డేట్‌లైన్ హైదరాబాద్
నక్సలైట్ ఉద్యమం కారణంగా వందలు వేల ఎకరాల భూస్వాములు ఇప్పుడు లేరు. చిన్న కమతాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న మాట నిజమే. అట్లా ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులు వ్యవసాయం సొంతంగా చేసుకుంటారు కాబట్టి, ఈ తరహా భూములకు ఎనిమిది వేల రూపాయల సాయం అందించడం వల్ల లబ్ధి జరుగుతుంది. కానీ పదులూ, వందల ఎకరాల భూములు ఉండి కౌలుకు ఇచ్చుకుని వేరే వ్యాపారాలు, వృత్తులు చేసుకునే వాళ్లు కూడా చాలామంది ఉంటారు. ఈ సాయం వాళ్లకు కాకుండా కౌలు చేసే వాళ్లకు కదా వెళ్లాల్సింది!
కరెంట్ బిల్లులు కట్టనందుకు బావి దగ్గర నుంచి ఫ్యూజులు పీక్కొచ్చి ఎంఆర్‌ఓ కార్యాలయంలోనో, ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాల్లోనో పెట్టేసుకోవడం చూశాం. నీరందక కళ్ల ముందే ఎండిపోతున్న చేనును చూసి దిక్కుతోచకుండా మిగిలిన రైతు పరిస్థితి చూశాం. అలాంటి రైతు ‘ఊరన్నా ఇడిచిపెట్టి పోవాలె, ఉసురన్నా తీసుకోవాలె.’ బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసిన తెలంగాణ రైతుల దైన్యం ఎలా ఉండేదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, చంద్రబాబునాయుడి ప్రభుత్వ హయాంలో చూశాం. అప్పుడే, ‘నేను అధికారంలోకి వచ్చాక ఉచిత కరెంట్ ఇస్తాను, కరెంట్ బిల్లుల బకాయిలు రద్దు చేస్తాను’ అని అప్పటి ప్రతిపక్షనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. దీనికి చంద్రబాబు స్పందన ఏమిటో కూడా మన విన్నాం.‘ఆ కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే!’ అని ఎద్దేవా చేసిన చంద్రబాబునాయుడు తరువాత డాక్టర్ వైఎస్ తను ఇచ్చిన హామీని నెరవేర్చడం స్వయంగా చూశారు.
రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే సర్కార్ కార్యాలయాల్లో బందీలుగా ఉన్న ఫ్యూజులను పైసా అపరాధ రుసుం కట్టించుకోకుండానే రైతులకు ఎట్లా తిరిగి ఇచ్చిందీ కూడా చంద్రబాబు వీక్షించారు. హామీ మేరకు ఉచిత కరెంట్ ఎట్లా ఇచ్చిందీ, కరెంట్ బిల్లుల బకాయిలు ఎట్లా మాఫీ చేసిందీ కూడా ఆయన గమనించారు. అప్పటికి దేశంలో ఇంకా విద్యుత్ సంస్కరణలు ఊపందుకోలేదు. ఈ చర్య వల్ల రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్ధికభారం మోయవలసి వచ్చింది. అయినా రాజశేఖరరెడ్డి వెనక్కు తగ్గలేదు. ఫతేమైదాన్‌లో ప్రమాణ స్వీకారం చేశాక ఆయన మొదటి సంతకం ఉచిత విద్యుత్ సరఫరా ఫైల్ మీదనే చేశారు. ఆయన జీవించినంత కాలం అదే విధానం అమలు పరిచారు.
రాజశేఖరరెడ్డి నిర్ణయం తెలుగు ప్రాంత రైతులకు గొప్ప ఊరట. ఉమ్మడి రాష్ట్రంలో నాటి తెలంగాణ రైతులకు మరీ పెద్ద ఊరట. తెలంగాణలో అత్యధికంగా, ఇరవై అయిదు లక్షల బోరు బావులు వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు. కరెంట్ అవసరం ఆనాడు తెలంగాణ రైతులకే ఎక్కువ. ఇప్పటికీ తెలంగాణలో బోరు బావుల మీద ఆధారపడి చేస్తున్న వ్యవసాయం శాతం అధికమే. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట తలపెట్టిన ప్రాజెక్టులు అన్నీ పూర్తయితే పరిస్థితి మారుతుంది. బోరు బావుల అవసరం పూర్తిగా తగ్గిపోతుంది. కాలువలు పారుతున్నప్పుడు బోర్ల అవసరం ఉండదు. పైగా భూగర్భ జలాల పరిస్థితి కూడా చాలా మెరుగు పడుతుంది. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో ఏర్పడిన నూతన ప్రభుత్వం నిరంతరాయంగా వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తూనే ఉంది.
రైతులకు మంచిరోజలు
2017 డిసెంబర్ 31 రాత్రి 12 గంటల ఒక్క నిమిషం, అంటే నూతన సంవత్సరం లోకిఅడుగుపెట్టిన క్షణం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన 24 గంటల విద్యుత్ సరఫరా మీద అనుకూలంగా, ప్రతికూలంగా జరుగుతున్న చర్చలూ, విమర్శలూ, విశ్లేషణల గురించి తరువాత మాట్లాడుదాం. ఇందులో 40 శాతం విద్యుత్ సరఫరా, వ్యవసాయం కోసం ప్రభుత్వం ఉచితంగా చేస్తుంది. దానికి ప్రభుత్వం భరించాల్సిన మొత్తం సంవత్సరానికి రూ. 600 కోట్లు. ప్రాజెక్టులు పూర్తయి కాలవల్లోకి నీళ్లొస్తే ఈ వ్యయం బాగా తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రాజెక్టులకు ఎత్తిపోతల కోసం వాడే విద్యుత్ భారం ప్రభుత్వానికి తప్పదు. ఏది ఏమైనా తెలంగాణ రైతు వ్యవసాయం మీద ఆశలు పెంచుకునే మంచిరోజులు వచ్చాయని చెప్పాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. ఉచితంగా విద్యుత్ వస్తున్నది, అందునా 24 గంటల సరఫరా జరుగుతున్నది కాబట్టి వృథా అయ్యే అవకాశాలను కూడా ప్రభుత్వం గమనించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆటోమేటిక్ స్టార్టర్‌ల విషయంలో ప్రభుత్వం ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. వాటిని తొలగింప చెయ్యడానికి పై స్థాయి నుంచి కింది దాకా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పని చేయవలసి ఉంటుంది.
ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య మీద వస్తున్న విమర్శల గురించి ఆలోచిస్తే– 2003 ప్రాంతాల్లో ప్రారంభమైన విద్యుత్ సంస్కరణలు తరువాత కాంగ్రెస్ నాయకత్వం లోని యూపీఏ ఒకటి, రెండు ప్రభుత్వాల హయాంలలో (పదేళ్లలో) ఊపందుకుని విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులు పూర్తయి అనేక రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ లభ్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలోని జేఏసీ అంచనా. ఇందుకు ఆధారంగా జేఏసీ నాయకులు 2017 –2018 కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) వార్షిక నివేదికలో రూపొందించిన వివరాలను చూపుతున్నారు. అయితే దేశమంతటా ఇబ్బడి ముబ్బడిగా కరెంట్ ఉత్పత్తి అయి మిగులు పరిస్థితిలోకి వెళితే ఆ వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చెయ్యడానికి వాడుకుంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. జేఏసీ చెబుతున్నది కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావించడం కూడా సరికాదు.
24 గంటల విద్యుత్ సరఫరా
వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వల్ల పడనున్న భారం ఏటా రూ.600 కోట్లని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా అందుకోసం విద్యుత్ సంస్థల మీద పది వేల కోట్ల రూపాయల మేర భారం పడనుందనీ, అందులో రూ. 5,500 కోట్ల భారాన్ని మాత్రమే ప్రభుత్వం భరిస్తానని అంటున్నదని జేఏసీ చెబుతున్నది. ప్రభుత్వ వర్గాలు చెబుతున్న దానికీ, జేఏసీ చూపుతున్న లెక్కలకూ చాలా వ్యత్యాసం ఉంది. ఎంతైనా ప్రజల డబ్బే కాబట్టి ప్రభుత్వం దీనికి సరైన వివరణ ఇస్తే బాగుంటుంది. అంతిమంగా విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోకుండా చూడాల్సిన బాధ్యతా ప్రభుత్వానిదే. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ 24 గంటల విద్యుత్ సరఫరా ఫలితాలు రెండు రోజుల్లోనే తెలియవు. కొంతకాలం పరిశీలించాల్సిందే.
ఎకరాకు ఎనిమిదివేలు
రైతులకు లాభం చేకూర్చే మరో కార్యక్రమం– ఎకరాకు ఏటా ఎనిమిది వేల రూపాయలు.రెండు విడతలుగా రైతులకు చెల్లించే ఈ మొత్తం ముఖ్యమంత్రి చెబుతున్నట్టుగా మొత్తం అవసరాలు తీర్చలేకపోయినా కూడా రైతుకు ఊరటే. కానీ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు– కౌలు రైతులకు ఈ పథకం వర్తింపచేసే ప్రసక్తే లేదని. తెలంగాణలో ఎంతమంది రైతులు సొంతంగా వ్యవసాయం చేస్తున్నారు, ఎంత భూమి కౌలుదారుల చేతుల్లో ఉంది అనే లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? ఆ లెక్కలు తేల్చి ఈ పథకం అమలు చేస్తే ప్రజాధనం వృధా కాకుండా ఉంటుంది. పైగా పేద, ధనిక భేదం లేకుండా అందరికీ ఎకరానికి ఎనిమిది వేలు ఇస్తామనడం సరయినది కాదు.
తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం కారణంగా వందలు వేల ఎకరాల భూస్వాములు ఇప్పుడు లేరు. చిన్న కమతాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న మాట నిజమే. అట్లా ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులు వ్యవసాయం సొంతంగా చేసుకుంటారు కాబట్టి, ఈ తరహా భూములకు ఎనిమిది వేల రూపాయల సాయం అందించడం వల్ల తప్పక కొంత లబ్ధి జరుగుతుంది. కానీ ఇంకా తక్కువ సంఖ్యలోనే అయినా పదులూ, వందల ఎకరాల భూములు ఉండి కౌలుకు ఇచ్చుకుని వేరే వ్యాపారాలు, వృత్తులు చేసుకునే వాళ్లు కూడా చాలామంది ఉంటారు. ఈ సాయం వాళ్లకు కాకుండా కౌలు చేసే వాళ్లకు కదా వెళ్లాల్సింది! తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఎకరానికి ఏటా 8 వేల రూపాయల ఆర్థికసాయం మంచి ఆలోచనే అయినా రైతులను వేధిస్తున్న ఇతర సమస్యల మీద మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎంతో ఆర్భాటంగా ముఖ్యమంత్రి ప్రకటించిన రైతు సమాఖ్యల మీద పెద్ద పెట్టున విమర్శలు రావడంతో మళ్లీ వాటి ఊసే ఎత్తడంలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న జన్మభూమి కమిటీల లాగా కాకుండా రైతు సంక్షేమానికి పాటు పడే, న్యాయం జరిగేటట్టు చూసే ఒక ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయవలసిన అవసరం అయితే ఉంది. పంటకు గిట్టుబాటు ధర రాక, నాణ్యమైన విత్తనాలు లభిం చక, పంటల బీమా లేక ఊపిరి సలపక రైతుల ఉసురు తీస్తున్న ఉదంతాలు అనేకం. పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నా తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగలేదన్న సంగతి వాస్తవం. ముప్పిరిగొంటున్న ఈ సమస్యలన్నిటికీ తగిన పరిష్కారం చూపకుండా కేవలం 24 గంటలు విద్యుత్ సరఫరా చేసి, ఏడాదికి ఎనిమిది వేలు ఇచ్చినంత మాత్రాన రైతు పరిస్థితి బాగుపడదు. మిగిలిన రైతు సమస్యల పరిష్కారమూ ముఖ్యమేనని చెప్పడం అందుకే.
గడువు కంటే ముందుగానే వస్తాయంటున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్ర శేఖరరావు ఈ సమస్యలతో పాటు తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేసిన ముఖ్యమైన వాగ్దానాలు నెరవేర్చే ప్రయత్నం చేస్తేనే సాధ్యం. అంతేతప్ప చంద్రబాబునాయుడి మార్గంలో రాజకీయ పేకాటలో జోకర్ వంటి పవన్‌కల్యాణ్ లాంటి వాళ్లు సాయపడతారనుకుంటే పొరపాటు. తెలంగాణ రాష్ట్రంలో పేకాట క్లబ్‌లను మూయించి ఎన్నో కుటుంబాలను కాపాడిన ముఖ్యమంత్రికి బహుశా ఆ ఆట రాదేమో. పేకాటలో జోకర్‌లు ఎన్ని ఉన్నా ఒరిజినల్ సీక్వెన్స్ ఒకటి తప్పనిసరి. లేకపోతే ఆటలో ఓటమే.
దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com
Comments
Please login to add a commentAdd a comment