ఒక ఉప ఎన్నిక, ఒక ఉలికిపాటు
డేట్‌లైన్ హైదరాబాద్
నంద్యాల స్థానం కోసం చంద్రబాబునాయుడు ఎందుకు అంత తహతహలాడిపోతున్నారు? ఎందుకు తెలుగుదేశం పార్టీ వందల కోట్ల రూపాయలు వెదజల్లడానికి సిద్ధపడుతున్నది? పెద్ద సంఖ్యలో బడా నాయకులను, మంత్రులను నంద్యాలలో దింపుతున్నది? మూడేళ్లలో ఎన్నడూ నంద్యాల మొహం చూడని మున్సిపల్ మంత్రి నారాయణ ఇప్పుడు అక్కడే మకాం వేసి అభివృద్ధి జపం ఎందుకు చేస్తున్నారు? నంద్యాల ఉపఎన్నిక ఫలితం వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంకేతం కాబోతున్నదా?
భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల శాసనసభ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నిక మీద ఇవాళ అందరి దృష్టి పడింది. ఈ ఎన్నిక తీరుతెన్నులను పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తుంటే, రాజకీయ పక్షాలు, ముఖ్యంగా అధికార పక్షం ఉద్విగ్న క్షణాలను లెక్కపెట్టుకుంటున్నది. నిజానికి 175 స్థానాలు కల ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రస్తుతానికి అధికార తెలుగుదేశం పక్షానికి కావలసిన దానికన్నా ఎంతో ఎక్కువ మెజారిటీ ఉంది. బీజేపీ, పవన్ కల్యాణ్‌ల సహాయంతో తాను గెల్చుకున్న సీట్లే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుక్కున్న 20 మంది కూడా ఉన్నారు, కాబట్టి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల వరకు «ఢోకా లేదు. మరి ఎందుకు చంద్రబాబునాయుడు అంత టెన్షన్ పడుతున్నారు?
ఏపీ ముఖ్యమంత్రికి ఎందుకీ హైరానా?
వేర్వేరు కారణాల వల్ల అనేకసార్లు ఉప ఎన్నికలు వస్తుంటాయి. చాలా సందర్భాలలో అవేమీ ప్రభుత్వాలను తలకిందులు చేసే విధంగా ఉండవు. చాలా యాంత్రికంగా జరిగిపోతాయి. ఆ ఒక్క నియోజకవర్గ ఫలితం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందీ కలిగించ బోవడంలేదు. ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏమీలేదు. మరి ముఖ్యమంత్రికి ఈ ఆందోళన ఎందుకు? ఆ టెన్షన్‌లో ఆయన ఎందుకు మానసిక సమతౌల్యాన్ని కూడా కోల్పోయి ప్రజల మీద విరుచుకుపడుతున్నారు? రాష్ట్రం తన సొంతం అయినట్టూ, బొక్కసంలో ధనమంతా తన పూర్వీకులు కష్టపడి సంపాదిస్తే తాను మాత్రం ప్రజల కోసం ఖర్చు చేస్తున్నట్టూ భావించుకోవడం ఎందుకు? రాజరిక వ్యవస్థలో కూడా రాజులు ప్రజల బాగు కోసం చేసే ఖర్చు గురించి అట్లా అనుకుని ఉండరు. ఎందుకంటే రాజరిక వ్యవస్థలో అయినా, ప్రజాస్వామ్యంలో అయినా ఖర్చు చేసేదంతా ఆనాడు కప్పం రూపంలో, ఈనాడు పన్నుల రూపంలో ప్రజలు ఇచ్చిందే. అది ప్రజాధనమే కదా!
ప్రజాధనానికి తాము ధర్మకర్తలం అన్నమాట మరిచిపోయి విదేశీ, స్వదేశీ ప్రయాణాలకు, ప్రముఖులకు ఇచ్చే ఆడంబరపు విందు వినోదాలకు, తన సొంత నివాస సముదాయాలకు, ప్రజోపయోగం ఏ మాత్రం లేని ఆర్భాటాలకు తానూ, తన ప్రభుత్వం చేస్తున్నది వృ«థా ఖర్చు అని, ఆ దుబారా చేసే అధికారం తనకు ప్రజలు ఇవ్వలేదనీ ఎందుకు మరిచిపోతున్నారు? ‘నా బియ్యం తింటున్నారు, నేనిచ్చే పెన్షన్ డబ్బులు తింటున్నారు, నేనేసిన రోడ్ల మీద నడుస్తున్నారు, నేను పెట్టించిన దీపాల వెలుగులో ముందుకుపోతున్నారు’ అని బహిరంగ వేదిక మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. వయసు మీద పడుతున్న కారణంగా ఆయన మానసిక సమతౌల్యం కోల్పోయారనుకోవడం ఒకట యితే, అధికారం చేజారిపోయే క్షణాలు కళ్ల ముందు కనిపించడం రెండవది. ఈ రెండు కాక, మరొక కారణం ఇంకొకటి ఏదైనా ఉంటే ఆయనే చెప్పాలి, అదేమిటో. ఆయన మాట్లాడుతున్న మాటలూ, అడ్రస్ లేని సంస్థల చేత సర్వేలు చేయించుకుని మళ్లీ అధికారం తథ్యమని తన సొంత మీడియాలో ఊదరగొట్టించుకోవడం ఇవన్నీ ఆయన మానసిక ఆందోళనకు అద్దం పడుతున్నాయి. నా బియ్యం తింటున్నారు అంటున్నారు తప్ప, కనీసం నా ప్రభుత్వం అని కూడా అనేందుకు ఆయనకు నోరు రావడం లేదంటే ఆయన ప్రభుత్వంలోని సహచర మంత్రులు, నాయకులే ఆలోచించుకోవాలి తాము ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మంత్రులమా, లేకుంటే రాజు గారి దగ్గర బంటులమా అన్న విషయం.
ఆసిఫ్‌నగర్ ఎన్నికను గుర్తు చేసుకోండి!
ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఉప ఎన్నికలు తరచూ వస్తూనే ఉంటాయి. కొన్ని సందర్భాలలో అవి ప్రతిష్టాత్మకం కూడా కావచ్చు. ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించేవిగా కూడా ఉండవచ్చు. కానీ రానున్న కొద్దిరోజుల్లో జరగబోయే నంద్యాల ఉప ఎన్నిక అలాంటి కోవలోకి వచ్చేది కాదు. ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడు మరణిస్తే అక్కడ ఉప ఎన్నిక అవసరం ఏర్పడింది. పార్టీ పోటీ చెయ్యాలనుకుంటే అభ్యర్థిని ప్రకటించి, పార్టీ స్థానిక శాఖకు బాధ్యతలు వదిలిపెడితే సరిపోతుంది. నంద్యాల ఉపఎన్నిక అనేసరికి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రాగానే జరిగిన ఆసిఫ్‌నగర్ ఉప ఎన్నిక గుర్తొస్తుంది. దానం నాగేందర్ రాజశేఖరరెడ్డి శిష్యుడు. (ఆయన లేరు కాబట్టి ఇప్పుడు కాదంటారేమో) 2004 ఎన్నికలప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డి. శ్రీనివాస్ నాగేందర్‌కు అభ్యర్థిత్వం రాకుండా చేశారు (ఈ మేరకు ప్రచారం అయితే జరిగింది). రాత్రికి రాత్రి నాగేందర్ తెలుగుదేశంలో చేరి అదే ఆసిఫ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టికెట్ తెచ్చుకున్నారు. గెలిచి ఎమెల్యే అయ్యారు. తెలుగుదేశం ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నాగేందర్ టీడీపీని వీడి తిరిగి కాంగ్రెస్ గూటిలో చేరారు. చంద్రబాబు లాగా రాజశేఖరరెడ్డి నాగేందర్‌కు కాంగ్రెస్ కండువా కప్పేసి అసెంబ్లీలో కూర్చోబెట్టలేదు. మంత్రి పదవీ ఇవ్వలేదు. పైగా నాగేందర్‌ను శాసనసభ స్థానానికి రాజీ నామా చేయించి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి మళ్లీ అదే ఆసిఫ్‌నగర్ నుంచి పోటీ చేయించారు.ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక విషయంలో చంద్రబాబు పట్టుదలకు పోతున్నట్టు ఆనాడు రాజశేఖరరెడ్డి పంతానికి పోలేదు. పంతం పట్టి గెలిపించుకునే కుయుక్తులు పన్నలేదు. ఆ ఉప ఎన్నికలో నాగేందర్ ఓడిపోయారు. నాగేందర్ అట్లా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కుప్పిగంతులు వెయ్యడం ఆసిఫ్‌నగర్ ప్రజలకు నచ్చలేదు మరి. రాజశేఖరరెడ్డి ఏమీ ఆసిఫ్‌నగర్ ప్రజలను ఆడిపోసుకోలేదు. మరెందుకు చంద్రబాబు అంత అసహనంగా ఉన్నారు నంద్యాల ప్రజల మీద?
సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు
నంద్యాల ఉపఎన్నిక విషయంలో మరోకోణం గురించి కూడా చర్చించాలి. అక్కడ ఉపఎన్నిక రావడానికి కారణం ఎంఎల్‌ఏ భూమా నాగిరెడ్డి మరణం. భూమా నాగిరెడ్డి ఏ పార్టీ ఎమ్మెల్యే? శాసనసభ స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన ఇటీవలి బులెటిన్ ప్రకారం కూడా ఆయన వైఎస్సార్‌సీపీ శాసనసభ్యుడు. తెలుగుదేశం పార్టీ సంప్రదాయాలను గురించి మాట్లాడుతున్నది. అదే సంప్రదాయం ప్రకారం అయితే న్యాయంగా ఆ స్థానాన్ని మళ్ళీ వైఎ స్సార్ సీపీకే వదిలెయ్యాలి. కానీ, చంద్రబాబు, ఆయన పార్టీ వాదన ఎంత విచిత్రంగా ఉన్నాయంటే నాగిరెడ్డిని భయపెట్టో, బతిమాలో, ప్రలోభపెట్టో తమ పార్టీలోకి ఫిరాయింప చేసుకున్నది చాలక, మరణించే నాటికి ఆయన తమ శిబిరంలో ఉన్నాడు కాబట్టి ఆ స్థానాన్ని తమకు వదిలెయ్యడమే సంప్రదాయం, ఆ సంప్రదాయాన్ని వైఎస్సార్ సీపీ పాటించడం లేదని నిష్టురమాడుతున్నది.సెంటిమెంట్‌ను వాడుకోడం కోసం చంద్రబాబు నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియను ఏకగ్రీవం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం దగ్గరికి, ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి దగ్గరికి పంపినట్టు కూడా వార్తలొచ్చాయి. 2014 ఎన్నికల సమయంలో ఆళ్లగడ్డ వైఎస్సార్ సీపీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి ప్రమాదంలో చనిపోతే ఆ ఎన్నిక వాయిదా వేయించడానికి తెలుగుదేశం పార్టీ చేసిన ప్రయత్నాలను అఖిలప్రియ అంత తొందరగా మరిచిపోవడం ఆశ్చర్యం. నాగిరెడ్డి వైఎస్సార్ సీపీ తరఫున గెలిచి రాష్ట్రంలో ప్రతిపక్షం భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసి ఉంటే, ఆయన టీడీపీ టికెట్ మీదనే గెలిచి మరణించి ఉంటే ఇప్పుడు సంప్రదాయాన్ని పాటించలేదని వైఎస్సార్ కాంగ్రెస్‌ను నిందిస్తే అర్ధం ఉండేది. ప్రతిపక్షాన్నే గుర్తించను, నా రాష్ట్రంలో ప్రతిపక్షం అనే దే ఉండకూడదు అంటున్న చంద్రబాబును ఆయన అధికారాన్ని ప్రతిపక్షం మాత్రం ఎందుకు గుర్తించాలి? ఎందుకు మర్యాదలు పాటించాలి?
ఎన్నికల సంఘం నిఘా అవసరం
ఒక్క నంద్యాల స్థానం కోసం చంద్రబాబునాయుడు ఎందుకు అంత తహతహలాడిపోతున్నారు? ఎందుకు తెలుగుదేశం పార్టీ వందల కోట్ల రూపాయలు వెదజల్లడానికి సిద్ధపడుతున్నది? పెద్ద సంఖ్యలో బడా నాయకులను, మంత్రులను నంద్యాలలో దింపుతున్నది?మూడేళ్లలో ఎన్నడూ నంద్యాల మొహం చూడని మున్సిపల్ మంత్రి నారాయణ ఇప్పుడు అక్కడే మకాం వేసి అభివృద్ధి జపం ఎందుకు చేస్తున్నారు? నంద్యాల ఉపఎన్నిక ఫలితం వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంకేతం కాబోతున్నదా? కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నిక మీద డేగ కన్ను వేస్తే మంచిది.
- దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com