకు బెడిసింది? కాంగ్రెస్‌ను పూర్తిగా బలహీనపరిచే క్రమంలో వీలైనన్ని పార్టీలను తమ కూటమిలో చేర్చుకోజూస్తున్న బీజేపీ ఆయనను ఎందుకు దూరం పెడుతున్నది? నేలకు ఒరిగిపోతున్న చంద్రబాబు రాజకీయ ప్రతిష్ట వెన్నుకు వెదురు బద్దలు కట్టి నిటారుగా నిలబెట్టే ప్రయత్నంలో తలమునకలవుతున్న ఆయన మిత్ర మీడియా చెప్పినట్టు వాజ్‌పేయి హయాంలో ఎన్డీఏ కన్వీనర్‌గా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీని పదవి నుంచి తొలగించాలని పట్టుపట్టి ఢిల్లీ ఆంధ్రభవన్లో మూడు గంటలు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించినందుకే ఇప్పుడు మోదీ చంద్రబాబును దూరం పెడుతున్నారా? తనను తీవ్రంగా వ్యతిరేకించి, అవమానకరంగా వ్యవహరించిన నితీశ్‌నే అక్కున చేర్చుకున్న మోదీ చంద్రబాబు ఆనాడు చేసిన అవమానాన్ని తమ రాజకీయ ప్రయోజనం కంటే ఎక్కువ సీరియస్‌గా తీసుకుంటారా? అదేమైనా మనసులో ఉన్నా అసలు కారణాలు వేరే ఉన్నాయి. పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు, అన్ని వర్గాలనూ దూరం చేసుకున్న పరిస్థితిలో మునుగుతున్న పడవలో ప్రయాణం చెయ్యాలని ఎవరనుకుం టారు? ఇక ఎవరి సర్వేలు వాళ్లకు ఉంటాయికదా! హనీమూన్ ఇక ముగిసినట్టే. ఈ ఆగస్టు మాసంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తి కరమైన మలుపులు తిరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక ఇదే నెలలో జరుగుతున్నది, అక్కడ జరుగుతున్న అధికారదుర్వినియోగం, ధన ప్రవాహం అధికార పక్షం ఎంత దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయిందో స్పష్టం చేస్తున్నది. datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
‘ఉప’ భాష్యాలు నిరర్థకం
డేట్లైన్ హైదరాబాద్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ రెంటికీ పోటీచేసి గెలిచిన చంద్రశేఖర్‌రావు శాసనసభ స్థానాన్ని ఉంచుకుని మెదక్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చెయ్యడంతో జరిగిన ఉప ఎన్నికకూ రేపు వరంగల్‌లో కడియం రాజీనామా వల్ల ఏర్పడిన ఖాళీకి జరగబోయే ఎన్నికకూ తేడా ఉంది. ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధులు రాజీనామాలు చెయ్యడం, మళ్లీ పోటీ చెయ్యడం టీఆర్ఎస్లో సర్వసాధారణం. ఇట్లా తరచూ ఎన్నికలు జరగడం వల్ల ప్రజాధనం మంచినీళ్ల ప్రాయంగా వృథా అవుతుంది. కానీ ప్రజాస్వామ్యంలో ఇటువంటివి తప్పనిసరి. తెలంగాణ రాష్ర్టంలోనే చరిత్రాత్మకమైన వరంగల్ లోక్‌సభ నియోజక వర్గానికి ఈ నెలలో జరగనున్న ఉప ఎన్నిక టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుపైన రెఫరెండం అవుతుందా? నూతన రాష్ర్టం ఏర్పడిన తరువాత, వెనువెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పడినాక, పదిహేడు నెలలకు ఈ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అవసరమైంది. పదిహేడు నెలల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును నిర్ణయించేస్తారా, తీర్పులు చెప్పేస్తారా అని టీఆర్ఎస్ వాళ్లు అంటుంటే; ఇది కచ్చితంగా రెఫరెండమే అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ మాటలు అంటున్న పార్టీలలో పక్క రాష్ర్టంలో ఇంతేకాలంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలు కూడా ఉన్నాయి. పదేళ్లపాటు కేంద్రంలో అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కూడా ఇది రెఫరెండంగానే భావించాలని అంటున్నాయి. పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో ఒక ఉప ఎన్నిక జరిగితే దాని ఫలితాన్ని నిజంగానే ఆ ప్రభుత్వ పని తీరు మీద ప్రజల తీర్పుగా భావించాలా? అదెట్లా సహేతుకం అవుతుంది? వరంగల్ ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరు మీద రెఫరెండం అంటున్న మూడు ప్రధాన పక్షాలూ గతంలో ఎక్కడో ఒకచోట అధికారంలో ఉన్నవే. అట్లా ఉన్ననాడు ఉప ఎన్నికలను ఎదుర్కొన్నవే. ఆ ఉప ఎన్నికలలో ఓడి పోయినవే. ఆనాడు ప్రజా తీర్పును శిరసావహించి ఆ పార్టీలు అధికారంలో నుండి తప్పుకున్నాయా? ఎప్పటి మాటో ఎందుకు? 2014 సార్వత్రిక ఎన్నికలలో మంచి విజయం సాధించి కేంద్రంలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ ఆ తరవాత స్వల్పకాలంలోనే జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో చిత్తు చిత్తుగా ఓడింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా నిన్నగాక మొన్ననే బీజేపీ ఓటమి చవిచూసింది. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని దిగిపొమ్మందామా? ఇక్కడ అదే కూటమిలో భాగస్వాములయిన టీడీపీ, బీజేపీలు వరంగల్ ఉపఎన్నిక టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు మీద రెఫరెండం అని యుగళగీతం ఆలపిస్తున్నాయి. అదెలా? ప్రజాతీర్పులో పరమార్థం ఐదు సంవత్సరాలు మా ప్రతినిధులుగా పరిపాలన చేయమంటూ ప్రజలు ఇచ్చిన తీర్పు ఫలితమే ఈ ప్రభుత్వం. దాన్ని అందరూ శిరసావహించాలి. అంతేకాదు, మధ్యలో దాన్ని పడదోసే ప్రయత్నం కూడా అప్రజాస్వా మికమే. అయితే ఇప్పుడు వరంగల్ బరిలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ, ఆ పార్టీల అధి నాయకులందరూ అధికార టీఆర్‌ఎస్‌తోసహా ఈ మౌలిక ప్రజా స్వామ్య సూత్రాన్ని ఎన్నడూ గౌరవించిన వాళ్లు కారు. 1994లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్.టి.రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి అత్యద్భుత మెజా రిటీ ఇచ్చి గెలిపిస్తే కొన్ని మాసాల్లోనే ఆయన ప్రభుత్వాన్ని అప్రజాస్వా మికంగా కూల్చిన చంద్రబాబునాయుడు బృందంలో ఇప్పటి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుది కూడా ప్రధాన పాత్ర. ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి అయితే ప్రత్యక్ష భాగస్వామి. 2014 ఎన్నికల్లో వరం గల్ నుండి ఎన్నికయి పార్లమెంట్‌కు వెళ్లిన కడియం శ్రీహరి రాజీనామా చేసి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టినందునే ఈ ఉప ఎన్నిక అవసరం అయింది. ఎన్టీఆర్‌ను గద్దె దించేందుకు జరిగిన మొత్తం వ్యవహారానికి నాంది శ్రీహరి నుండే జరిగింది. ఇక ఎన్టీఆర్‌ను అప్రజాస్వామికంగా దింపేసిన చంద్ర బాబుతో అదే ఐదేళ్ల కాలంలో బీజేపీ దోస్తీ చేసింది. కలసి ఎన్నికలకు వెళ్లింది. అధికారంలో భాగస్వాములు కూడా అయ్యారు. ఇక నా ప్రభుత్వాన్ని అప్రజా స్వామికంగా కూలదోశారు సాయానికి రండి అని ఎన్టీఆర్ మొరపెట్టుకుంటే పట్టించుకోని ఢిల్లీలో ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. అందుకే వీళ్లెవరూ ఆ మౌలిక ప్రజాస్వామ్య సూత్రాన్ని గౌరవించరు అని చెప్పడం. ప్రజాస్వామ్యంలో ఇది అనివార్యం ఇక ప్రస్త్తుతానికి వస్తే వరంగల్ పార్లమెంట్‌కు బహుముఖ పోటీ జరగ బోతున్నది. అధికార టీఆర్ఎస్, బీజేపీ-టీడీపీ కూటమి, కాంగ్రెస్, వామ పక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెడుతున్నాయి. ఉస్మా నియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తరఫున కూడా ఒక అభ్యర్ధిని పోటీలో నిలబెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ రెంటికీ పోటీ చేసి గెలిచిన చంద్రశేఖర్‌రావు శాసనసభ స్థానాన్ని మాత్రం ఉంచుకుని మెదక్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చెయ్యడంతో జరిగిన ఉప ఎన్నికకూ రేపు వరంగల్‌లో కడియం రాజీనామా వల్ల ఏర్పడిన ఖాళీకి జరగబోయే ఎన్నికకూ చాలా తేడా ఉంది. ప్రజలు ఎన్నుకున్న పద వులకు రాజీనామాలు చెయ్యడం, మళ్లీ పోటీ చెయ్యడం టీఆర్ఎస్కు మంచి నీళ్ల ప్రాయం. ఇట్లా తరచూ ఎన్నికలు జరగడం వల్ల ప్రజాధనం కూడా అంతే మంచినీళ్ల ప్రాయంగా వృథా అవుతుంది. కానీ ప్రజాస్వామ్యంలో ఇటు వంటివి తప్పని సరి. మెదక్ ఉప ఎన్నిక జరిగే నాటికి కొత్త రాష్ర్టం, కొత్త ప్రభుత్వం కాబట్టి ప్రజావ్యతిరేకత ఉండే అవకాశం లేదు. ప్రతిపక్షాలకు ప్రభుత్వం మీద దాడి చేసే అవకాశమూ లేదు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక అట్లా కాదు. ఏడాదిన్నర కాలంలో అధికార పార్టీ అంగీకరించక పోయినా ఏ ప్రభుత్వం మీదనైనా కొంత ప్రజావ్యతిరేకత ఏర్పడటానికి ఈ గడువు చాలు. టీఆర్ఎస్ ఎన్నికల్లో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసి, ఊపిరి సలపని విధంగా వాగ్దానాలు చేసి, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కొంచెం ఎక్కువగానే ఉంది. అధికార పార్టీ వ్యతిరేక ఓటు బహుముఖ పోటీ కారణంగా చీలిపోతుంది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం తిరిగి టీఆర్ఎస్ వశం కావడం తప్పదన్నది స్పష్టం. అధికారం ఉంది, పైగా ఒక్కో శాసనసభా విభాగానికి ఒక మంత్రిని ఇంచార్జ్‌గా నియమించారు, ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారం చేయ నున్నారు. అభ్యర్ధి స్థానికుడు కావడం టీఆర్ఎస్కు కలిసొచ్చే అంశాలు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది టీఆర్ఎస్ గెలుపు గురించి కాదు, ఎంత ఆధిక్యతతో గెలుస్త్తుంది అన్న అంశం. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి కడియం శ్రీహరి కొన్ని లక్షల ఓట్ల మెజారిటీతో గెలు పొందారు. ఆయనకు గతంలో పరిపాలనా అనుభవం ఉండబట్టి, సమ ర్థ్ధుడుగా పేరు ఉంది కాబట్టి కదా ముఖ్యమంత్రి ఆయనను పార్లమెంట్‌కు రాజీనామా చేయించి మరీ శాసన మండలి సభ్యుడిని చేసి ముఖ్యమైన మంత్రిత్వశాఖతో బాటు, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు. నిజం గానే కడియం శ్రీహరి సీనియర్ మంత్రి, అనుభవజ్ఞుడు. ఆయనకు ముఖ్య మంత్రి ఇచ్చింది విద్యాశాఖ. మంచి ఫలితాలు సాధిస్తాడనే విశ్వాసంతోనే కదా ముఖ్యమంత్రి ఆయనకు ఆ పదవి ఇచ్చింది! ఆ ఫలితాలు నిజంగానే సాధించి ఉంటే 2014 ఎన్నికలలో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలిచినా శ్రీహరి సాధించిన మెజారిటీ కంటే అధికమైన మెజారిటీ రేపు జరగబోయే ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించాలి. కోరి తెచ్చిపెట్టుకున్నందుకు శ్రీహరి విద్యాశాఖలో సాధిస్తారని ఆశించిన ఫలితాలు సాధించినట్టు అవు తుంది. కానీ అధికార పార్టీ పెద్దలకు, ముఖ్యంగా స్వయంగా కడియం శ్రీహరికే ఆ విశ్వాసం లేనట్టుంది. ఆయనే ఒక సభలో వరంగల్ ఉప ఎన్నిక ఫలితం ప్రభుత్వం పని తీరు మీద రెఫరెండం కాబోదు అన్నారు. అంటే గెలుస్తామనే నమ్మకం లేదన్న మాట అని ప్రతిపక్షాలు వెంటనే వెంటబడ్డాయి. ప్రజల్లోకి సంకేతాలు వేరేగా వెళ్లాయి. రెఫరెండం అనే ప్రతిపక్షాలు పన్నిన వలలో శ్రీహరి పడిపోయారని గ్రహించిన అధికార పక్షం నాలుక కరుచుకుని, నష్ట నివారణ చర్యలు తీసుకునే చర్యల్లో భాగంగానే ముఖ్యమంత్రి కుమా రుడు కె.టి.రామారావుతో కచ్చితంగా ఇది రెఫరెండమే అని అదే వరంగల్‌లో మరో సభలో చెప్పించింది. సరిదిద్దుకునే అవకాశం వస్తుంది ఐదేళ్ల పాటు సక్రమ పాలన అందించండి అని ప్రజలు తీర్పు ఇచ్చాక మధ్యలో వచ్చే ఏ ఉప ఎన్నిక ఫలితం అయినా ఆ ప్రభుత్వం మీద దాని పాలన మీద రెఫరెండం కాదు. అయితే ఉప ఎన్నికలన్నీ ప్రభుత్వం ప్రజల్లో తమ పట్ల ఉన్న ఆదరణను కొలుచుకునే ఒక సాధనంగా భావించినప్పుడు మాత్రమే అవసరమయితే తమ విధానాలను మార్చుకోడానికి మంచి అవకాశంగా మలుచుకునే వీలుంటుంది. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికను అట్లాగే చూడాలి. ఒక సీటు పెరిగినా తగ్గినా పార్లమెంట్లో తెలంగాణ రాష్ర్ట సమితి అదనంగా చేసేదేమీ లేదు, చెయ్యలేక పోయేదేమీ లేదు. దేవులపల్లి అమర్, datelinehyderabad@gmail.com