‘నంద్యాల’ విజేత నల్లధనమే! | devulapalli amar datel line on nandyala by elections | Sakshi
Sakshi News home page

‘నంద్యాల’ విజేత నల్లధనమే!

Published Wed, Aug 30 2017 1:03 AM | Last Updated on Fri, Oct 19 2018 8:11 PM

‘నంద్యాల’ విజేత నల్లధనమే! - Sakshi

‘నంద్యాల’ విజేత నల్లధనమే!

డేట్‌లైన్‌ హైదరాబాద్‌
ఒక్కసారి శోభా నాగిరెడ్డి మరణం సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. ఆమె వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో ఉండగా ప్రమాదంలో మరణిస్తే కనీసం ఆ పిల్లలను పలకరించని, ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించని చంద్రబాబు, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం పట్టుపడితే తప్ప మొక్కుబడిగా సంతాప తీర్మానం కూడా పెట్టని బాబు, ఆయన పార్టీ పాపం తల్లితండ్రులు లేని పసిపిల్లలు అని ఇప్పుడు సానుభూతి చూపడం ఓట్లు దండుకోవడానికే కదా!

ఏ ఆట అయినా గెలవడానికే ఆడతారు ఎవరయినా! ఏ ఎన్నికలో అయినా గెలవాలనే పోటీ చేస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా! ఫలితాలు వెలువడిన తరువాత సమీక్షించుకోవడం సహజం. ఈ సమీక్ష మామూలుగా ఓడిన పక్షం వైపే ఎక్కువగా జరుగుతుంది. ఏయే కారణాల వల్ల ఓడిపోయాం? ఎక్కడ పొరపాటు జరిగింది? భవిష్యత్తులో గెలవడానికి పనితీరును ఎట్లా మెరుగు పరుచుకోవాలి...? ఇలా, ఈ రీతిలో సమీక్షించుకుంటారు. సోమవారం దేశ వ్యాప్తంగా జరిగిన నాలుగు శాసనసభా స్థానాల ఉప ఎన్నికల్లో అధికార పక్షాలే గెలుపొందాయి. గోవాలో రెండు స్థానాలనూ అక్కడి అధికార పక్షం భారతీయ జనతా పార్టీ, ఢిల్లీలో ఒక స్థానం అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల స్థానాన్ని అధికార పక్షం తెలుగుదేశం పార్టీ గెల్చుకున్నాయి. మందీ మార్బలం, హంగూ ఆర్భాటం, అధికార యంత్రాంగం తమ పక్షాన పనిచేస్తాయి కాబట్టి సాధారణంగా ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా అధికార పక్షాన్నే గెలుపు వరించడం సహజం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఉప ఎన్నికల్లో అధికార పక్షం ఓడిపోవడం చూస్తాం.

ఉప ఎన్నికలలో ఇది మామూలే
ఇటీవలి చరిత్ర పరిశీలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి ఫలితాలను మనం చూశాం. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు 2006లో కేంద్ర మంత్రి పదవికీ, కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికీ రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి మీద రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తరువాత డాక్టర్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకీ, పార్లమెంట్‌ సభ్యత్వానికీ రాజీనామా చేసి కడప పార్లమెంట్‌ స్థానానికి మళ్లీ పోటీ చేసినప్పుడు అద్భుతమయిన ఆధిక్యం సాధించారు. ఆయనతో బాటు డాక్టర్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయలక్ష్మి కూడా పులివెందుల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ మంచి మెజారిటీతో గెలుపొందారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన తరువాత జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా శాసనసభ్యత్వాలకూ, పార్లమెంట్‌ సభ్యత్వాలకూ రాజీనామాలు చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో అత్యధికులు గెలిచిన విషయం తెలిసిందే.

ఆ తరువాత తెలంగాణలో కూడా పలువురు వివిధ పార్టీల శాసనసభ్యులు రాజీ నామా చేసి ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ఈ అన్ని సందర్భాల్లోనూ కొన్ని స్పష్టమయిన అంశాలు ఎన్నికలను ప్రభావితం చేశాయి. కేసీఆర్‌ పోటీ చేసినప్పుడు, ఆ తరువాత తెలంగాణలో పలువురు శాసనసభ్యులు పోటీ చేసిన ప్పుడు ఉప ఎన్నికల మీద తెలంగాణ ఉద్యమ ప్రభావం తీవ్రంగా ఉండటం చూశాం. జగన్‌మోహన్‌రెడ్డి పోటీ చేసిన ఉప ఎన్నిక తండ్రి మరణానంతరం ఆయన పట్ల కాంగ్రెస్‌ పార్టీ అనుసరించిన వైఖరి బలంగా ప్రభావం చూపింది. ఆ తరువాత కాలంలో వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన ఇతర పార్టీల ఎంఎల్‌ఏల ఉప ఎన్నికల సందర్భంలో కూడా ఇదే అంశం అధికార పక్షం ఓడిపోడానికి కారణం అయింది.

2004 నుంచి 2014 దాకా చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలో 40కి పైగా శాసనసభా స్థానాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగితే ఎక్కడా తెలుగుదేశం పార్టీ గెలవకపోగా 20 స్థానాలకు పైగా డిపాజిట్లు కూడా కోల్పోవడం గమనార్హం. ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వెలువడగానే కొందరు తెలుగుదేశం మంత్రులు, నాయకులు విజయోత్సాహం తట్టుకోలేక ప్రతిపక్షం పని అయిపోయింది, ఇక జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుంది అని నోటికి వచ్చినట్టు మాట్లాడారు. మరి అంత దీనస్థితిలోకి తెలుగుదేశం పార్టీ ఆనాడు దిగజారితే ఆ పార్టీకి నాయకుడిగా చంద్రబాబునాయుడు ఎందుకు సన్యాసం తీసుకోలేదు? నంద్యాలలో శిల్పా మోహన్‌రెడ్డి ఓటమికి ఆనాడు టీడీపీ వారి ఓటమికి ఎక్కడయినా పోలిక ఉందా?

తప్పించుకోలేరు కాబట్టే...
ఇక నంద్యాల ఉప ఎన్నిక విషయానికి వద్దాం. ఈ అసెంబ్లీ స్థానం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు చెందినది. ఈ స్థానం నుంచి గెలిచి, పార్టీ ఫిరాయించి అధికార పక్షానికి వలసపోయిన నాగిరెడ్డి మరణం కారణంగా అక్కడ ఉప ఎన్నిక జరిగింది. నంద్యాలతో బాటు తమ పార్టీ నుంచి అధికార పక్షానికి వలసపోయిన మరో 20 శాసనసభా స్థానాలకు కూడా ఆ ఎంఎల్‌ఏలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు జరపాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తూనే ఉంది. అందుకు ఏ మాత్రం సాహసం చెయ్యని చంద్రబాబునాయుడుకు నాగిరెడ్డి ఆకస్మిక మృతితో అక్కడ ఉప ఎన్నికకు వెళ్లక తప్పలేదు. ఇప్పుడు నంద్యాలలో గెలిచాక ఇకపైన ఎక్కడ ఎన్నిక జరిగినా తమ పార్టీయే గెలుస్తుందని ప్రకటించుకున్నారు. అదేక్షణం మరి మిగిలిన 20 స్థానాలకు ఉప ఎన్నికలకు సిద్ధమేనా అంటే సమాధానం దాటవేసి వెళ్లిపోయారు.

ఆ ఇరవై స్థానాలలో కూడా జరిగితే...!
నిజంగానే నంద్యాల ప్రజలు ఈ మూడేళ్ల రెండుమాసాల కాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసిన తీరుకు ముచ్చట పడి ఓట్లేసి గెలిపించి ఉంటే మిగిలిన 20 స్థానాల్లో కూడా ఎన్నికలను ఎదుర్కోడానికి వెనకాడటం ఎందుకు? ఆ సాహసం ఆయన చేయరన్న విషయం అందరికీ తెలుసు. అదే చేయవలసి వస్తే ఓ నాలుగువేల కోట్ల రూపాయలు ఖర్చు చెయ్యాలి. ఒక్క ఎన్నిక కాబట్టి నంద్యాలలో 200 కోట్లతో సరిపెట్టారు. అట్లాగే ఒక్కచోటే ఎన్నిక కాబట్టి మొత్తం మంత్రివర్గాన్నీ, ఎంఎల్‌ఏలనూ, ఎంపీలనూ నెల రోజులపాటు నంద్యాలలోనేవిడిది చేయించారు. అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మొత్తాన్ని మోహరింప చెయ్యగలిగారు. ఫలితం వెలువడగానే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారు, నంద్యాల ఉప ఎన్నిక కారణంగా రాష్ట్రమంతటా అభివృద్ధి ఆగిపోయిందని. ఒక్క ఉప ఎన్నిక కోసం మొత్తం అధికార యంత్రాంగాన్ని నంద్యాలకు తరలించమని ఎవరు చెప్పారు ఆయనకు? ఆ అవసరం ఎందుకొచ్చిందట! ఇంత చేస్తే ఈ మాత్రం గెలుపు సాధించగలిగారు.

నంద్యాల ఫలితం వెలువడ్డ తరువాత పలువురు తెలుగుదేశం సీనియర్‌ నాయకులు సంతోషానికి బదులు దిగులు పడ్డారట. ఎందుకంటే ఒక్క నంద్యాల ఎన్నికకే 50 స్థానాల్లో పోటీ చేసినంత కష్టపడ్డాం, ఇక 2019 ఎన్నికలను ఎట్లా ఎదుర్కోవాలో అని ఆందోళన చెందారట. అట్లాంటిది ఇప్పుడు 20 స్థానాలకు ఒక్కసారే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఇదంతా ఎట్లా సాధ్యం అవుతుంది? అందుకే చంద్రబాబు ఆ పనికి సిద్ధంగా లేకపోగా మీ ఎంపీలతో రాజీనామా చెయ్యించండని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు సవాలు విసురుతున్నారు. ఇప్పుడు జరగాల్సింది ఏమిటి? సక్రమంగా గెలిచిన పార్లమెంట్‌ సభ్యులు రాజీనామా చెయ్యడమా, అక్రమంగా పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఏలు రాజీనామా చెయ్యడమా? దబాయించేస్తే సరిపోతుంది అనుకుంటే ఎలా?

గెలుపు ఎవరిది?
ఇంతకీ నంద్యాలలో ఎవరు గెలిచారు? మొత్తం ఎన్నికల కాలంలో ఒక్క క్షణం కూడా నోరు విప్పని భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచారా, ఆయనకు టికెట్‌ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గెలిచారా? సాంకేతికంగా గెలిచింది తెలుగుదేశం అభ్యర్ధి బ్రహ్మానందరెడ్డి అయినా, అసలు గెలిచింది మాత్రం మితిమీరిన అధికార దుర్వినియోగం, వందల కోట్ల రూపాయల నల్లధనం, అభివృద్ధి పేరిట జరిగిన విధ్వంసం, గెలిపించకపోతే అభివృద్ధిని ఆపేస్తామన్న బెదిరింపులు. నిజానికి నంద్యాల ఉపఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనవ్వుల పాలయ్యారు. పెద్ద నోట్ల రద్దు (డిమోనిటైజేషన్‌)తో నల్లధనం మొత్తం బయట పడిపోయిందని మోదీ చెబుతుంటే ఆయన మిత్రపక్షం తెలుగుదేశం మాత్రం నంద్యాల వీధుల్లో నల్లధనం పారిం చింది. భూమా నాగిరెడ్డి మరణం, అంతకు ముందే ఆయన భార్య శోభా నాగిరెడ్డి మరణం ఈరెండింటినీ సానుభూతిగా మలచి తనకు అనుకూలంగా మార్చుకోడానికి కూడా చంద్రబాబునాయుడు ఏ అవకాశమూ వదిలిపెట్టలేదు. తల్లీతండ్రీ లేని పిల్లలను చూసి తెలుగుదేశంకు ఓటు వెయ్యండని నంద్యాల వీధుల్లో ఆ ఇద్దరి మరణానికి సంబంధించిన వీడియోలు, లేజర్‌ షోలు చూపించారు.

ఒక్కసారి శోభా నాగిరెడ్డి మరణం సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. ఆమె వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో ఉండగా ప్రమాదంలో మరణిస్తే కనీసం ఆ పిల్లలను పలకరించని, ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించని చంద్రబాబునాయుడు, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం పట్టుపడితే తప్ప మొక్కుబడిగా సంతాప తీర్మానం కూడా పెట్టని చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ పాపం తల్లితండ్రులు లేని పసిపిల్లలు అని ఇప్పుడు సానుభూతి చూపడం ఓట్లు దండుకోవడానికే కదా!

నంద్యాలలో ఓడినా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దాని అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఫిరాయింపుల విషయంలో జాతీయ స్థాయిలో చర్చకు తెర తీయడంలో విజయం సాధించారు. ఆరేళ్ల శాసన మండలి సభ్యత్వానికి శిల్పా చక్రపాణిరెడ్డి చేసిన రాజీనామా చిన్న త్యాగం కాదు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలను సమీక్షించుకోవాల్సింది ఎవరు? సాధారణంగా ఏ ఎన్నిక ఫలితాన్నయినా సమీక్షించుకునేది ఓడిపోయిన పక్షమే. కానీ ఇక్కడ అష్టకష్టాలు పడి, అన్ని అడ్డదారులూ తొక్కి గెలిచి ఓడిన అధికార పక్షమే సమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి.

datelinehyderabad@gmail.com
దేవులపల్లి అమర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement