
'ఓటర్లు విపక్షాల చెంప చెల్లుమనిపించారు'
-ప్రతిపక్షాల విమర్శలకు ఈ ఫలితాలే సమాధానం
-ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
హన్మకొండ : వరంగల్ జిల్లా ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారని, ఇది తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఓటర్లు విపక్షాల చెంప చెల్లుమనిపించారని చెప్పారు. హన్మకొండలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన ఎంపీలు బోయినిపల్లి వినోద్‌కుమార్, ఆజ్మీర సీతారాం నాయక్, గుండు సుధారాణి, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు దాస్యం వినయబాస్కర్, ఆరూరి రమేష్, బానోత్ శంకర్‌నాయక్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ప్రతిపక్షాల నాయకులు దిగజారుడు, వ్యక్తిగత విమర్శలు చేశారని, ఆ విమర్శలకు ఈ ఫలితమే సమాధానమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ చెంప చెల్లుమనేలా తీర్పు ఇవ్వాలని పదే పదే వారు మాట్లాడారని, అయితే ప్రజలు ప్రతిపక్షాలకు డిపాజిట్ దక్కకుండా వారి చెంపచెల్లుమనేలా తీర్పు ఇచ్చారని చెప్పారు.
17 మాసాల ప్రభుత్వ పనితీరు, అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు సంతృప్తి చెందిన ఓటర్లు ఈ విజయాన్ని అందించారన్నారు. దేశ వ్యాప్తంగా ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు అయినా వస్తాయని, ఈ ఎన్నికలో ప్రతిపక్షాలతో పాటు ఎవరికీ డిపాజిట్ రాకుండా ఓడించారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చవకబారు విమర్శలు చేశారని దుయ్యబట్టారు. ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రభుత్వంపై, పార్టీపై మరింత బాధ్యత పెంచిందన్నారు. ఈ నెల 26 నుంచి జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లో పత్తి రైతుల సమస్యలపై మాట్లాడాలని సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ ఎంపీలకు సూచించారని, ఎంపీలు పార్లమెంట్‌లో గళమెత్తుతారని చెప్పారు.