‘దక్షిణం’ కోసం ప్రదక్షిణలు
డేట్‌లైన్ హైదరాబాద్
తనను తీవ్రంగా వ్యతిరేకించి, అవమానకరంగా వ్యవహరించిన నితీశ్‌నే అక్కున చేర్చుకున్న మోదీ చంద్రబాబు ఆనాడు చేసిన అవమానాన్ని తమ రాజకీయ ప్రయోజనం కంటే ఎక్కువ సీరియస్‌గా తీసుకుంటారా? అదేమైనా మనసులో ఉన్నా అసలు కారణాలు వేరే ఉన్నాయి. పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు, అన్ని వర్గాలనూ దూరం చేసుకున్న పరిస్థితిలో మునుగుతున్న పడవలో ప్రయాణం చెయ్యాలని ఎవరనుకుంటారు? ఈ ఆగస్టులో ఏపీ రాజకీయాలు ఆసక్తికరమైన మలుపులు తిరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఏం చేయాలని అనుకుంటున్నది? తెలంగాణలో అధికారపక్షాన్ని తన దారికి తెచ్చుకుని, ఆంధ్రప్రదేశ్‌లో అధికారపక్షంతో తెగతెంపులు చేసుకోవాలని అనుకుంటున్నదా? మిత్రుపక్షాలైనా సరే, భారంగా మారతాయనిపిస్తున్న పార్టీలను వదిలించుకుని కొత్త స్నేహాల కోసం బీజేపీ చేయి చాస్తున్నట్టు ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదేదో రెండు తెలుగురాష్ట్రాలలో తన వ్యూహంగా మాత్రమే బీజేపీ చేస్తున్నట్టు లేదు. 2019 సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో బీజేపీకి గతంలో కంటే ఎక్కువ స్థానాలను సాధించుకోవడంతో బాటు, రాష్ట్రాల్లో కూడా తమ ప్రభుత్వం లేదా తమ మిత్రుల ప్రభుత్వాలు అధికారంలో ఉండేటట్టు చూసుకోవడం నరేంద్ర మోదీ, అమిత్ షా తాజా వ్యూహం. తద్వారా లోక్‌సభతో బాటు రాజ్యసభలో కూడా తమ మాట నెగ్గేటట్టు చేసుకుంటే ఇక అడ్డు ఉండదన్నది ఆ నాయకద్వయం ఆలోచన.
సంపూర్ణ అధికారమే లక్ష్యంగా ముందుకు పోతున్న ఈ నాయకులు ఇద్దరికీ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల మీద ప్రత్యేకమైన ప్రేమ కానీ, ద్వేషం కానీ లేవు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న మాటను నూటికి నూరు పాళ్లు నిజం చేస్తూ మొన్ననే బిహార్‌లో నితీశ్‌కుమార్ మోదీ శిబిరంలో చేరిపోవడం, మోదీని మించిన నాయకుడు ఈ దేశంలోనే లేరు అనేంత దాకా వెళ్లడం చూశాం. ఇంకెవరయినా ఈ మాటలు మాట్లాడితే ఆశ్చర్యపోనక్కర లేదు. నితీశ్ బీజేపీతో జత కట్టడాన్ని ఘర్‌వాపసీ అంటున్న వాళ్లంతా మోదీ నాయకత్వాన్ని అంగీకరించేందుకు ససేమిరా అనే నితీశ్ ఎన్డీఏ కూటమిని వీడిన విషయం, ఒక దశలో బీజేపీయేతర పార్టీలన్నిటికీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకొచ్చిన విషయం మరిచిపోయినట్టున్నారు. ఇటీవలే జరిగిన బిహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యు) మధ్య జరిగిన మాటల యుద్ధం కూడా గుర్తు చేసుకోవాలి వాళ్లు. నైతికమా అనైతికమా, న్యాయమా అన్యాయమా, చట్ట విరుద్ధమా రాజ్యాంగ బద్ధమా అన్న చర్చ చేయడానికి కేంద్రంలోఅధికారంలో ఉన్న మోదీ షా జోడీ ఆలోచించేందుకు సిద్ధంగా లేదు. దేశాన్నంతటినీ తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం లక్ష్యంగా ముందుకు పోతున్నారు. తమిళనాడు పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం కదా! ద్రవిడ రాజకీయాలకు పెట్టింది పేరైన తమిళనాడు ఇక బీజేపీ అదుపులోకి వచ్చినట్టే. బిహార్ బీజేపీ బుట్టలో పడనే పడింది. దీంతో 15 రాష్ట్రాలు బీజేపీ పాలనలోకి వచ్చేసినట్టే.
నియోజకవర్గాల పెంపు లేకపోతే...
తమిళనాడులో ఏఐడీఎంకే గ్రూపులు దారికి రాకపోతే రాష్ట్రపతి పాలన విధించి 2018లో మరికొన్ని రాష్ట్రాలతో బాటు ఎన్నికలు నిర్వహించవచ్చు. దక్షిణాదిలో కూడా అధికారంలోకి రావాలన్న బీజేపీ వ్యూహకర్తల లక్ష్యంలో భాగంగా తమిళనాడును దారికి తెచ్చుకునే పనిలోపడ్డట్టున్నారు. కర్ణాటకలో గతంలో అధికారం అనుభవించిన బీజేపీ మళ్లీ అధికారం లోకి వచ్చే అవకాశాల పట్ల ఆశతోనే ఉంది. కేరళ కొరకరాని కొయ్య. ఇక పోతే దక్షిణాదిలో మిగి లింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్–రెండు తెలుగు రాష్ట్రాలు. ఇటీవలి పరిణామాల నేప«థ్యంలో ఈ రెండు రాష్ట్రాలలో మోదీ షా జోడీ ఏం చేయబోతున్నదో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ అధికార పక్షాలు విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల్లో మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను మాత్రం కచ్చితంగా పెంచేందుకు కేంద్రాన్ని ఒప్పించగలమన్న ధీమాతో ఎడా పెడా ప్రతిపక్షాల నుంచి శాసనసభ్యులను చేర్చుకుని కూర్చున్నారు. తెలంగాణలో 25 మంది, ఆంధ్రప్రదేశ్‌లో మరో 21 మంది శాసనసభ్యులు, కొంతమంది లోక్‌సభ సభ్యులు అధికార పక్షానికి వలసపోయారు.
ఇద్దరికీ మిత్రుడిగా, తమ ప్రయోజనాల పరిరక్షకుడిగా చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు భావించిన వెంకయ్యనాయుడును ఉప రాష్ట్రపతి పదవికి పంపించడం, ఆ వెంటనే, నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేదని స్పష్టం చెయ్యడంతో ఇద్దరు నేతలూ దిక్కు తోచని స్థితిలో పడ్డారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఇద్దరు ముఖ్యమంత్రులూ ప్రధానమంత్రిని కలసి నియోజకవర్గాల పెంపు విషయంలో స్పష్టమయిన ప్రకటన చేయించుకు రావాలని గట్టి ఆలోచనతో వెళ్లారు. చంద్రబాబునాయుడుకు య«థావిధిగానే ప్రధానమంత్రి అపాయిం ట్‌మెంట్ దొరకలేదు. అయితే ప్రధానితో సమావేశం కోసం వేచి ఉండకుండా తొందర పనులు ఉన్నందున చంద్రబాబే విజయవాడకు వెళ్లిపోయారని ఆయన అనుయాయులు నమ్మించే ప్రయత్నం చేశారనుకోండి! ఇక ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ పొంది మరునాడు ఆయనను కలసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఆ అంశం మరిచిపోవచ్చునని మీడియా మిత్రులకు చెప్పారు. నియోజకవర్గాల సంఖ్య పెరగకపోయినా మాకేం ‘ఫరక్’ పడదు అని ఆయన గాంభీర్యం ప్రదర్శించినా కొంచెం స్వరం మారడం గమనించవచ్చు. గత సంవత్సరం మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన వెంటనే తీవ్రంగా స్పందించి, తెలివి తక్కువ చర్యగా వర్ణించిన చంద్రశేఖర్‌రావు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి ఉపదేశం విన్నాక కనువిప్పు కలిగి అదొక విప్లవాత్మక నిర్ణయం అని కొనియాడారు. ఏం మతలబు జరిగిందో ఆయనకే తెలియాలి. ఇంతమాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే మొన్న ప్రధానిని కలసి బయటికొచ్చాక అదే చంద్రశేఖర్‌రావు పెద్ద నోట్ల రద్దు సత్ఫలితాలు ఏమీ కనిపించలేదని మీడియాకు చెప్పారు.
సొంతంగా ఎదిగేందుకు బీజేపీ కృషి
ఈ మధ్యకాలంలో ఒకపక్క తెలంగాణ బీజేపీ నాయకులు తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శల బాణాలు విసురుతూనే ఉన్నా స్నేహబంధం కుదిరిపోయిందనీ, ఈ పార్లమెంట్ సమావేశాల తరువాత టీఆర్‌ఎస్ కేంద్ర ప్రభుత్వంలో చేరనుందనీ వార్తలు వచ్చాయి. కేసీఆర్ కూడా అమిత్ షాను విమర్శించినా కేంద్ర ప్రభుత్వం మీద, మోదీ మీద ఈగ వాలనివ్వక పోవడం ఆ ప్రచారానికి ఆస్కారం కల్పించింది. అంతెందుకు, కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చి మర్యాద పూర్వకంగా కలుస్తానన్నా కనీసం ఫోన్‌లో కూడా ఆమెతో మాట్లాడటానికి సిద్ధపడక పోవడం బీజేపీ మెప్పు కోసమే అన్న విమర్శ అయితే ఉంది. సొంతంగానే పోటీ చేస్తాం అని శ్రేణుల్లో ఉత్సాహం కలిగించడం కోసం మాట్లాడుతున్నా టీఆర్‌ఎస్ అధినేతకు పరిస్థితులు బాగా తెలుసు, వచ్చే ఎన్నికలలో గెలుపు నల్లేరు మీద నడక కాదని. నియోజకవర్గాల పెంపు లేకపోతే అందరినీ సంతృప్తి పరచడం అసాధ్యం. ఆ విధంగా తెలంగాణ లో అధికారపక్షం తమతో పొత్తుకు ముందుకు రాక తప్పని పరిస్థితి కల్పిస్తూనే సొంతంగా ఎదిగే ప్రయత్నంలో బీజేపీ పడ్డట్టుంది. మోదీ అమిత్ షా ఎత్తుగడలను తట్టుకుని టీఆర్‌ఎస్ సొంతంగానే నిలబడుతుందా, సర్దుకుపోతుందా చూడాలి.
టీడీపీతో బెడిసిన సంబంధాలు
ఇక ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. వాజ్‌పేయి, అడ్వానీల కాలం నాటి ఎన్‌డీఏ కాదనీ మోదీ, అమిత్ షాల కాలమనీ గుర్తించడానికి చంద్రబాబునాయుడుకు ఎక్కువ కాలం పట్టలేదు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబునాయుడుకు ముందు వరుసలో స్థానం కేటాయించారని అనుకూల మీడియాలో రాయిం చుకోవడం కేవలం ఢిల్లీలో ఇంకా తమకు సముచిత గౌరవం ఉందని చెప్పుకోవడానికే. ఈ మూడేళ్లకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం నడుస్తున్న తీరు తెలియనంత అజ్ఞానంలో బీజేపీ నాయకత్వం ఉండదు కదా! కేంద్రం విడుదల చేసిన నిధులను ఖర్చు చేస్తున్న తీరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్దల వ్యవహార శైలి ఎప్పటికప్పుడు తెలుసుకుం టున్న కేంద్ర నాయకత్వం ఇక్కడ కూడా సొంతంగా పార్టీని బలోపేతం చేసే ఆలోచనతో బాటు, ప్రత్యామ్నాయ మిత్రులను వెతుక్కోవడం సహజంగానే జరుగుతున్నది. ఇక్కడొక విషయం మాట్లాడుకోవాలి.
దేశమంతా ఇంతకాలం బీజేపీకి దూరంగా ఉన్న పలు పార్టీలు దగ్గరై ఎన్‌డీఏలో చేరడానికి సిద్ధపడుతుంటే, పాత భాగస్వామి తెలుగుదేశం ఎందుకు దూరమవుతున్నది అన్నదే ఆ విషయం. రాజకీయ దురంధరుడినని తనకు తానే కితాబు ఇచ్చుకునే చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రాణవాయువు వంటి ప్రత్యేక హోదా మొదలైన అన్ని హామీలను గాలికి వదిలేసి అణిగి మణిగి ఉన్నా ఎందుకు బెడిసింది? కాంగ్రెస్‌ను పూర్తిగా బలహీనపరిచే క్రమంలో వీలైనన్ని పార్టీలను తమ కూటమిలో చేర్చుకోజూస్తున్న బీజేపీ ఆయనను ఎందుకు దూరం పెడుతున్నది?
నేలకు ఒరిగిపోతున్న చంద్రబాబు రాజకీయ ప్రతిష్ట వెన్నుకు వెదురు బద్దలు కట్టి నిటారుగా నిలబెట్టే ప్రయత్నంలో తలమునకలవుతున్న ఆయన మిత్ర మీడియా చెప్పినట్టు వాజ్‌పేయి హయాంలో ఎన్‌డీఏ కన్వీనర్‌గా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీని పదవి నుంచి తొలగించాలని పట్టుపట్టి ఢిల్లీ ఆంధ్రభవన్‌లో మూడు గంటలు ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానించినందుకే ఇప్పుడు మోదీ చంద్రబాబును దూరం పెడుతున్నారా? తనను తీవ్రంగా వ్యతిరేకించి, అవమానకరంగా వ్యవహరించిన నితీశ్‌నే అక్కున చేర్చుకున్న మోదీ చంద్రబాబు ఆనాడు చేసిన అవమానాన్ని తమ రాజకీయ ప్రయోజనం కంటే ఎక్కువ సీరియస్‌గా తీసుకుంటారా? అదేమైనా మనసులో ఉన్నా అసలు కారణాలు వేరే ఉన్నాయి. పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు, అన్ని వర్గాలనూ దూరం చేసుకున్న పరిస్థితిలో మునుగుతున్న పడవలో ప్రయాణం చెయ్యాలని ఎవరనుకుం టారు? ఇక ఎవరి సర్వేలు వాళ్లకు ఉంటాయికదా! హనీమూన్ ఇక ముగిసినట్టే. ఈ ఆగస్టు మాసంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తి కరమైన మలుపులు తిరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి.
నంద్యాల ఉప ఎన్నిక ఇదే నెలలో జరుగుతున్నది, అక్కడ జరుగుతున్న అధికారదుర్వినియోగం, ధన ప్రవాహం అధికార పక్షం ఎంత దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయిందో స్పష్టం చేస్తున్నది.
datelinehyderabad@gmail.com
దేవులపల్లి అమర్