* అన్నదాతకు వైఎస్ జగన్ భరోసా
* పంటలు నష్టపోయిన రైతన్నకు ఆత్మీయ పలకరింపు
* వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు పరామర్శ
* రైతుల బాధలు చూడాలంటూ సీఎంకు సూచన
* జననేతకు ఘనస్వాగతం పలికిన జిల్లా వాసులు
సాక్షి, అమరావతి బ్యూరో: జననేత వైఎస్ జగన్ రాక పల్నాడు రైతుల్లో భరోసా కల్పించింది. భారీ వర్షాలు, వరదలు పోటెత్తడంతో పంట నష్టపోయి.. మనోనిబ్బరం కోల్పోయి తల్లడిల్లుతున్న రైతన్న ఆత్మీయ నేత పలకరింపుతో ఊరడిల్లాడు. ప్రభుత్వం నుంచి సాయం కొరవడి, కనీసం ఆదుకుంటామనే మాట చెప్పడానికి కూడా ముందుకు రాని సర్కారు తీరుపై కినుక వహించిన రైతులకు భరోసా కల్పిస్తూ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు పర్యటన సాగింది. పల్నాడు ప్రాంతాల్లో వర్షాల ధాటికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడానికి, రైతులను పరామర్శించడానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటన సోమవారం ఉదయం పొందుగల వద్ద నుంచి ప్రారంభమైంది.
ప్రభుత్వమే ఆదుకోకపోతే ఎలా బతుకుతారు?
పంట కోల్పోయిన ఆవేదనలో ఉన్న అన్నదాతలను ఆదుకోవడానికి ఆకాశమార్గాన చక్కర్లు కొడితే సరిపోదని, భూమార్గానికి వచ్చి రైతుల బాధలను చూడాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత సూచించారు. ప్రభుత్వమే రైతులను ఆదుకోకపోతే ఎలా బతుకుతారంటూ సర్కారును నిలదీశారు. ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు సాయం అందేలా వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని రైతన్నలకు హామీ ఇచ్చారు. దాచేపల్లిలోని ఎస్సీ కాలనీలో ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించిన జననేత చలించిపోయారు. కాలనీ పక్కనే ఉన్న కాటేరువాగు పొంగిపొర్లడంతో జలమయమైన కాలనీలో కాలినడకన తిరిగిన జగన్ వరద తీవ్రతతో నష్టపోయిన కుటుంబాలను పరామర్శించారు. వరదల్లో నష్టపోయిన ఎస్తేరు అనే ఓ మహిళ జగన్ వద్దకు వచ్చి ప్రభుత్వం నుంచి సాయం అందలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. వరద ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించడానికి ఆదివారం ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కాలనీలోకి రాకుండా రోడ్డుపై నుంచే వెళ్లిపోయాడని, బాబు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయింది. అధైర్యపడకు.. అండగా ఉంటానని ఆమెకు వైఎస్ జగన్ భరోసా కల్పించారు. హైవే బ్రిడ్జి నిర్మాణ లోపం వల్లే ఈ కాలనీలోకి నీళ్లు వస్తున్నాయని స్థానికులు తెలుపడంతో.. నేషనల్ హైవేస్ అథారిటీకి లేఖ రాయాలని పార్టీ నేతలకు సూచించారు.
వైఎస్‌కు ఘన నివాళులు..
దాచేపల్లి ఎస్సీ కాలనీ నుంచి గురజాలకు బయలుదేరిన ౖÐð ఎస్ జగన్‌కు రహదారికి ఇరువైపులా జనం నీరాజనం పట్టారు. జగన్ నడికుడిలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి కొత్త అంబాపురం చేరుకున్నారు. ఆ గ్రామ ప్రజలు పూలతో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడా వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం గురజాల బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్న జననేతకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి, వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన జగన్ ఘనంగా నివాళులర్పించారు. తర్వాత గురజాల నుంచి జంగమహేశ్వరపురం, చర్లగుడిపాడు, లక్ష్మీపురం మీదుగా మిరియాల గ్రామానికి చేరుకుని వరద ఉధృతికి తెగిపడిన చెరువు కట్టను పరిశీలించారు. అంతకుముందు చర్లగుడిపాడు, మిరియాల అడ్డరోడ్డు వద్ద జననేతకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో వైఎస్ జగన్ వెంట.. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జంగా కృష్ణమూర్తి, మోపిదేవి వెంకటరమణ, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, లాల్‌పురం రాము, కిలారి రోశయ్య, రావి వెంకటరమణ, కావటి మనోహర్‌నాయడు, ఆతుకూరి అంజనేయులు, శ్రీకృష్ణదేవరాయ, అన్నాబత్తుని శివకుమార్, కత్తెర హెని క్రిస్టినా, పి.వెంకటరామిరెడ్డి, దేవడ్ల రేవతి, కోలకలూరి కోటేశ్వరరావు, వనమా బాల వజ్రబాబు (డైమండ్) తదితరులు పాల్గొన్నారు.