సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇక.. ఇవాల్టీ నుంచే విద్యాసంస్థలో ఉచిక విద్యుత్ అమలులోకి వస్తుందని, జీవో కూడా విడుదల చేశామని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని 27,862 విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందనుంది.
గురువారం రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ‘విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. విద్యతో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. గత పది సంవత్సరాల్లో ఇబ్బందులు పడ్డ ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు నిర్వహించింది మా ప్రభుత్వమే.
11,062 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహించాం, మరో 6వేల పోస్టులకు నోటిఫికేషన్ వేస్తాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. యూనివర్సిటీల మౌలిక వసతులకై రూ.300 కోట్లు కేటాయించాం. ప్రభుత్వ బడుల మౌలిక వసతుల కల్పనకు రూ.667 కోట్లు వెచ్చించాం. శానిటేషన్ వర్క్స్ ఏర్పాటుకు రూ. 136 కోట్లు విడుదల చేశాం. ప్రగతిశీల తెలంగాణ రాష్ట్రం నిర్మాణం కావడానికి ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో భట్టితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment