రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామినవుతా
రెండు రోజుల్లో కేసీఆర్‌ను కలుస్తా: విజయరామారావు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి రాజీ నామా చేసిన సీబీఐ మాజీ డెరైక్టర్, మాజీ మంత్రి కె.విజయరామారావు టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైంది. ఆయన్ను సముదాయిం చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రయత్నం విఫలమైంది. రాజీనామా వ్యవహారంపై శుక్రవారం రాత్రి విజయరామారావుతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు... శనివారం ఉదయం మరోసారి ఆయనకు ఫోన్ చేసి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దన్నా రు. అయితే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు అప్పటికే సిద్ధమైన విజయరామరావు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ నేపథ్యంలోరాష్ట్ర మంత్రి కేటీఆర్ శనివారం విజయరామారావును ఆయ న నివాసంలో కలసి టీఆర్‌ఎస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు.
అందుకు కేవీఆర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారన్నారు. రెండు రో జుల్లో కేసీఆర్‌ను కలుస్తానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామి అవుతున్నం దుకు సం తోషంగా ఉందన్నారు. ఖైరతాబాద్‌కు చెందిన పలువురు టీడీపీ నాయకులతో కలసి విజయరామారావు కేసీఆర్ సమక్షంలో త్వరలో లాంఛనంగా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
జానా, బాబు మారలేదా: విజయరామారావును కలసిన అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పార్టీలు మారే హక్కు, స్వేచ్ఛ అందరికీ ఉందన్నారు. ‘‘జానారెడ్డి పార్టీ మారలేదా? చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వారే కదా. జానారెడ్డి, చంద్రబాబు పార్టీలు మారొచ్చుగానీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పార్టీలు మారితే తప్పా’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌లోకే ఇతర పార్టీల నేతలు వలస వచ్చి చేరినట్లు, తమ పార్టీ చేయకూడని తప్పేదో చేసినట్లు ప్రతిపక్షాలు మాట్లాడటం సరికాదన్నారు. ప్రజల జ్ఞాపకశక్తిని శంకించొద్దని, ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి చేరారో వారికి తెలుసన్నారు.
షబ్బీర్ అలీకి బెదిరింపు ఫోన్‌కాల్‌పై స్పందిస్తూ ఆయన్ను బెదిరించే ధైర్యం తమ పార్టీకి ఉందా? అని ఎద్దేవా చేశారు. ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలిసిందని, దానిపై విచారణ జరుపుతామన్నారు. తమ పార్టీ కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడే ప్రసక్తే లేదన్నారు. విద్యావంతులు ఓటు హక్కు వినియోగించుకోరనే భావన గతంలో ఉండే దని, దానిని చెరిపేసిన ఘనత విజయ రామారావుదేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఖైరతాబాద్‌లో విజయరామారావుకు ప్రజలు బ్రహ్మరథంపట్టి గెలిపించారని, ఆయన లాంటి వ్యక్తుల అవసరం తెలంగాణకు ఉందన్నారు.