ఐఏఎస్.. ఈ మూడక్షరాల పదవి భారత సివిల్ సర్వీసుల్లో అత్యున్నతమైనది.
- అసిస్టెంట్ కలెక్టర్‌గా పార్వతీపురం కుర్రాడు
- ముస్సోరీలో పూర్తయిన శిక్షణ
- పశ్చిమబంగలో అసిస్టెంట్ కలెక్టర్‌గా నియామకం
- విధుల్లో చేరేముందు ఆర్‌సీఎం పాఠశాల సందర్శన
- జ్ఞాపకాలను నెమరేసుకున్న యువ ఐఏఎస్
పార్వతీపురం (విజయనగరం) : ఐఏఎస్.. ఈ మూడక్షరాల పదవి భారత సివిల్ సర్వీసుల్లో అత్యున్నతమైనది. పాలనలో కీలకమైన ఈ ఉద్యోగం అఖిల భారతీయ స్థాయిలో ఎందరికో తీరని కల. అది సాధించేందుకు ఆ యువకుడు పరితపించాడు.. పరిశ్రమించాడు. పట్టుదలతో కైవసం చేసుకున్నాడు. పదిమందికీ స్ఫూర్తినిస్తున్నాడు. ఢిల్లీకి రాజైనా జన్మభూమికి బిడ్డే.. అందుకే రెండ్రోజుల్లో ఉద్యోగంలో చేరేముందు జన్మనిచ్చిన పార్వతీపురం గుర్తొచ్చింది. అంతే..జన్మభూమిపై వాలిపోయాడు. విద్యాబుద్దులు నేర్పిన పాఠశాలను సందర్శించాడు. పిల్లలతో ఆటపాటలతో ఆనందంగా గడిపాడు. లక్ష్య సాధనకు మెలకువలను వివరించాడు. అందరి అభినందనలు మూటగట్టుకుని విధుల్లో చేరేందుకు బయల్దేరాడు. అతనే యువ ఐఏఎస్ అధికారి పల్లి శ్రీకాంత్.
పార్వతీపురానికి చెందిన శ్రీకాంత్ గత ఏడాది ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఇటీవలే ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పూర్తయింది. ఈ నెల 20న పశ్చిమబంగ రాష్ట్రం ముర్షిదాబాద్ అసిస్టెంట్ కలెక్టర్‌గా విధుల్లో చేరాలి. దానికి ముందు రెండు రోజులు సెలవు దొరకడంతో పార్వతీపురం వచ్చారు. ఓనమాలు నేర్పిన ఆర్‌సీఎం (బాలురు) పాఠశాలను శనివారం సందర్శించారు.
లక్ష్యం సమున్నతమైతే ఏదైనా సాధ్యమే
పాఠశాల హెడ్మాస్టర్ జేమ్స్ మాస్టారు, ఇతర ఉపాధ్యాయులతో భేటీ అయిన శ్రీకాంత్ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. హైస్కూల్ చదువులోనే మనసులో గట్టిగా లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలని సూచించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, శారీరక, మానసిక మార్పులు లక్ష్యానికి విఘాతం కల్పించినా, మొక్కవోని దీక్షతో ముందుకు సాగితే విజయం వరించడం తధ్యమన్నారు. పిల్లలు అడిగిన ప్రశ్నలకు చక్కగా, ఓపికగా సమాధానాలు చెప్పి వారిని ఆకట్టుకున్నారు.
గుర్తుకొస్తున్నాయి..
పాఠశాలలోని తరగతి గదిలో గతంలో తాను కూర్చున్న బెంచీలో పిల్లల మధ్య గడిపి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం మాట్లాడుతూ తనకు బంగారు భవితను ప్రసాదించిన పార్వతీపురంలోని ప్రతి ఒక్కరికీ.. చదువుకున్న పాఠశాలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్వతీపురం పట్టణానికి మంచి పేరు తీసుకొస్తానన్నారు.